DJ Tillu movie: సిద్ధు జొన్నలగడ్డ.. 'డీజే టిల్లు' చిత్రం హిట్ కావడం వల్ల టాలీవుడ్‌లో ఈ పేరు తెగ వినిపిస్తోంది. ఎక్కడా చూసినా 'డీజే టిల్లు' పాటలు మారుమోగిపోతున్నాయి. అయితే, అతడికి అంత సులువుగా ఈ పాపులారిటీ దక్కలేదు. 'గుంటూరు టాకీస్' చిత్రంతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు.. ఆ తర్వాత అడపాదడపా పాత్రలు చేసుకుంటూ వచ్చాడు. ఆ మధ్య వచ్చిన 'కృష్ణ అండ్ హీస్ లీలా', 'మా వింతగాథ వినుమా' చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. ఎట్టకేలకు 'డీజే టిల్లు'తో సిద్ధుకు హిట్‌తోపాటు మంచి గుర్తింపు లభించింది. అయితే, తను హీరోగా నటించిన అన్ని చిత్రాలకు కథ, మాటలు సిద్ధునే రాసుకోవడం విశేషం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'డీజే టిల్లు' విజయం సాధించడం పట్ల సిద్ధు స్పందించాడు.
"ఈ రోజు పెన్ను పవర్ గెలిచింది. మిమ్మల్ని నవ్వించడానికి చాలా కష్టపడ్డాం. ఈ విజయం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నా. అప్పట్లో 'గుంటూరు టాకీస్' చిత్రం విడుదలై హిట్ సాధించింది. కానీ, అప్పుడు నాకు 'పెళ్లి చూపులు' తర్వాత విజయ్ దేవరకొండకు, 'క్షణం' తర్వాత అడవి శేష్‌కు వచ్చినట్లు గొప్ప అవకాశాలు రాలేదు. అందుకే, ఇంత గ్యాప్ వచ్చింది. ఓ సారి నా ఫ్రెండ్‌ను నా కోసం ప్రచారం చేయమన్నా. కానీ, అది జరగలేదు. అప్పుడే నిర్ణయించుకున్నా ఎవరూ మనల్ని పట్టించుకోనప్పుడు మనమే ఒక సంచలనంగా మారాలి అని. అలా అనుకొని తీసిన గత రెండు చిత్రాలకు మిశ్రమ స్పందన వచ్చినా.. 'డీజే టిల్లు' బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది" అని సిద్ధు చెప్పుకొచ్చాడు.