'ద రాక్'గా మనందరికి తెలిసిన డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్, హాలీవుడ్ ప్రముఖ నటుడు డ్వేన్ జాన్సన్.. కొవిడ్ బారిన పడ్డారు. అతడితో పాటే కుటుంబంలోని భార్య, ఇద్దరు కుమార్తెలకు వైరస్ సోకింది. ప్రస్తుతం అందరం కోలుకున్నామని, ఆరోగ్యంగానే ఉన్నట్లు చెబుతూ ఇన్‌స్టాలో వీడియోను పోస్ట్ చేశారు.
'ద రాక్' కుటుంబం మొత్తానికి కరోనా - హాలీవుడ్లో కరోనా
తమ కుటుంబానికి కరోనా సోకిందని హాలీవుడ్ ప్రముఖ నటుడు డ్వేన్ జాన్సన్ వెల్లడించారు. మూడు వారాల క్రితం పాజిటివ్ తేలిందని, ప్రస్తుతం దాని నుంచి కోలుకున్నామని తెలిపారు.
90ల్లో డబ్ల్యూడబ్ల్యూఈలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్సన్.. 1998లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్షిప్ గెల్చుకున్నారు. 1990-2000 మధ్య కాలంలో పలు రెజ్లింగ్ రికార్డులు సాధించారు. 'ద రాక్'గా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. 2004 తర్వాత నటనపై దృష్టి సారించారు. 2011-13 మధ్యలో పార్ట్‌టైమ్ రెజ్లర్‌గానూ కొనసాగారు. గతేడాది పూర్తిస్థాయి కెరీర్‌కు రిటైర్మెంట్ పలికి పలు సినిమాల్లో కీలకపాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు.
జాన్సన్ నటించిన వాటిలో 'ద స్కార్పియన్ కింగ్'(2002), 'గేమ్ ప్లాన్'(2007), 'హెర్క్యూలస్'(2014), 'సాన్ ఆండ్రస్'(2015), 'రాంపేజ్'(2018) సినిమాలతో పాటు 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సిరీస్‌లో ఐదు, ఆరు, ఏడు భాగాలు ఉన్నాయి. జుమాంజీ ఫ్రాంఛైజీలోనూ 'జుమాంజీ: వెల్కమ్ టూ జంగిల్'(2017), 'జుమాంజీ: ద నెక్స్ట్ లెవల్'(2019)ల్లో ప్రధాన పాత్రలు పోషించారు 'ద రాక్'.