తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెండితెరపై ఏ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ - bollywood news

బాలీవుడ్​ ముద్దుల హీరో ఇమ్రాన్ హష్మీ పుట్టినరోజు నేడు. 42వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఇతడి గురించి ప్రత్యేక కథనం.

వెండితెరపై ఏ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ
ఇమ్రాన్ హష్మీ

By

Published : Mar 24, 2020, 6:02 AM IST

హీరోయిన్ల పెదాలపై ముద్దుల ముద్ర వేసే ఆనవాయితీ ఉన్న హీరో. బాలీవుడ్‌లో రొమాంటిక్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌. అధర చుంబనాల చూసేందుకు ప్రేక్షకులు అతడి సినిమాలకు వస్తారు. సీరియల్‌ కిస్సర్‌గా వినోద ప్రపంచంలో గుర్తింపు పొందిన ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అతడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.

హీరో ఇమ్రాన్ హష్మీ

ముద్దుల వెనుక విషాదం

ఇమ్రాన్‌ హష్మీ, కెమెరా అసూయపడేలా వెండితెరపై హీరోయిన్లను ముద్దాడుతాడనే ప్రచారం ఉంది. అయితే వాటి వెనుక ఉన్న విషాదం మాత్రం అతడి గుండె దిగువన ఉన్న తడికి మాత్రమే తెలుసు. ఔను ఇది నిజం. సీరియల్‌ కిస్సర్‌గా పేరొందిన ఇమ్రాన్‌.. రచయితగా తానూ అనుభవిస్తున్న విషాదాన్ని అక్షరాల్లోకి మలిచాడు. బిలాల్‌ సిద్ధిక్‌ సహా రచయితగా ఇతడు రాసిన పుస్తకం పేరులోనూ కిస్‌ ఉంది. 'ద కిస్‌ ఆఫ్‌ లైఫ్‌' పేరుతో రాసిన ఈ పుస్తకం అతడి మనసుకు అక్షర దర్పణం.

హీరో ఇమ్రాన్ హష్మీ

అయాన్‌ ఇమ్రాన్ కుమారుడు. నాలుగేళ్ల ఈ చిన్నారి కాన్సర్‌తో పోరాడుతుంటే చూడలేక నానా నరకయాతన అనుభవించాడు ఇమ్రాన్‌. ఆ సమయంలోనే కాన్సర్‌పై పరిశోధన గ్రంథం లాంటి 'ద కిస్‌ ఆఫ్‌ లైఫ్‌' పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకంలో కాన్సర్‌ గురించి సంపూర్ణ సమాచారం ఉంటుంది. ఓ పక్క షూటింగ్‌లతో బిజీ షెడ్యూల్‌... మరో పక్క కొడుకు అయాన్‌తో కలిసి హాస్పిటల్‌ కారిడార్లలో పచార్లు... మరో పక్క బాధను భరించలేని స్థితిలో భార్య పర్వీన్‌కు ఓదార్పు ఇవ్వడం... ఇలా పైకి ముద్దుల కోసం తపించే హీరోగా కనిపించినా, కను రెప్పల్ని కాటేసే కన్నీళ్ళను గుండెల్లోనే అణచుకుంటూ రీల్‌ హీరోగానే కాకుండా, రియల్‌ హీరోగానూ ఆత్మసైర్థ్యంతో నిలదొక్కుకున్నాడు.

ఇంటినిండా సినీ ప్రముఖులే

ఇమ్రాన్‌.. 1979 మార్చి 24న ముంబయిలో పుట్టాడు. తండ్రి సయ్యద్‌ అన్వర్‌ హష్మీ వ్యాపారవేత్త. తల్లి మెహరా హష్మీ గృహిణి. తండ్రికి సినిమాలంటే బాగా ఇష్టం. 1968లోని 'బాహారొంకి మంజిల్‌' సినిమాలో నటించాడు. తండ్రి వారసత్వంగా ఇమ్రాన్‌ హష్మీ సినీ రంగంపై ఆసక్తి పెంచుకున్నాడు. ఇమ్రాన్‌ హష్మీ మాతామహుడు సయ్యద్‌ సాఖుట్‌ హష్మీ దేశ విభజన తరువాత పాకిస్థాన్‌కు వెళ్లిపోయాడు. ఇమ్రాన్‌ అమ్మమ్మ మెహర్బానో మహ్మద్‌ అలీ, సినిమాల్లో స్క్రీన్‌ పేరు పూర్ణిమ. ఆమె భారత్​లోనే ఉంటూ పాకిస్థాన్‌ నుంచి విడివడి... నిర్మాత దర్శకుడైన భగవాన్‌ దాస్‌ను వివాహమాడింది. బాలీవుడ్‌ ప్రముఖులైన మహేశ్ భట్, ముఖేశ్ భట్‌ ఈమె పిల్లలే. బాలీవుడ్‌ డైరెక్టర్‌ మోహిత్‌ సూరికి ఇమ్రాన్‌ హష్మీ కజిన్‌. పూజా భట్, ఆలియా భట్‌.. ఇమ్రాన్‌ హష్మీకి కజిన్‌ సిస్టర్స్‌. అలా ఇమ్రాన్‌ ఇంట సినీ వాతావరణం భారీగానే ఉంది. ఇమ్రాన్‌ చదువు ముంబయిలోని జమునా భాయ్‌ నర్సులే స్కూల్‌లో జరిగింది. డిగ్రీ చదువు అదే కాలేజీలో సాగింది. ముంబయి యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ పొందాడు.

