కరోనా దెబ్బకు థియేటర్లన్నీ మూతపడ్డాయి. వినోదమే కష్టమనే సమయంలో ప్రజలను అలరించేందుకు ఓటీటీ చక్కని వేదికైంది. ఇప్పటివరకు వెండితెర, బుల్లితెర మాత్రమే ఎందరినో స్టార్లను చేసింది. అయితే ఆ సత్తా తనకూ ఉందంటూ ఓటీటీ.. ఈ కరోనా కాలంలో కొందరిని ప్రజలకు చేరువ చేసింది. సామాన్య నటుల్ని కాస్త స్టార్లను చేసింది. అందుకే ఓటీటీ అంటే 'ఓవర్ ద టాప్' మాత్రమే కాదు.. టాలెంట్‌ను గుర్తించడంలోనూ టాపే అనేలా మారింది. ఓటీటీ వేదికల వల్ల ఈ ఏడాది తమ గ్రాఫ్ మార్చుకున్న కొందరి నటీనటుల గురించే ఈ కథనం.
ప్రతీక్ గాంధీ
గుజరాత్లో థియేటర్ ఆర్టిస్ట్‌గా పేరున్న ఇతడికి బాలీవుడ్లో అడుగుపెట్టాక పెద్దగా అవకాశాలు రాలేదు. 'లవ్యాత్రి', 'మిత్రోన్' లాంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో చేసినా సరే గుర్తింపు లభించలేదు. పెద్దగా పేరు తెలియని ఇతడిని.. ఈ ఏడాది ఓటీటీని షేక్ చేసిన 'స్కామ్ 1992' ఒక్కసారిగా క్రేజ్ తీసుకొచ్చేసింది. వెండితెర ఇవ్వలేని పేరును ఓటీటీ ఒక్క సిరీస్‌తో అందించింది. ఇతడు ప్రతీక్ గాంధీయే అయినా నటించిన హర్షద్ మెహతా పాత్ర ఇతడికి అసలు పేరుగా మారిపోయింది.
ఐఎమ్‌డీబీ రేటింగ్‌లోనూ దుమ్ములేపిన ఈ సిరీస్.. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా రూపొందించారు. ఇతడితో పాటు సతీష్ కౌశిక్, శ్రేయ ధన్వంతరి, నిఖిల్ ద్వివేది, అనంత్ నారాయణ్ మహదేవన్ అద్భుతంగా నటించారు. ప్రతీక్ పాత్ర మాత్రం సిరీస్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది.
అభిషేక్ బెనర్జీ
ఇతడిని అభిషేక్ బెనర్జీ అనే కంటే హథోడా త్యాగి అంటే అందరూ గుర్తుపడతారేమో. చాలా రోజులపాటు బాలీవుడ్లో చిన్న చిన్న పాత్రలు చేసినా పెద్దగా పేరు రాలేదు. ఆమిర్ ఖాన్ 'రంగ్ దే బసంతి' సినిమాతో అరంగేట్రం చేసిన ఇతడు.. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. స్త్రీ, డ్రీమ్‌గర్ల్, బాలా లాంటి సినిమాల్లోనూ మెరిశాడు. అయితే 'పాతాళ్ లోక్' వెబ్‌సిరీస్ ఇతడిని ఒక్కసారిగా గుర్తింపు తీసుకొచ్చింది. తనలోని నటనా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పింది.
దివ్వేందు శర్మ
అమెజాన్‌లోని 'మీర్జాపుర్' వెబ్‌సిరీస్ ఎంతగా హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వివిధ భాషల్లోని డబ్బింగ్లకూ సూపర్ క్రేజ్ వచ్చింది. అయితే ఈ సిరీస్‌లో ప్రతినాయక లక్షణాలున్న పాత్ర మున్నా భయ్యాగా కనిపించిన దివ్వేందు శర్మకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. గతంలో ఎన్నో పాత్రలు చేశాడు. ఉద్యోగి నుంచి రొమాంటిక్ లవర్‌బాయ్‌గా అన్ని రోల్స్‌లోనూ అదరగొట్టాడు. అయితే అవన్నీ ఓవైపు మున్నా భయ్యా ఒక్కటే మరోవైపు అన్నంతగా ఆడియన్స్ మనసు దోచేశాడు. ఈ దెబ్బతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. త్వరలో 'బిచో కా ఖేల్' క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లోనూ కనువిందు చేయనున్నాడు.