తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Cinema Theaters : షాపింగ్‌ చేస్తే సినిమా టిక్కెట్లు ఫ్రీ.. మూవీలవర్స్​కు ఎగ్జిబిటర్ల ఆఫర్ - cinema theaters in Hyderabad

కరోనా మహమ్మారి భయంతో థియేటర్ల(Cinema Theaters)కు దూరమైన ప్రేక్షకులను రప్పించేందుకు ఎగ్జిబిటర్లు నానారకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వారాంతాల్లో కళకళలాడుతున్న థియేటర్లు.. సోమ నుంచి గురువారాల్లో వెలవెలబోతున్నాయి. ఈ నాలుగు రోజుల్లోనూ సినిమా సందడి కనిపించేలా.. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎగ్జిబిటర్లు రకరాల డీల్స్ ఆఫర్ చేస్తున్నారు.

Cinema Theaters
Cinema Theaters

By

Published : Oct 10, 2021, 9:36 AM IST

‘‘సినిమా టిక్కెట్‌ కొంటే పాప్‌కార్న్‌ ఉచితం’’ ‘‘షాపింగ్‌ చేస్తే రెండు టిక్కెట్లు ఫ్రీ’’

కొవిడ్‌తో థియేటర్‌(Cinema Theaters), మల్టీప్లెక్స్‌లకు దూరమైన ప్రేక్షకులను తిరిగి రప్పించేందుకు ఎగ్జిబిటర్లు చేస్తున్న ప్రయత్నాలివి. ముఖ్యంగా సోమవారం నుంచి గురువారం వరకు ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. శుక్రవారం కొత్త సినిమాల విడుదలతో కొంత సందడి కనిపిస్తోంది. శని, ఆదివారం వారాంతం కావడంతో ప్రేక్షకులు క్రమంగా పెరుగుతున్నారు. ఎటొచ్చి మిగతా రోజుల్లో వినోదం వైపు చూసేవారి సంఖ్య స్వల్పంగా ఉంటోంది. అందుకే ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేందుకు ఎగ్జిబిటర్లు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉప్పల్‌, అత్తాపూర్‌లో మల్టీస్క్రీన్లు కల్గిన ఒక ప్రముఖ ఎగ్జిబిటర్‌ టిక్కెట్‌ కొంటే పాప్‌కార్న్‌ ఉచితం అంటున్నారు. అది కూడా పరిమిత రోజులు, పరిమిత షోలకే ఇస్తున్నారు. గతంలో ఒక ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ, మల్టీప్లెక్స్‌తో ఒప్పందం చేసుకుని నిర్ధారిత మొత్తం షాపింగ్‌ చేసినవారికి రెండు టిక్కెట్లు ఉచితంగా అందజేసింది. ఇవన్నీ చూస్తుంటే మున్ముందు వినోదం కొంత పుంతలు తొక్కబోతుంది.

ఓటీటీ యుగంలో సవాల్‌!

ఓటీటీ యుగంలో.. అందునా కొవిడ్‌ సమయంలో ప్రేక్షకులను థియేటర్‌(Cinema Theaters)కు రప్పించడం పెద్ద సవాల్‌. థియేటర్‌లో ఒక టిక్కెట్‌ ధరలో ఓటీటీలో ఇంటిల్లిపాది ఆస్వాదిస్తున్నారు. వీటిని అధిగమించేందుకు మల్టీప్లెక్స్‌లో పాప్‌కార్న్‌ ఉచితంగా ఇస్తాం అంటున్నారు ప్రదర్శకులు. మరికొందరు మరింత మంచి అనుభూతి కల్పించేందుకు స్క్రీన్లను ఆధునికీకరించారు. మరో ప్రముఖ మల్టీప్లెక్స్‌ సంస్థ థియేటర్లలో క్రీడలు ప్రదర్శించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

కుటుంబ సమేత ప్రేక్షకులు పెరగాల్సి ఉంది

కొవిడ్‌ తర్వాత చాలావరకు థియేటర్లు(Cinema Theaters) తెరచుకున్నాయి. వీటిలో ప్రదర్శించే కొత్త సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వ్యక్తమవుతోంది. మిగతా వర్గాలన్నీ వస్తున్నా.. కుటుంబ సమేతంగా ప్రేక్షకులు పెరగాల్సి ఉంది. టిక్కెట్‌తో పాటూ పాప్‌కార్న్‌ కొన్ని షోలకు ఉచితంగా ఇస్తున్నాం. తెలంగాణలో 1100 థియేటర్లు, స్క్రీన్లు ఉంటే వెయ్యికిపైగా నడుస్తున్నాయి.

- సునీల్‌ నారంగ్‌, నిర్మాత, ఎగ్జిబిటర్‌, ఏషియన్‌ సినిమాస్‌

భయపెడుతున్న ధరలు

థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం ఇష్టం. కానీ అక్కడ తినుబండారాల ధరలు భయపెడుతున్నాయి. నీటి సీసాను సైతం రూ.80కి విక్రయిస్తున్నారు. ఇంకా కొవిడ్‌ భయం తగ్గలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా మొదటి ప్రాధాన్యం ఓటీటీనే. మనకు తీరిక ఉన్నప్పుడు చూసుకునే వెసులుబాటు ఇందులో ఉంది.

-లక్ష్మి, విద్యార్థిని, హైదర్‌నగర్‌

ABOUT THE AUTHOR

...view details