తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అందుకే చెడు వ్యసనాల వైపు వెళ్లలేదు'

తెలుగు సినీ చరిత్రలో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అగ్రనిర్మాత సురేష్‌ బాబు దగ్గుబాటి. ఈరోజు ఆయన‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

etv bahrat special story about telugu star producer Suresh babu on his birthday
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం.. సురేష్​బాబు సొంతం!

By

Published : Dec 24, 2020, 5:33 AM IST

మూవీ మొఘల్‌గా ఖ్యాతి పొందిన తండ్రి సినీ నిర్మాణ వారసత్వం.. సోదరుడు విక్టరీ స్టార్‌గా విఖ్యాతినందుకున్న వైనం.. ఆయనను అనివార్యంగా నిర్మాతగా మలిచాయి. సినీ నిర్మాణం ఒడుదొడుకులతో కూడినదని తరచూ తండ్రి.. చెప్పినప్పటికీ ఆయన సినీ నిర్మాణంలోనే స్థిరపడ్డారు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు తీసి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయనే సురేష్​బాబు దగ్గుబాటి. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని పలు ఆసక్తికరమైన విశేషాలు..

క్రమశిక్షణాయుత వ్యక్తిత్వం..

సినీ ఆకర్షణల మధ్య ఉన్నా క్రమశిక్షణాయుత జీవితాన్ని అలవర్చుకున్న వ్యక్తి సురేష్‌ బాబు. మరీ ముఖ్యంగా తాగుడు వ్యసనాన్ని అస్సలు దరికిరానీయని నైజం ఆయనది. అదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్తూ తన నాన్న (రామానాయుడు) సినిమాల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు తాతగారు తాగుడులాంటి వాటికి దూరంగా ఉండమని చెప్పారని గుర్తు చేసుకున్నారు. నాన్నగారి స్నేహితులైన కొంతమంది నిర్మాతలు తాగుడుకు బానిసై జీవితాన్ని ఎంతలా దుర్భరం చేసుకున్నారో కళ్లారా చూశానని చెప్పారు. ఇక.. అమ్మాయిల విషయంలో కూడా ఆకర్షణలో పడని వ్యక్తిత్వాన్ని సముపార్జించుకున్నానని చెప్పారు.

నిర్మాత సురేష్​ బాబు
కుటుంబ నేపథ్యం..

ప్రముఖ తెలుగు నిర్మాత డి.రామానాయుడు తనయుడు సురేష్‌ బాబు. తల్లి పేరు రాజేశ్వరి దగ్గుబాటి. ప్రముఖ నటుడు వెంకటేష్‌ సోదరుడు. మద్రాస్‌లోని డాన్‌ బాస్కో స్కూల్‌లో సురేష్‌ బాబు విద్యాభ్యాసం జరిగింది. లయోల కళాశాలలో ప్రీ యూనివర్సిటీ కోర్స్‌ను చదివారు. 1981లో మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. సురేష్‌ బాబు భార్య పేరు లక్ష్మి. వీరికి ముగ్గురు పిల్లలు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఈయన కుమారుడే. సురేష్‌ బాబు, లక్ష్మీ దంపతులకు మాళవిక దేవి దగ్గుబాటి, అభిరాం దగ్గుబాటి అనే మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
కెరీర్..‌

1982లో 'దేవత' సినిమాతో సినిమా కెరీర్‌ని మొదలుపెట్టినా 1990లో వెంకటేష్, దివ్యభారతి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన 'బొబ్బిలి రాజా' సినిమాతో నిర్మాతగా తన పేరును బయటపెట్టడం మొదలుపెట్టారు సురేష్‌ బాబు. ఆయన నిర్మించిన సినిమాల జాబితాలో.. 'సూపర్‌ పోలీస్‌', 'నీకు నేను నాకు నువ్వు', 'సోగ్గాడు', 'బలాదూర్‌', 'మసాలా', 'భీమవరం బుల్లోడు', 'అవును 2', 'నేనే రాజు నేనే మంత్రి', 'ఈ నగరానికి ఏమైంది?', 'ఓ బేబీ', 'వెంకీ మామ' తదితర చిత్రాలు ఉన్నాయి. ప్రసుతం 'అసురన్‌' అనే తమిళ సినిమా తెలుగు రీమేక్‌ బాధ్యతలతో బిజీగా ఉన్న సురేష్‌ బాబు 'హిరణ్య కశ్యప' అనే మరో సినిమా బాధ్యతల్ని కూడా చూసుకుంటున్నారు. 'అసురన్‌' తెలుగు రీమేక్‌లో వెంకటేష్‌ నటిస్తుండగా.. 'హిరణ్య కశ్యప' సినిమాలో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

