లవ్, రిలేషన్లో ఉన్నవాళ్లు జీవితాంతం అలానే ఉండాలని, తోడునీడగా సాగిపోవాలని అనుకుంటారు! కానీ పరిస్థితుల ప్రభావమో, మరేదైనా కారణమో గానీ కొన్నిసార్లు విడిపోవాల్సి వస్తుంది. అలా సెపరేట్ అయిన తర్వాత అంతకుముందులా మాట్లాడాలంటే మొహమాటం అడ్డురావొచ్చు. అయితే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీ జంటలు మాత్రం దీనికి భిన్నం. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నప్పటికీ, తాము స్నేహితుల్లా ఉంటామని చెప్పడమే కాకుండా.. నిరూపించి చూపిస్తున్నారు కూడా! ఇంతకీ వాళ్లెవరు? ఆ సంగతేంటి?
హృతిక్ రోషన్ - సుసానే ఖాన్
హృతిక్-సుసానే విడాకులు తీసుకోవడం.. బాలీవుడ్‌తో పాటు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. వాళ్లు విడిపోవడానికి కారణం ఏమైనప్పటికీ, ప్రస్తుతం మాత్రం వారిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. గతేడాది లాక్‌డౌన్‌లోనూ హృతిక్ ఫ్లాట్‌కు తాత్కాలికంగా వచ్చిన సుసానే.. పిల్లలతో సరదాగా సమయాన్ని గడిపింది. చిన్నారుల పుట్టినరోజును కూడా భర్తతో కలిసి చేసింది. వీటితో పాటు విహారయాత్రలు, లంచ్, డిన్నర్ డేట్లకు హృతిక్‌తో అప్పుడప్పుడూ వెళ్తోంది.
ఆమిర్ ఖాన్ - కిరణ్‌రావ్
బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్- అతడి భార్య కిరణ్‌రావ్.. తమ 15 ఏళ్ల వివాహ బంధానికి ఇటీవలే స్వస్తి పలికినట్లు వెల్లడించారు. అయినాసరే భవిష్యత్తులో కలిసి పనిచేస్తామని ప్రకటించి, అభిమానుల్లో ఆనందం నింపారు. ప్రస్తుతం 'లాల్ సింగ్ చద్దా' చిత్రీకరణలో భాగంగా లద్ధాఖ్‌లో ఉన్నారు.