తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్​ కండలవీరుడు.. మంచి మనసున్నోడు! - సల్మాన్‌ ఖాన్​ కేసులు

విభిన్న చిత్రాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సల్మాన్ ఖాన్.. బాలీవుడ్​ అగ్ర హీరోల్లో ఒకరు. నటుడు, నిర్మాత, రచయిత, గాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సేవా కార్యక్రమాలతో ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించారు. ఆదివారం(డిసెంబరు 27) ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కథనం.

etv bharat special story about bollywood star salman khan on his 55th birthday
ఈ బాలీవుడ్​ కండలవీరుడిది కొండంత మనసు!

By

Published : Dec 27, 2020, 5:31 AM IST

బాలీవుడ్‌లో ఖాన్‌త్రయం మధ్య ఎప్పుడూ పోటీయే! సల్మాన్‌ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్‌ ఖాన్‌ ముగ్గురూ మంచి స్నేహితులు. ముగ్గురూ పుట్టింది 1965లోనే. వారి మధ్య ఎప్పుడూ స్నేహపూర్వక పోటీ సాగుతూనే ఉంటుంది. ఇందులో చిన్నవాడు(నెలల తేడాలో) సల్మాన్‌ ఖాన్‌. ఒక్క నటనకే పరిమితం కాకుండా నిర్మాతగా, గాయకుడిగా అభిమానులను అలరించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థానం ఆక్రమించిన వందమంది సినిమా నటుల జాబితాను ఫోర్బ్స్‌ సంస్థ రూపొందిస్తే అందులో సల్మాన్‌ కచ్చితంగా ఉంటారు. సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు భాయ్​జాన్. నిరుపేద యువకులకు విద్యాదానం, పేద కుటుంబాలకు వైద్య సహాయం అందించే ధ్యేయంతో 'బీయింగ్‌ హ్యూమన్‌' అనే ఛారిటీ సంస్థని స్థాపించి అర్హులను ఆదుకుంటున్నారు. కొన్ని వివాదాస్పద సంఘటనలు ఇతని మీద ఉన్నాయి. 'హిట్‌ అండ్‌ రన్‌' కేసులో, కృష్ణ జింకలను వేటాడిన కేసులో అభియోగాలు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న వ్యక్తిగా సల్మాన్‌ను మరో కోణంలో చూడాలి. డిసెంబరు 27 ఈ కండల వీరుని 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సల్మాన్‌ గురించి కొన్ని విషయాలు మీకోసం.

సల్మాన్ సినీ ప్రయాణం..

ప్రముఖ రచయితలు సలీం-జావేద్‌ జంటలోని సలీంఖాన్‌ పెద్ద భార్య సుశీల చరక్‌ కుమారుడు సల్మాన్‌ ఖాన్‌. ఇతడి తల్లి హిందూ మతస్థురాలు. సల్మాన్‌ పెద్ద కుమారుడు, అర్బాజ్‌ ఖాన్, సోహైల్ ఖాన్‌ తమ్ముళ్లు. వాళ్లిద్దరూ సినీ నిర్మాతలు. అల్విరా సల్మాన్‌కు సోదరి. వారిది మత సామరస్యాన్ని ఆచరణలో చూపిన కుటుంబం. 1965 డిసెంబరు 27న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు సల్మాన్‌. తారాచంద్‌ బర్జాత్యా కుమారుని వివాహంలో దర్శకుడు కె.అమరనాథ్‌ సలీంఖాన్‌ను చూసి 'బరాత్‌' సినిమాలో అవకాశమివ్వడం వల్ల వారి కుటుంబం ముంబయికి మకాం మార్చింది. 1988లో జె.కె.భండారి దర్శకత్వంలో 'బీవీ హో తో ఐసీ' లో తొలిసారి వెండితెర మీద సహాయనటుడిగా కనిపించాడు సల్మాన్. పైగా అతనికి వేరే వాళ్లు డబ్బింగ్‌ చెప్పారు. తారాచంద్‌ బర్జాత్యా తీసిన 'మైనే ప్యార్‌ కియా'(1989) హీరోగా నటించిన తొలి చిత్రం. నిర్మాణానికి రెండు కోట్లు ఖర్చు పెడితే రూ.28 కోట్లు వసూలయ్యాయి. ఆ సంవత్సరం విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సాధించింది. తెలుగులో 'ప్రేమపావురాలు' పేరుతో డబ్‌ చేస్తే ఆరు కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకోవడమే కాకుండా విశాఖపట్నంలో సిల్వర్‌ జూబ్లీ జరుపుకొంది. తర్వాత తమిళం, మలయాళం, స్పానిష్‌ భాషల్లోనూ ఈ సినిమాను డబ్‌ చేశారు.

