తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టాలీవుడ్​లో రూపొందిన ఉత్తమ ప్రేమకథా చిత్రాలు! - టాలీవుడ్​లో ఎవర్​గ్రీన్​ ప్రేమకథా చిత్రాలు

రెండు మనసుల ప్రణయ ఘోష.. ప్రేమ! నాలుగు కళ్ల మూగ భాష.. ప్రేమ! ప్రేమలో పడితే - ఓ కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది. ప్రేమిస్తే - ఓ కొత్త బంధం మనదవుతుంది. కానీ, నిజానికి ప్రేమలో పడిన ప్రతి జంటకు ఏదో ఒకరూపంలో కష్టాలు ఎదురవుతాయి. ఆ కష్టాల కడగండ్లను దాటిన కొన్ని కథలు సుఖాంతమైనా.. మరికొన్ని కథలు విషాదంగా ముగిశాయి. అయితే టాలీవుడ్​లోనూ అలాంటి నేపథ్యంతో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. అందులో ఉత్తమ ప్రేమకథా చిత్రాలేవో తెలుసుకుందాం.

evergreen love story movies of tollywood
టాలీవుడ్​లో రూపొందిన ఉత్తమ ప్రేమకథా చిత్రాలు!

By

Published : Feb 11, 2021, 5:26 PM IST

ప్రేమ అనే పదం ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్​గ్రీన్. ప్రతి ప్రేమకథలో ఓ విలన్​ కచ్చితంగా ఉంటాడు. కానీ, కొన్ని కథలకు విలన్​ బాధ లేకపోయినా.. విధి వారి పాలిట శాపంగా మారుతుంది. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా.. కొన్ని ప్రేమకథలు సుఖాంతమవుతాయి. మరికొన్ని విషాదంగా ముగుస్తాయి. ఇలాంటి వాటినే స్ఫూర్తిగా తీసుకుని టాలీవుడ్​లో అనేక చిత్రాలను రూపొందించారు. అప్పటి 'దేవదాసు' చిత్రం నుంచి నిన్నటి 'ఉప్పెన' వరకు ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్ని చిత్రాలు సినీ అభిమానులు మనసులో చెరగని ముద్ర వేసుకున్నాయి. ఆదివారం (ఫిబ్రవరి 14) ప్రేమికుల దినోత్సవం సందర్భంగా టాలీవుడ్​లో వచ్చిన ఉత్తమ లవ్​స్టోరీ సినిమాలేంటో చూద్దాం.

దేవదాసు (1953)

దేవదాసు (1953)

ప్రేమకథా చిత్రాలు అంటే తెలుగునాట మొదటగా గుర్తొచ్చేది అలనాటి 'దేవదాసు'. అక్కినేని నాగేశ్వరరావు నటప్రస్థానంలో ఇదే కలికితురాయిగా నిలిచిపోయింది. దేవదాసుగా అక్కినేని నాగేశ్వరరావు.. పార్వతి పాత్రలో సావిత్రి జీవించేశారు. విషాదంతో సమాప్తమయ్యే ఈ చిత్రం ఎవర్​గ్రీన్​ ప్రేమకథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

గీతాంజలి (1989)

దర్శకుడు మణిరత్నం రూపొందించిన అద్భుతమైన ప్రేమకథా దృశ్యకావ్యం 'గీతాంజలి'. ఇందులో అక్కినేని నాగార్జున, గిరిజా షెట్టర్​ హీరోహీరోయిన్లుగా నటించారు. కేన్సర్​​తో బాధపడే హీరోహీరోయిన్ల ప్రేమ గెలిచిందా? చివరికి ఏం జరిగిందనేది కథాంశం. ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధించడమే కాకుండా ప్రేక్షకుల మనసును దోచేసింది. ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకోవడం సహా ఏడు నంది అవార్డులను దక్కించుకుంది.

గీతాంజలి

తొలిప్రేమ (1998)

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​కు స్టార్​డమ్​ తెచ్చిన చిత్రం 'తొలిప్రేమ'. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతోమందికి ఫేవరేట్​గా మారిపోయింది. కరుణాకరన్​ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది.

తొలిప్రేమ

బాలు అనే కాలేజీ కుర్రాడు.. అనుకోకుండా ఒకరోజు ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కోసం వెతకని చోటంటూ ఉండదు. అనుకోకుండా ఓ రోజు ఆమె ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. ఆ తర్వాత వారిద్దరికి కారు ప్రమాదం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? హీరోహీరోయిన్లు ఏ విధంగా కలిశారు అనేది సినిమా.

