డ్వేన్ జాన్సన్ (ది రాక్) కండలు తిరిగిన దేహంతో ఉండే హాలీవుడ్ నటుడు.. గతంలో రెజ్లర్ అనే విషయం చాలామందికి తెలుసు. అయితే.. రాక్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు అనే విషయం చాలామందికి తెలియదు. ప్రస్తుతం శారీరకంగా ఎంతో దృఢంగా కనిపిస్తున్న రాక్ పాఠశాలకు వెళ్లే రోజుల్లో చాలా మృదువుగా ఉండేవాడట. అందుకే చాలా మంది అతడిని ఆటపట్టించేవారట. తనను ఆడపిల్ల అనుకొని పొరబడేవారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు రాక్.
చిన్నతనంలో ఒకసారి పాఠశాల బస్సులో ఎక్కి ఒక అబ్బాయి పక్కనే కూర్చోగా.. వెంటనే ఆ అబ్బాయి.. 'నేను నిన్ను ఒకటి అడగొచ్చా..?’ అన్నాడట. దానికి అడగండి అని రాక్ స్పందించగా.. 'నువ్వు అమ్మాయివా..? అబ్బాయివా..?' అని అనుమానం వ్యక్తం చేశాడట. అయితే.. 7 నుంచి 11 ఏళ్ల వయసు మధ్యకాలంలో తాను ఎంతో మృదుస్వభావం కలిగి ఉండటం సహా తన జుట్టు కూడా అమ్మాయి జుట్టులా ఎంతో మెత్తగా ఉండటమే ఇందుకు కారణమని రాక్ ఇంటర్వ్యూలో తెలిపాడు. తన తండ్రి రెజ్లర్ కావడం వల్ల చిన్నతనంలో తరచూ పాఠశాలలు మారుతూ రావాల్సి వచ్చేదట. అలా దాదాపు 13 పాఠశాలలు మారినట్లు రాక్ గుర్తు చేసుకున్నాడు.