వివాహం

ఇమ్రాన్‌ హష్మీ.. ఆరున్నర ఏళ్ల రిలేషన్‌ తర్వాత తన స్వీట్‌ హార్ట్‌ పర్వీన్‌ సహానీని 2006 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నాడు. 2010 ఫిబ్రవరి 3న వీరికి అయాన్‌ హష్మీ జన్మించాడు. 2014 జనవరిలో అయాన్‌కు మొదటి దశ కాన్సర్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఓ పక్క సినిమాల్లో బిజీగా ఉన్నా ... తనయుడు కాన్సర్‌ బారిన పడినందువల్ల మానసికంగా కృంగిపోయాడు. అయినా దానిని పైకి కనిపించనీయలేదు. కాన్సర్‌ గురించి తాను తెలుసుకున్న విషయాలను అక్షరీకరించిన పుస్తకం 'ద కిస్‌ ఆఫ్‌ లైఫ్‌'ను 2016లో ఆవిష్కరించాడు.

రొటీన్‌కు భిన్నంగా ఇమ్రాన్‌ నటన

బాలీవుడ్‌ తెరపై ఇమ్రాన్‌ హష్మీ సరికొత్తగా ఎగిసిపడ్డ కెరటం. కింద పడడమే కాదు... తిరిగి లేచి ఉవ్వెత్తున ఎగిసిపడే ఓ అల. కొత్తగా పైటేసిన యువత కళ్లల్లో మెరిసి మురిసే ఈస్టమన్‌ కలర్‌ ఫుల్‌ కల. ఇమ్రాన్‌ హష్మీ సినిమాలు ఆద్యంతం వినోదాత్మకమే కాకుండా ... హృదయాలలో కొన్నాళ్లపాటు నిలిచిపోతాయి. 2003లో 'ఫుట్‌ పాత్‌' ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకూ పలుసార్లు అవార్డులకు నామినేట్‌ అయ్యాడు. 2002లో హర్రర్‌ చిత్రం 'రాజ్‌'కు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 2004లో 'మర్డర్‌', 2005లో 'జెహెర్‌', 'కలియుగ్‌', 'అక్సర్‌', 2006లో 'గ్యాంగ్‌స్టర్‌', 2007లో 'ఆవారా పాన్‌' తదితర చిత్రాల ద్వారా ఇమ్రాన్‌ హష్మీ విలక్షణ నటనతో వీక్షకులను అలరించాడు.

2008లో ఇమ్రాన్‌ హష్మీ నట జీవితంలో మెచ్చు తునక అనదగ్గ సినిమా 'జన్నత్‌' వచ్చింది. ఈ క్రైమ్ డ్రామాలో తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. 2009లో 'రాజ్‌...ది మిస్టరీ కంటిన్యూస్‌', 2011లో సిల్క్‌ స్మిత జీవిత కథ 'ది డర్టీ పిక్చర్‌', అదే సంవత్సరం వచ్చిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'మర్డర్‌ 2' గుర్తింపు తీసుకొచ్చాయి. 2012లో క్రైమ్‌ థ్రిల్లర్‌ 'జన్నత్‌2', అదే సంవత్సరం 'రాజ్‌ 3', 2013లో 'ఏక్‌ థీ దయాన్‌' సినిమాలు చేశాడు. ఈ సినిమాలకు విమర్శకుల ప్రశంసలు లెక్కకు మిక్కిలిగా వచ్చాయి. 2010లో అండర్‌ వరల్డ్‌ డ్రామా 'వన్స్‌ అపాన్‌ టైం ఇన్‌ ముంబయి'. 2012లో పొలిటికల్‌ థ్రిల్లర్‌ 'సంఘాయి' చిత్రాల్లోనే నటనకు ఫిలింఫేర్‌ అవార్డు కోసం ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ఇమ్రాన్‌ పేరు నామినేషన్‌కు వెళ్లింది.

ఆ తర్వాత ఇమ్రాన్ నటించిన అనేక సినిమాలు బాక్సాఫీస్‌ బరిలో ఆశించిన విజయాల్ని నమోదు చేయడంలో విఫలమయ్యాయి. స్పోర్ట్స్‌ బయోపిక్​ 'అజహర్‌' అతడ్ని గట్టెక్కించింది. 2015లో 'హమారీ ఆదూరి కహానీ', 2016లో 'రాజ్‌ రాబౌట్‌', 2017లో 'బాద్షా' సినిమాలు ఇమ్రాన్‌ ఉనికిని చాటాయి.

హీరో ఇమ్రాన్ హష్మీ

అవార్డులు

2005లో 'మర్డర్‌' సినిమాలో విలన్‌గా ప్రతిభ కనబరించినందుకు స్కీన్ర్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. 2007లో 'గ్యాంగ్‌స్టర్‌'లో విలన్‌గా ఉత్తమ నటన ప్రదర్శించినందుకు ఫిలింఫేర్, ఐఫా అవార్డు కోసం నామినేట్‌ అయ్యాడు. ఇలా అనేక సినిమాల్లో నటనకు గాను ఫిలిం ఫేర్, స్కీన్ర్, జీ సినిమా అవార్డులు, స్టార్‌ డస్ట్‌ అవార్డుల కోసం నామినేట్‌ అయ్యాడు.

ABOUT THE AUTHOR

...view details