ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమను ఓటీటీలు నడిపిస్తున్నాయని, చాలామందికి ఉపాధి అందిస్తున్నాయని బాలీవుడ్ నటి దిశా పటానీ అన్నారు. సల్మాన్ ఖాన్ సరసన ఆమె నటించిన 'రాధే:యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' చిత్రం ఇటీవల ఓటీటీ జీ ప్లెక్స్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా డిజిటల్ మాధ్యమం గురించి ఆమె తన అభిప్రాయం తెలియజేశారు.
"సాధారణ రోజుల్లో సినిమాలు ఎంత గ్రాండ్‌గా విడుదలవుతాయో.. అలా రాధే విడుదల కోసం ఎదురు చూస్తున్నాను. ఎంతో కష్టపడి నటించిన చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లి.. పండగలాంటి వాతావరణం మధ్య విడుదలైతే ఆ సంతృప్తే వేరు. అయినా ఇలాంటి కష్టతరమైన రోజుల్లో సినిమా విడుదల కావడమే గొప్ప విషయం. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇలాంటప్పుడు ఓటీటీ మంచి వేదికగా నిలుస్తోంది. చిత్ర పరిశ్రమను నడిపించే ఓ మార్గంగా కనిపిస్తోంది. ఎందరికో ఉపాధిని కల్పిస్తోంది. కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ ఓటీటీ ద్వారా వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందుకు డిజిటల్ మాధ్యమం సేవలకు ధన్యవాదాలు."