తెలంగాణ

telangana

By

Published : Jan 27, 2021, 11:55 AM IST

ETV Bharat / sitara

అందరూ మెచ్చే ఆహ్లాదకర సిరీస్.. కంబాలపల్లి కథలు

తెలుగు సినిమా కథ.. ఇన్నాళ్లు నేల వీడిచిసాము చేసింది. ఇక కథలేం లేవా అనేంతగా ప్రేక్షకుల్లో విసుగు తెప్పించింది. కానీ ఇటీవల కొన్ని సినిమాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతున్నాయి. సహజత్వానికి దగ్గరగా ఉంటూ.. ఇలాంటి కథలే కదా కావల్సింది అనేంతలా ఆకట్టుకుంటున్నాయి. తరిచి చూస్తే కొదవలేని కథలెన్నో మన చుట్టూనే ఉన్నాయని...యువ దర్శక, రచయితలు...వైవిధ్యమైన చిత్రాలతో నిరూపిస్తున్నారు. ప్రతిభ ఉన్న యువ నటీనటులతో అందరూ మెచ్చే ఆహ్లాదకర సినిమాలకు చిరునామాగా నిలుస్తున్నారు. అలాంటి కథే... కంబాలపల్లి కథలు.

Kambalapally Kathalu web series
కంబాలపల్లి కథలు

ఇప్పుడిప్పుడే మూస నుంచి బయటకువస్తోంది... తెలుగు సినిమా. కదిలించే చక్కటి సినిమాలు జయకేతనం ఎగరవేస్తున్నాయి. థియేటర్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న ఓటీటీలు అందుకు వేదికలుగా నిలుస్తున్నాయి. అలా వచ్చిన కంబాలపల్లి కథలు సిరీస్‌లో మెుదటిభాగమైన మెయిల్‌ అందరితో "ఆహా" అనిపిస్తోంది. కంప్యూటర్ వచ్చిన కొత్తలో పల్లెల్లో పరిస్థితులు, యువత అమాయకత్వాన్ని అందంగా ఆవిష్కరించింది... మెయిల్‌.

కంబాలపల్లి కథలు

హాస్టల్​లో ఉంటూ షూటింగ్

మెయిల్ ద్వారా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఉదయ్ గుర్రాల దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం కాగా.. యువ ప్రతిభావంతులు.. అభినయంతో ఆకట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. లాక్‌డౌన్ సమయంలో షూటింగ్ జరగటం... హైదరాబాద్ నుంచి వచ్చిన చిత్రబృందానికి ఎవరూ వసతి కల్పించక పోవటంతో.. అక్కడే ఓ బాలుర వసతి గృహంలో ఉండి షూటింగ్‌ పూర్తి చేశారు.

అదరగొట్టిన హర్షిత్

లోకం తీరు తెలీని అమాయకత్వం, సాధించాలనే పట్టుదల గల రవి పాత్రలో మెప్పించాడు యువ నటుడు హర్షిత్. హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి. చదువుతోపాటు అభిరుచికి అనుగుణంగా ప్రదర్శనలిస్తూ..ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టేవాడు. అవి చూసే ఉదయ్.. మెయిల్‌లో ప్రధానపాత్రకు ఎంపిక చేశాడు. 20 రోజులు శిక్షణ అనంతరం పాత్రలో ఒదిగిపోయాడు హర్షిత్‌.

పాత్రకు ప్రాణం పోసింది..

పల్లెటూరి అమ్మాయిగా...కళ్లతోనే పాత్రకు ప్రాణం పోసిన అమ్మాయి గౌరి. రోజా పాత్రలో నటించిన ఆమెకి ఇదే తొలి సినిమా. పాఠశాల స్థాయి నుంచే సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపుతున్న గౌరి.. 12 ఏళ్లుగా గాయనిగా రాణిస్తోంది. సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల నుంచి డిగ్రీ చేసింది. 2018లో మిస్ హైదరాబాద్ విజేత. వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని... అడుగుపెట్టిన రంగంలో రాణించటం గౌరి నైజం. తగినట్లే తొలి చిత్రంతోనే సినీ పరిశ్రమను ఆకట్టుకుంది.

