కరోనా ప్రభావంతో మరో సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పటికే 'విరాటపర్వం', 'లవ్‌స్టోరీ', 'టక్ జగదీశ్' వంటి చిత్రాలు తమ విడుదల తేదీని మార్చుకున్నాయి. తాజాగా.. చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర పనులన్నీ పూర్తి చేసుకున్న 'ఏక్ మినీ కథ' చిత్రం ఈ నెల 30న విడుదల కావాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
కరోనా కారణంగా మరో చిత్రం వాయిదా
కరోనా కారణంగా మరో చిత్రం వాయిదాపడింది. సంతోశ్ శోభన్ హీరోగా తెరకెక్కిన 'ఏక్ మినీ కథ' రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
కరోనాపై సామాజిక సందేశం ఇస్తూ.. ఒక వీడియోను కూడా పంచుకుంది. "అవును, 'ఏక్ మినీ కథ' వాయిదా పడింది. ఏప్రిల్ 30న మేం బయటికి రావడం లేదు. మీరు కూడా ఇంట్లోనే ఉండండి.. మాస్క్ ధరించండి. జాగ్రత్తగా ఉండండి" అంటూ ట్వీట్ చేసింది.
'పేపర్‌బాయ్' చిత్రంతో హీరోగా పరిచయం అయిన సంతోశ్ శోభన్ చేస్తున్న రెండో చిత్రమిది. నూతన దర్శకుడు కార్తీక్ రాపోలు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కావ్య థాపర్ హీరోయిన్. శ్రద్ధాదాస్, బ్రహ్మాజీ, సప్తగిరి, సుదర్శన్, పోసాని కృష్ణమురళి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.