కరోనాను ఎదుర్కోవాలంటే ధైర్యమే అసలైన మందు.. అవగాహనే అసలైన మార్గం. కరోనా సమయంలో సాటివారికి భౌతికంగా సాయం చేసే అవకాశం చాలా తక్కువ. అందుకే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. వాళ్లలో ధైర్యం నింపేందుకు సినిమా నిర్మాణ సంస్థలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్, సురేశ్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్, హారికాహాసిని, ఆర్‌ఆర్‌ఆర్ ఇలా ప్రముఖ నిర్మాణ సంస్థలు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నాయి. ప్లాస్మా అవసరమని ట్వీట్ చేస్తే.. దాన్ని రీట్వీట్ చేయడం.. ఆక్సిజన్ అత్యవసరమని కనిపించిన పోస్టును షేర్ చేయడం చేస్తున్నాయి.
కరోనా సాయం కావాలా? ట్వీట్ చేయండిలా! - గీతా ఆర్ట్స్ కరోనా ట్వీట్
కరోనా బాధితులకు సాయం అందించమని సామాజిక మాధ్యమాల్లో వినతుల వెల్లువ కొనసాగుతోంది. ఇలాంటి వారి సాయం కోసం టాలీవుడ్ నిర్మాణ సంస్థలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాయి. తాజాగా వీరి కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఓ కొత్త ఆలోచనను ముందుకు తీసుకొచ్చింది. దీనిని నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఒక కొత్త ఆలోచన ప్రతిపాదించింది. కరోనా వేళ అవసరమైన అభ్యర్థనలకు సులభంగా బదులు వచ్చేందుకు హ్యాష్‌ట్యాగ్‌లను తయారు చేసి ట్వీట్ చేసింది. ట్వీట్‌లు చేసేవాళ్లు ఆ హ్యాష్‌ట్యాగ్‌లో తమ ప్రాంతాన్ని కూడా ప్రస్తావించాలని కోరింది. ఉదాహరణకు.. హైదరాబాద్ వాళ్లు #COVID19Hyderabad, విశాఖపట్నం వాళ్లు #COVID19Vizag కర్నూలు నుంచి ట్వీట్ చేసేవాళ్లు #Covid19Kurnool ఇలా చేయడం వల్ల వేగంగా స్పందన వచ్చే అవకాశం ఉందని ఆ ట్వీట్‌లో పేర్కొంది. మంచి ఆలోచన అంటూ నెటిజన్లు ఆ ట్వీట్‌కు బదులిస్తున్నారు.