శీను (1999)

విక్టరీ వెంకటేశ్​, ట్వింకిల్​ ఖన్నా కలిసి నటించిన చిత్రం 'శీను'. ఇందులో వెంకటేశ్​ పెయింటర్​గా కనిపించారు. అమెరికాకు చెందిన ఓ యువతి శీనుకు పరిచయమవుతుంది. శీనుకు మాటలు రావని భ్రమ పడి.. అతడిపై జాలి చూపిస్తుంది. ఇది కాస్త ప్రేమగా మారుతుంది. అయితే ఆమె ప్రేమ కోసం ఏకంగా తన నాలుకను కట్ చేసుకుని.. ప్రేమ కోసం శాశ్వతంగా శీను మూగవాడైపోతాడు.

శీను

వెంకటేశ్​.. తన సినీ కెరీర్​లో అనేక ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. అందులో 'ప్రేమ','ప్రేమించుకుందాం రా!', 'ప్రేమంటే ఇదేరా' వంటి చిత్రాలు ఉన్నాయి.

నువ్వేకావాలి (2000)

నువ్వేకావాలి

బాల్య స్నేహితులు ప్రేమికులుగా ఎలా మారారు? ఈ సమయంలో వారిద్దరికి ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరకు వారిద్దరూ కలిశారా? అనేది కథ. ఈ సినిమాలో తరుణ్​, రిచా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం గతేడాదితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.

చిత్రం (2000)

చిత్రం

జానకి అనే యువతి చదువుకోవడానికి అమెరికా నుంచి ఇండియాకు వస్తుంది. కాలేజీలో చేరిన తర్వాత రమణ అనే యువకుడు ఆమెకు పరిచయమవుతాడు. ఆ తర్వాత వారిద్దరి స్నేహం ప్రేమగా మారుతుంది. అంతలోనే ఆ యువతి గర్భం దాలుస్తుంది. పెళ్లి కాకుండా గర్భవతి కావడం వల్ల ఆమె ఎదుర్కొన్న సమస్యలేమిటి? చివరికి వారి ప్రేమ గెలిచిందా? అనేది కథాంశం. ఇందులో హీరోగా ఉదయ్ కిరణ్​.. హీరోయన్​గా రీమా సేన్​ నటించారు.

ఖుషి (2001)

ఖుషి

ఒకే కాలేజీకి చెందిన యువతీయువకులైన స్నేహితుల మధ్య అపార్థంతో మనస్ఫర్థలు ఏర్పడతాయి. తర్వాత ఆ అపార్థాలు సమసిపోయి.. ఒకరి గురించి ఒకరు తెలుసుకుని.. ఎలా ప్రేమలో పడతారనేది? సినిమా సారాంశం. ఇందులో పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​, భూమిక తమతమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఎప్పుడూ గొడవ పడే ప్రేమికుల పాత్రల్లో లీనమైపోయారు.

నువ్వునేను (2001)

నువ్వునేను

ధనిక కుటుంబానికి చెందిన రవి అనే కుర్రాడు.. పాల వ్యాపారి కుమార్తె వసుంధరతో ప్రేమలో పడతాడు. వారి ఇరు కుటుంబాలు ప్రేమను అంగీకరించవు. ఏడాది పాటు ఒకర్నిఒకరు కలవకుండా వారిద్దర్ని బంధిస్తారు. చివరికి వారిద్దరి కుటుంబాలు ప్రేమను అంగీకరించాయా? ప్రేమ కథ సుఖాంతం అయ్యిందా? అనేది సినిమా స్టోరీ. ఇందులో ఉదయ్​ కిరణ్​, అనిత హీరోహీరోయిన్లుగా నటించారు.

ఆర్య (2004)

ఆర్య

అజయ్​ అనే కుర్రాడు.. గీత అనే అమ్మాయి ప్రేమించకపోతే కాలేజీపైకి ఎక్కి దూకేస్తా అని బెదిరించి, ఆమె ప్రేమను సాధిస్తాడు. అదే సమయంలో ఆమె జీవితంలోకి ఆర్య అనే వ్యక్తి వస్తాడు. ఆ అమ్మాయిని ఆర్య కూడా ప్రేమిస్తాడు. అయితే చివరకు ఆమె ఎవర్ని ప్రేమిస్తుందనేది కథాంశం. ఇందులో అల్లుఅర్జున్​ హీరోగా.. అను మెహతా హీరోయిన్​గా నటించారు. దర్శకుడు సుకుమార్​కు ఇదే మొదటి చిత్రం. శివబాలాజీ.. అజయ్​ పాత్రను పోషించారు.

నువ్వొస్తానంటే నేనొద్దాంటానా (2005)

నువ్వొస్తానంటే నేనొద్దంటానా!