శెభాష్ సుబ్బు..

రవి స్నేహితుడు సుబ్బు పాత్రతో శభాష్ అనిపించుకున్నాడు బోయినపల్లికి చెందిన మణి ఏగుర్ల. నటుడవ్వాలన్న తపనతో పలు లఘుచిత్రాల్లో నటించాడు. సినిమాల్లో కొన్ని అవకాశాలు వచ్చినా అవేవి విడుదల కాలేదు. ఇప్పుడు మెయిల్‌తో అనుకున్న గుర్తింపు సాధించాడు.

సూపర్ సన్ని

ఇక.. సన్ని పల్లె. మెదక్ జిల్లా పోచారం నుంచి ఫిల్మ్‌నగర్ చేరాడీ కుర్రాడు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఫొటోలు తీస్తూనే సినిమా ఆడిషన్స్‌కు వెళ్లేవాడు. దొరసాని సినిమాలో తొలిసారిగా తెరపై కనిపించి ఆకట్టుకున్నాడు. మెయిల్‌లో సురేష్‌గా మెప్పించాడు.

కల నిజమైంది..

నటిగా తెరపై కనిపించాలని పుష్కరకాలంగా తపించిన యువ ఆర్కిటెక్ట్ అనూష మెయిల్‌తో ఆ కల నెరవేర్చుకుంది. గిరిజ పాత్రలో ఫస్ట్ క్లాస్ అంటూ ప్రేక్షకులు పలకరించేలా చేసుకుంది. నాంపల్లిలో వ్యాపారం చేసుకుంటూ జీవించే బొమ్మకంటి రవీందర్ కూడా... నటుడవ్వాలని కలలు నిజం చేసుకుంటూ.. వందలమందితో పోటీపడి శివన్నగా విలనీ ఛాయలున్నా పాత్రలో ప్రేక్షకుల్ని అలరించాడు.

మన కథే.. సినిమా...

ఈ ప్రతిభావంతుల్ని ఒడిసిపట్టి కంబాలపల్లి కథలకు ప్రాణం పోసిన దర్శకుడు ఉదయ్ గుర్రాల. మహబూబాబాద్ జిల్లాలో పుట్టి పెరిగిన ఉదయ్ హైదరాబాద్ జేఎన్‌టీయూలో 2009లో ఫొటోగ్రఫీ కోర్సు పూర్తి చేశాడు. సినిమాటోగ్రాఫర్‌గా పలు చిత్రాలకు పనిచేసిన ఉదయ్... తన చుట్టూ జరిగిన సంఘటనల ఆధారంగా కథలుగా రాసుకునేవాడు. అలా రాసిన కథే మెయిల్. 2014లోనే ఈ కథను సిద్ధం చేసుకున్న ఉదయ్... అశ్వినీదత్ కుమార్తె స్వప్నదత్‌ నిర్మాతగా ముందుకు రావటంతో తెరకెక్కించాడు.

మన చుట్టూనే ఉన్నాయ్...

మెయిల్ లాంటి కథలెన్నో మనచుట్టూనే ఉన్నాయంటోన్న ఉదయ్.. కథలో ఉన్నది ఉన్నట్లు చూపగలిగితే ప్రతిభాషలో ఎన్నో మంచి చిత్రాలు చూడొచ్చంటున్నాడు. త్వరలోనే కంబాలపల్లి కథల్లో చాప్టర్ 2 మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. మరికొన్ని కొత్తముఖాలు సినీపరిశ్రమకు పరిచయం చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు.

దూసుకెళ్తాం...

కంబాలపల్లి కథలతో తొలి విజయం రుచి చూసిన ఈ యువ బృందం.. మరిన్ని విజయాలను అందుకోవాలని తపనతో భవిష్యత్‌ ప్రణాళికలు రచిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details