జూడ్వా, ప్యార్​ కియా తో డర్​ నా క్యా చిత్రాల్లో సల్మాన్​

తిరుగులేని ప్రభావం..

'మైనే ప్యార్‌ కియా' సినిమా అఖండ విజయం తర్వాత 1990లో సల్మాన్‌ నటించిన 'భాగి' (ఎ రెబెల్‌ ఫర్‌ లవ్‌) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించింది. దీపక్‌ శివదాసని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ సమకూర్చింది సల్మాన్‌ ఖాన్‌ కావడం విశేషం. పదహారేళ్ల నగ్మాకు హీరోయిన్‌గా బాలీవుడ్‌లో అదే మొదటి అడుగు. ఆ సంవత్సరం విడుదలైన సినిమాలలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రం కూడా ఇదే. రాజ్​కుమార్‌ సంతోషి దర్శకత్వంలో వచ్చిన 'అందాజ్‌ అప్నా అప్నా' అనే కామెడీ చిత్రంలో ఆమిర్‌ ఖాన్‌తో కలిసి సల్మాన్‌ నటించారు. సరైన ప్రచారం లేకపోవటం వల్ల పెద్ద పట్టణాల్లో ఆదరణ దక్కలేదు. సల్మాన్‌ ఖాన్‌ మార్కెట్‌ పెంచిన చిత్రం మాత్రం రాజశ్రీ ప్రొడక్షన్స్‌ నిర్మించిన 'హమ్‌ ఆప్కే హై కౌన్‌'. వంద వారాలు అప్రతిహతంగా ఆడిన ఈ చిత్రం.. 90వ దశాబ్దంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా చరిత్రపుటలకెక్కింది. ఈ రికార్డు ఏడు సంవత్సరాల పాటు పదిలంగా వుంది. తెలుగులో 'ప్రేమాలయం' పేరుతో దీనిని డబ్‌ చేశారు. ఈ చిత్రానికి ఐదు ఫిలింఫేర్‌ బహుమతులతోపాటు, జనరంజకమైన సినిమాగా జాతీయ బహుమతి లభించింది. ఈ చిత్రంతోనే సల్మాన్‌ ఖాన్‌ సూపర్‌ స్టార్‌ హోదా అందుకున్నారు. 1998లో కాజోల్‌ సరసన నటించిన 'ప్యార్‌ కియాతో డర్నా క్యా' చిత్రం పెద్ద హిట్టయింది. కరణ్‌ జోహర్‌ నిర్మించిన 'కుచ్‌ కుచ్‌ హోతా హై' సినిమాలో షారుఖ్‌ ఖాన్‌తోపాటు సల్మాన్‌ నటించాడు. 2003లో సతీష్‌ కౌల్‌ దర్శకత్వం వహించిన 'తేరే సనమ్' సల్మాన్‌ ఖాన్‌ అప్పటి దాకా నటించిన సినిమాలలోకెల్లా గొప్ప చిత్రమని చెప్పవచ్చు. అంతకుముందు తమిళంలో వచ్చిన 'సేతు' సినిమాకు ఈ చిత్రం రీమేక్‌. ఈ హీరో 'మేరిగోల్డ్‌' అనే హాలీవుడ్‌ సినిమాలోనూ నటించారు. అయితే ఈ చిత్రం అంతగా ఆడలేదు. ఆ సమయంలోనే సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ వాళ్లు '10 కా దమ్' అనే గేమ్‌ షోను సల్మాన్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

మై నే ప్యార్​ కియా

సూపర్‌ స్టార్‌ హోదాలో..