నిర్మాత సురేష్​ బాబు
సమర్పకుడిగా..

'అష్టా చెమ్మ', 'నమో వెంకటేశా', 'గోల్కొండ హై స్కూల్‌', 'ఈగ', 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌', 'ఉయ్యాలా జంపాల', 'హోరా హోరి', 'తాను నేను', 'పెళ్లి చూపులు', 'పిట్టగోడ', 'మెంటల్‌ మదిలో' సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించిన సురేష్‌ బాబు ప్రస్తుతం ఆయన కుమారుడు రానా దగ్గుబాటి నటిస్తోన్న 'విరాటపర్వం' సినిమాకు కూడా ప్రెజెంటర్‌గా బాధ్యతలు తీసుకున్నారు.

నిర్మాత సురేష్​ బాబు

పురస్కారాలు..

తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎన్నో సక్సెస్‌ ఫుల్‌ సినిమాల ద్వారా మర్చిపోలేనటువంటి వినోదాన్ని పంచి ఇచ్చిన సురేష్‌ బాబుని ఎన్నో పురస్కారాలు కూడా వరించాయి. 1999లో వెంకటేష్, సిమ్రాన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన 'కలిసుందాం రా' సినిమాకు ఉత్తమ తెలుగు చలన చిత్రంగా ఓ జాతీయ సినిమా పురస్కారం లభించింది. 1998లో 'గణేష్‌' సినిమాకు ఉత్తమ చలన చిత్ర జాతీయ కాంస్య నంది పురస్కారాన్ని అందుకొన్నారు. 1999లో 'కలిసుందాం రా' చిత్రానికి ఉత్తమ చలన చిత్రంగా ఓ నంది పురస్కారం లభించింది. 2003లో 'నీకు నేను నాకు నువ్వు' సినిమాకు, 2004లో 'మల్లీశ్వరి' చిత్రానికి బెస్ట్‌ హోమ్‌ వ్యూయింగ్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌గా నంది పురస్కారాలు లభించాయి. 2015లో 'దృశ్యం' సినిమాకు టీఎస్సార్​‌ - టీవీ9 నుంచి ఉత్తమ సినిమాగా ఓ పురస్కారం లభించింది. 2012లో నాగిరెడ్డి చక్రపాణి జాతీయ పురస్కారం కూడా సురేష్‌ బాబు ఖాతాలో పడింది.

ఔత్సాహిక నిర్మాతలకు సూచనలు..

కొత్తగా సినిమాలు తీయాలని ఇండస్ట్రీకి వచ్చే నిర్మాతలు సినీ నిర్మాణం మీదనే దృష్టి పెట్టాలని.. ఎవరో మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోకూడదని సురేష్‌ బాబు చెప్తున్నారు. ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగం గురించి సాధికారికత సంపాదించుకోవాలని ఆయన అన్నారు. అలా కాకుండా డబ్బు ఉంది సినిమా తీద్దామని వచ్చి చేతులు కాల్చుకోకూడదని ఆయన సూచించారు.
మరికొన్ని బాధ్యతలు..

2011-12 సంవత్సరానికిగానూ ఏపీ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు అధ్యక్షుడిగా సురేష్​ బాబు సేవలు అందించారు. ఆయన 2015 నుంచి 2017 వరకు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టిఎఫ్‌సిసి) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పేరు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌గా మారిన తరువాత మొదటి అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి సురేష్‌ బాబు.

ఇదీ చూడండి:‌చివరి వరకు ఆ సినిమా తీయలేకపోయిన ఎన్టీఆర్​!

ABOUT THE AUTHOR

...view details