స్నేహితురాలి పెళ్లిలో కలుసుకున్న సిరి (త్రిష), శ్రీరామ్​ (సిద్ధార్థ్​)ల మధ్య ప్రేమ పుడుతుంది. అయితే ధనికురాలైన శ్రీరామ్​ తల్లి వీరిద్దరి ప్రేమను అంగీకరించదు. అదే పెళ్లిలో సిరి వాళ్ల అన్నయ్యను అవమానిస్తుంది శ్రీరామ్ తల్లి. అయితే ఆమె ప్రేమను సాధించడానికి శ్రీరామ్​కు సిరి వాళ్ల అన్నయ్య ఓ షరతు పెడతాడు. అందులో హీరో నెగ్గాడా? చివరికి వాళ్లిద్దరూ ఎలా కలిశారనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

ఆరెంజ్​ (2010)

ఆరెంజ్

రామ్​ అనే యువకుడిని జాను అనే అమ్మాయి ప్రేమిస్తుంది. అయితే ప్రేమ కొంతకాలమే బాగుంటుందనేది అతడి ఫిలాసఫి. అందుకే ఆమెను జీవితాంతం ప్రేమించడానికి ఒప్పుకోడు. గతంలో అతడికి ఎదురైన అనుభవాలే దానికి కారణం. రామ్​ చివరికి ప్రేమ గురించి తెలుసుకున్నాడా? జాను ప్రేమను అంగీకరించాడా? అనేది సినిమా. ఇందులో మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​, జెనీలియా హీరోహీరోయిన్లుగా నటించారు.

అర్జున్​ రెడ్డి (2017)

యువ కథానాయకుడు విజయ్​ దేవరకొండ హీరోగా.. శాలినీ పాండే హీరోయిన్​గా నటించిన చిత్రమిది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. టాలీవుడ్​లో అతి తక్కువ బడ్జెట్​తో రూపొంది బిగ్గెస్ట్​ బ్లాక్​బాస్టర్​గా నిలవడం సహా విజయ్​కు స్టార్​డమ్​ను తెచ్చిపెట్టింది.

అర్జున్​ రెడ్డి

అర్జున్​రెడ్డి దేశ్​ముఖ్​ అనే వైద్యుడు మద్యానికి బానిస అవుతాడు. అతడు ప్రేమించిన అమ్మాయి మరొక వ్యక్తిని వివాహం చేసుకోవడమే ఇందుకు కారణం. అయితే చివరికి ఏం జరిగింది? అర్జున్​ తిరిగి మామూలు మనిషిగా మారి.. మద్యాన్ని మానేస్తాడా?. అతడు పూర్తిగా మారిపోవడానికి గల కారణాలేంటి? అనేదే సినిమా.

మజిలీ (2019)

నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత చైతూతో సమంత కలిసి నటించిన మొదటి చిత్రం 'మజిలీ'. వీరిద్దరి కెరీర్​లో 'ఏ మాయ చేశావే!' తర్వాత ఇది మరో మంచి ప్రేమకథగా నిలిచింది. మజిలీ చిత్రం వీరిద్దరి సినిమా కెరీర్​లో సూపర్​హిట్​గా నిలిచింది.

మజిలీ

పూర్ణ (నాగచైతన్య), అన్షు(దివ్యాంక్ష కౌశిక్​) ప్రేమించుకుంటారు. అయితే వారిద్దరి ప్రేమను అమ్మాయి తండ్రి అంగీకరించకుండా.. ఆమెకు ఇంకొకరితో వివాహం చేస్తాడు. ఆ తర్వాత పూర్ణ మద్యానికి బానిస అవుతాడు. అనుకోకుండా అతడి పొరుగింట్లో ఉండే శ్రావణి(సమంత) పూర్ణను ప్రేమిస్తుంది. అది హీరోకు తెలియదు. ఆ తర్వాత పూర్ణ.. శ్రావణిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. వివాహం అయినా పూర్ణ సంతోషంగా ఉండడు. కానీ తర్వాత తన భార్య.. తనపై అమితమైన ప్రేమతో ఉందని పూర్ణ తెలుసుకుంటాడు. అనంతరం ఏం జరిగింది? అనేది సినిమా.

ఇవీ చూడండి:ఒకటి కాదు.. అంతకుమించిన చిత్రాలతో సిద్ధం!

సినిమాలే కాదు దైవభక్తీ ముఖ్యమే!

చిన్నప్పుడే హీరోయిన్​గా ఎంపికై.. ప్రేక్షకులకు దగ్గరై

ABOUT THE AUTHOR

...view details