మలయాళ హీరో దుల్కర్ సల్మాన్.. ముంబయికి చెందిన మహిళా రిపోర్టర్‌కు క్షమాపణలు చెప్పాడు. అతడు నిర్మాతగా తీసిన తొలి సినిమా 'వరనే అవశ్యముంద్'. కల్యాణి ప్రియదర్శన్, శోభన కీలక పాత్రలు పోషించారు. అనూప్ సత్యన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులోని ఓ ప్రకటన సన్నివేశంలో ముంబయికి చెందిన రిపోర్టర్ ఫొటోను ఉపయోగించారు. దీంతో వివాదం మొదలైంది. సదరు మహిళా రిపోర్టర్ ట్విటర్‌లో స్పందిస్తూ.. దర్శక, నిర్మాతల్ని విమర్శించారు. తన అనుమతి లేకుండా ఫొటో వినియోగించడంపై మండిపడ్డారు. పబ్లిక్‌లో బాడీ-షేమింగ్ చేశారని, దుల్కర్ క్షమాపణలు చెప్పాలని ఆరోపించారు. దీన్ని చూసిన దుల్కర్ ఆమెకు సారీ చెప్పాడు.
"ఇది మా వైపు నుంచి జరిగిన తప్పే.. దీని పూర్తి బాధ్యత మేమే వహిస్తాం. మీ ఫొటోల్ని సినిమాలోని సన్నివేశానికి ఎందుకు ఉపయోగించారో సంబంధిత డిపార్ట్‌మెంట్‌ను అడిగి తెలుసుకుంటాం. మా వల్ల మీరు ఇబ్బందిపడ్డందుకు నా తరఫున, చిత్ర బృందం తరఫున క్షమాపణలు కోరుతున్నా. ఇది కావాలని చేసిన పని మాత్రం కాదు" అని దుల్కర్ ట్వీట్ చేశాడు.