2009.. సల్మాన్‌ ఖాన్‌ నటజీవితంలో ఒక టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పవచ్చు. తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచిన పూరి జగన్నాథ్‌ చిత్రం 'పోకిరి'ని బోనీ కపూర్‌ 'వాంటెడ్‌' పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. ప్రభుదేవా ఆ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా అత్యధిక వసూళ్లతో రికార్డు సృష్టించింది. 2010లో సల్మాన్‌ ఖాన్‌ తన తమ్ముడు అర్బాజ్‌ ఖాన్‌ నిర్మాతగా 'దబంగ్‌' చిత్రం నిర్మించాడు. భయమెరుగని పోలీసు అధికారి పాత్రలో సల్మాన్‌ ఖాన్‌ చెలరేగిపోయాడు. అభినవ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించింది. రంజాన్‌ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అత్యధిక వసూళ్లను రాబట్టింది. జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాగా బహుమతి గెలుచుకుంది. తెలుగులో శీను వైట్ల నిర్మించిన 'రెడీ', అలాగే మలయాళ చిత్రం 'బాడీగార్డ్‌'ని పునర్నిర్మిస్తే అందులో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించాడు. కబీర్‌ ఖాన్‌ నిర్మించిన 'బజరంగి భాయిజాన్‌' అద్భుత విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ హీరో తన​ సోదరి అర్పితాఖాన్​ భర్త ఆయుష్​ శర్మ ప్రధానపాత్రలో 'అంతిమ్​: ది ఫైనల్​ ట్రూత్​' సినిమాలో నటిస్తున్నారు. మహేశ్​ మంజ్రేకర్​ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పూర్తిస్థాయి యాక్షన్​ డ్రామాగా రూపుదిద్దుకుంటోందీ చిత్రం.

సల్మాన్​ నటించిన విభిన్న చిత్రాలు

మరిన్ని విశేషాలు...

  • 2011లో సల్మాన్‌ఖాన్‌ ఎస్‌.కె.బి. హెచ్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో చిత్రనిర్మాణ సంస్థను నెలకొల్పాడు. వచ్చే లాభాలను 'బీయింగ్‌ హ్యూమన్‌' అనే ధార్మిక సంస్థకు తరలించి, తద్వారా పేద ప్రజానికానికి విద్య, వైద్యం కల్పించే పథకాన్ని అమలు చేసున్నాడు. ఈ కంపెనీ పేరు మీద సల్మాన్‌ ఖాన్‌ నిర్మించిన తొలి చిత్రం 'చిల్లర్‌ పార్టీ'. ఈ బాలల చిత్రానికి మూడు జాతీయ బహుమతులు వచ్చాయి.
  • 2014లో సల్మాన్‌ఖాన్‌ ఎస్‌.కె.యఫ్‌ (సల్మాన్‌ ఖాన్‌ ఫిలిమ్స్‌) పేరుతో మరొక చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పాడు. ఈ బ్యానర్‌ మీద 'డాక్టర్‌ క్యాబీ' అనే కెనడియన్‌ ఫిలిం నిర్మించాడు. కెనడాలో ఈ చిత్రం బాగా హిట్‌ అయి మంచి వసూళ్లు నమోదు చేసింది. తరవాత ఈ బ్యానర్‌ మీదే స్మాష్‌ హిట్లు 'హీరో', 'బజరంగి భాయిజాన్‌' సినిమాలు నిర్మించి మంచి పేరుతోపాటు అధిక వసూళ్లు కూడా రాబట్టాడు.
  • సల్మాన్‌ ఖాన్‌ను బాలీవుడ్‌ పరిశ్రమ 'లాంచ్‌ ప్యాడ్‌'గా అభివర్ణిస్తూ వుంటుంది. ఎంతోమంది కొత్త ముఖాలను పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత సల్మాన్‌ది. ఇతడు పరిచయం చేసిన వారిలో నగ్మా, భూమిక చావ్లా, స్నేహ ఉల్లాల్, కత్రినా కైఫ్‌ ఉన్నారు. హృతిక్‌ రోషన్, అర్జున్‌ కపూర్‌లకు నటనలో మెళకువలు నేర్పింది సల్మాన్‌ ఖానే.
  • ప్రపంచంలోని గొప్ప అందగాళ్లలో ఒకడుగా గుర్తింపు పొందిన సల్మాన్‌కు ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌తో లోతైన ప్రేమ వ్యవహారం ఉంది. ఐశ్వర్య కంటే ముందు సల్మాన్‌కు సంగీతా బిజిలాని, సోనమ్‌ ఆలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
    సల్మాన్​ఖాన్, కత్రినాకైఫ్​
  • సల్మాన్‌ మంచి భోజన ప్రియుడు. అతడు షూటింగ్‌లో ఉంటే సహచర నటీనటులకు భోజన సదుపాయాలు సల్మాన్‌ ఖానే చేస్తుంటాడు. ఒకసారి తన సొంత సినిమా షూటింగ్‌ కోసం లండన్‌ వెళితే తనవెంట బిర్యాని చేసేందుకు స్పెషలిస్ట్‌ చెఫ్‌ని తనతో తీసుకువెళ్లాడు. దాంతో యూనిట్‌ మొత్తం సల్మాన్‌కు ధన్యవాదాలు చెప్పింది. ఈ విషయం తెలిసిన కొందరు అభిమానులు ముంబయిలో 'భాయిజాన్‌' పేరుతో ఒక రెస్టారెంటు తెరిచారు. సల్మాన్‌ ఫెవరేట్‌ డిష్‌లు అన్నీ అక్కడ లభ్యమౌతాయి.
  • సల్మాన్‌ ఖాన్‌ మంచి ఈతగాడు, చిత్రకారుడు కూడా. సల్మాన్‌ వేసిన చిత్రాలను ఆమిర్‌ ఖాన్‌కొని తన ఇంటి గోడలకు తగిలించాడు. 'జై హో' పోస్టర్‌కు రూపురేఖలు ఇచ్చింది సల్మాన్‌ ఖానే. తండ్రి సలీం ఖాన్‌ లాగే సల్మాన్‌ కూడా మంచి రచయిత కూడా. 'వీర్‌', 'చంద్రముఖి' సినిమాలకు రచయిత అతడే. కానీ రచయితగా తండ్రికి వచ్చిన పేరు సల్మాన్‌కు రాలేదు.
  • సల్మాన్‌ ఖాన్‌ నిరాడంబరంగా ఉండేందుకు ఇష్టపడతాడు. ఎక్కువగా టీషర్టులు ధరించేందుకు మొగ్గు చూపుతాడు. సల్లూ‌ వేసుకునే టీషర్టుల ఖరీదు ఐదు వందలకు మించవు.

