ఫిబ్రవరి 1 నుంచి థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతినిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంపై సినీ ప్రముఖులు, నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో కలిగిన నష్టాల నుంచి కోలుకునేందుకు మార్గం దొరికిందని అన్నారు. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ సినిమా థియేటర్లకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేశారు.
సినీ ఇండస్ట్రీకి ఊరట లభించడంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతించడం మంచి విషయమని అన్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్కు కృతజ్ఞతలు తెలిపారు.