మలయాళ స్టార్ మమ్ముట్టి తనయుడిగానే పరిచయమైనా.. 'మహానటి'తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు దుల్కర్ సల్మాన్. 'కనులు కనులు దోచాయంటే'తో ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. ఇప్పుడు దుల్కర్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'కురుప్'(dulquer salmaan kurup movie). శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. మలయాళంలోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దుల్కర్ ఈ చిత్రం గురించి హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
"నేను నటించిన ప్రతి సినిమా తెలుగులో వస్తుందని చెప్పలేను. కానీ ఇది అందరికీ తెలియాల్సిన కథ. అందుకే విడుదల చేస్తున్నాం. ఈ చిత్ర దర్శకుడు, నేనూ ఒకేసారి ప్రయాణం మొదలుపెట్టాం. నా తొలి చిత్రం ఆయనతోనే చేశా. అప్పుడే 'కురుప్' చేయాలనుకున్నారు. ఈ కథ గురించి చాలామందికి తెలుసు. కురుప్ గురించి మేం చిన్నప్పట్నుంచీ వింటూనే ఉన్నాం. ఇదొక కిల్లర్ కథ. ఆ ఘటనల మీద ఎన్నో వార్తలూ వచ్చాయి."
"మొత్తం నేర నేపథ్యంలో కాకుండా బాల్యం, యవ్వన దశల్ని స్పృశిస్తున్నాం. యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్, బయోపిక్ తదితర జానర్లన్నీ ఇందులో కనిపిస్తాయి. మేం ఇందులో కురుప్‌ని హీరోలా చూపించడం లేదు. అతని పాత్రని పోషించిన నేను బ్యాడ్ బాయ్‌గానే కనిపిస్తా. చివరికి ఎలాంటి సందేశం ఇచ్చామనేది తెరపైనే చూడాలి."
"తెలుగు పరిశ్రమను నేను కొత్త పరిశ్రమగా చూడడం లేదు. తెలుగు ప్రేక్షకులు నన్నెప్పుడో స్వీకరించారు. అఖిల్, రానా వంటి మంచి స్నేహితులున్నారు. వైజయంతీ మూవీస్ సంస్థని కుటుంబ సంస్థలా భావిస్తా. తెలుగులో సినిమాలు చేస్తే మంచి కథల్నే ఎంచుకోవాలనుకుంటా. 'మహానటి' వంటి ఒక్క చిత్రం చాలు కదా, ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవడానికి. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. యుద్ధం, ప్రేమ మేళవింపుగా ఆ చిత్రం రూపొందుతోంది. వచ్చే ఏడాది విడుదలవుతుంది. మా నాన్న, నేను ఎక్కువగా సినిమాల గురించి మాట్లాడుకోం. కథల ఎంపికలో ఎవరి నిర్ణయాలు వారివే. అభిప్రాయాల్ని మాత్రం తెలుసుకుంటుంటాం" అన్నారు దుల్కర్ సల్మాన్.
ఇదీ చూడండి:ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే సినిమాలివే!