వివాదాలు...

2002లో అర్ధరాత్రి మద్యం మత్తులో అతివేగంతో ఒక బేకరీ పక్కనున్న పేవ్మెంట్‌ మీద నిద్రిస్తున్న బిచ్చగాళ్ల మీదనుంచి కారు నడిపి అరెస్టయ్యాడు. ఆ ప్రమాదంలో ఒకరు చనిపోగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సల్మాన్‌ మీద మోపిన ఆరోపణలు రుజువు కాలేదని బాంబే హైకోర్టు ఈ కేసు కొట్టేసింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ కేసును ఛాలెంజ్‌ చేసింది. 'హమ్‌ సాథ్‌ సాథ్‌ హై' సినిమా షూటింగుకు జోధ్​పుర్​కు వెళ్లినప్పుడు సల్మాన్‌ ఖాన్, సైఫ్‌ అలీ ఖాన్, సోనాలి బింద్రే, టబు, నీలంలు కృష్ణ జింకల వేటకు అడవికి వెళ్ళారు. అక్కడ కృష్ణజింకలను వేటాడి చంపారనే అభియోగాన్ని ఎదుర్కొని జైలు శిక్షకు గురవ్వగా రాజస్థాన్‌ హైకోర్టు శిక్షను పక్కన పెట్టింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. సల్మాన్‌ ఖాన్‌కు రెండు అభియోగాలమీద ఇస్లామిక్‌ పెద్దలు ఫత్వా జారీ చేశారు. మొదటిది లండన్‌ లోని 'మేడమ్‌ టుస్సాడ్‌' మ్యూజియంలో సల్మాన్‌ ఖాన్‌ మైనపు ప్రతిమను పెట్టడం మీద, రెండవది గణేష్‌ ఉత్సవాలలో సల్మాన్‌ ఖాన్‌ పాల్గొనడం. ఏది ఏమైనా సల్మాన్‌ ఖాన్‌ మాచెడ్డ మంచోడు.

సల్మాన్​ఖాన్, ఐశ్వర్యారాయ్

బాలీవుడ్ బిగ్​ బాస్

హిందీ ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వీక్షకులను తనవైపు తిప్పుకున్న షో బిగ్​ బాస్. ప్రస్తుతం 14వ సీజన్​ నడుస్తోంది. ఈ షోకు పదకొండు సీజన్ల నుంచి సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం విశేషం. సరదాలతో పాటు ఎన్నో వివాదాలను సృష్టిస్తోన్న ఈ షో ప్రేక్షకులకు మాత్రం మజానిస్తోంది.

బిగ్​బాస్​ వ్యాఖ్యాతగా సల్మాన్

ఇదీ చూడండి:షారుక్​ 'పఠాన్' చిత్రీకరణలో సల్మాన్​!

ABOUT THE AUTHOR

...view details