సినీ పరిశ్రమలో నటీనటులకు సినిమాల్లో పోటీ ఉంటుంది కానీ నిజ జీవితంలో వారంతా ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఒక హీరో సినిమా హిట్ అయితే మరో హీరో స్పందించి ప్రశంసలు కురిపిస్తాడు. తాజాగా టాలీవుడ్ హీరో ఎన్టీఆర్.. కోలీవుడ్ స్టార్ విజయ్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలిపాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ప్రతినిధి మహేశ్ కోనేరు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
ఇటీవల విడుదలైన 'బిగిల్' చిత్రంతో విజయ్ మంచి విజయాన్ని అందుకున్నాడు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో 'విజిల్' పేరుతో విడుదల చేశారు. తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ మూవీని తెలుగులో మహేశ్ కోనేరు విడుదల చేశాడు. తాజాగా విజయ్‌ని కలిసిన మహేశ్.. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. విజయ్- ఎన్టీఆర్ ఫోన్‌లో సంభాషించుకున్నారని తెలిపాడు.
"విజయ్‌ను కలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 'విజిల్' సినిమా విజయవంతం కావడం వల్ల విజయ్ సంతోషం వ్యక్తం చేశాడు. సంతోషకరమైన విషయం ఏమిటంటే ఎన్టీఆర్-విజయ్ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. తన నూతన చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తానని విజయ్ ప్రామిస్ చేశాడు."