Producer naga vamsi: రెండున్నర గంటల పాటు కడుపుబ్బా నవ్వించే సినిమా 'డీజే టిల్లు'. ఇందులో నవ్వులతో పాటు చిన్న సందేశమూ ఉంది" అని అన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఆయన నిర్మాణంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రమే ఈ 'డీజే టిల్లు'. విమల్ కృష్ణ దర్శకుడు. నేహా శెట్టి కథానాయిక. ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో చిత్ర విశేషాలు పంచుకున్నారు నిర్మాత నాగవంశీ.
'కృష్ణ అండ్ హిజ్ లీలా' సినిమా నచ్చి సిద్ధును ఇంటికి పిలిచి మాట్లాడా. ఏమన్నా కొత్త కథ ఉంటే చెప్పమంటే.. ముందు ఓ రొమాంటిక్ డ్రామా స్క్రిప్ట్ వినిపించాడు. అది కాకుండా ఏదన్నా చెప్పమంటే.. ఓ క్రైమ్ కామెడీ కథ ఉందని చెప్పాడు. నిజానికి అప్పటికి తను దీన్ని ఓ చిన్న ఐడియాలాగే చెప్పాడు. తర్వాత చాలా మార్పులు చేర్పులు చేసి పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేశారు. మా బ్యానర్‌లో ఇప్పటి వరకు ఫ్యామిలీ కథలు, రొమాంటిక్ కామెడీ డ్రామాలే చేశాం తప్ప.. ఇలాంటి కామెడీ థ్రిల్లర్ కథలు ప్రయత్నించలేదు. అందుకే ఈ స్క్రిప్ట్ వినగానే చేయాలనిపించింది.
* కొవిడ్ వల్ల రెండేళ్లుగా ఫ్యామిలీ ఆడియెన్స్ సరిగా థియేటర్లకు రావట్లేదు. దానివల్లే మా 'రంగ్‌దే', 'వరుడు కావలెను' చిత్రాలకు మంచి టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోయాం. ఈ తరుణంలో కొన్నాళ్లు యూత్‌ఫుల్ సినిమాలు చేస్తే బాగుంటుందనిపించి ఆ దిశగా దృష్టి పెట్టాం. ఈ 'డీజే టిల్లు' పూర్తిగా యువతరాన్ని లక్ష్యం చేసుకుని తీసిన సినిమానే. ట్రైలర్ చూస్తే ఎంత వినోదభరితంగా అనిపించిందో.. సినిమా చూస్తే అంతకు రెట్టింపు వినోదం లభిస్తుంది.