తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'డిస్కోరాజా' అంటే రవితేజనే ఊహించుకున్నా'

రవితేజ హీరోగా వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'డిస్కోరాజా'. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకున్నాడు దర్శకుడు ఆనంద్.

వి.ఐ ఆనంద్
వి.ఐ ఆనంద్

By

Published : Jan 23, 2020, 8:35 AM IST

Updated : Feb 18, 2020, 2:04 AM IST

చిన్నప్పటి నుంచి సైన్స్‌ ఫిక్షన్‌ కథలంటే తనకు చాలా ఇష్టమని అంటున్నాడు దర్శకుడు వి.ఐ.ఆనంద్‌. 'ఎక్కడికిపోతావు చిన్నవాడా', 'టైగర్‌', 'ఒక్కక్షణం' చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇతడు తాజాగా రవితేజతో 'డిస్కోరాజా'ను తెరకెక్కించాడు. సైన్స్‌ ఫిక్షన్‌ కథతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వి.ఐ.ఆనంద్‌ హైదరాబాద్‌లో విలేకర్లతో సరదాగా ముచ్చటించాడు. ఆ విశేషాలివే..

'డిస్కోరాజా' పదేళ్ల క్రితమే..

చిన్నప్పటి నుంచి నాకు సైన్స్‌ ఫిక్షన్‌ కథలంటే చాలా ఇష్టం. 'డిస్కోరాజా' ఒక సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా. ఈ సినిమాకు సంబంధించిన మెయిన్‌ లైన్‌ను 10 సంవత్సరాల క్రితమే అనుకున్నాను. ఆ లైన్‌ గురించి ఎంతో పరిశోధన చేశాను. అయితే ఏడాదిన్నర క్రితం ఒక పేపర్‌లో బయోకెమికల్‌ ల్యాబ్‌ గురించి వార్త చదివాను. ఇండియాలో ఒక ముఖ్యమైన రీసెర్చ్‌ కేంద్రం ఆ ల్యాబ్‌ చేయడానికి ప్రయత్నించింది. కాకపోతే అది విఫలమైంది. నేను దాన్ని ఆధారంగా చేసుకుని ఒక వేళ ఆ రీసెర్చ్‌ సక్సెస్‌ అయ్యి ఉంటే ఎలా ఉంటుంది అని చూపించడానికి ఈ సినిమా చేశాను.

రవితేజకు బెస్ట్‌ క్యారెక్టర్‌ ఇది..

రవితేజ నుంచి అభిమానులు ఎలాంటి చిత్రాన్ని కోరుకుంటున్నారో ఈ సినిమా ఆవిధంగా ఉంటుంది. ఆయనలోని మాస్‌, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్‌ ప్రతిదాన్ని చాలా చక్కగా చూపించాం. ఈ పాత్రను అనుకున్నప్పుడే నేను మైండ్‌లో రవితేజను ఫిక్స్‌ అయ్యాను. ఈ సినిమాలో రవితేజ ఒక మ్యూజికల్‌ లవింగ్‌ స్టార్‌. ఆయన పాత్రే ఈ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. మాస్‌ మహారాజా అభిమానులకు ఈసినిమా ఓ ఫీస్ట్‌ అవుతుంది. ఆయన ఇప్పటివరకూ చేసిన క్యారెక్టర్స్‌లో 'డిస్కోరాజా' పాత్ర మొదటి ఐదు స్థానాల్లో ఉంటుంది.

వి.ఐ ఆనంద్

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ కెమెరామెన్‌..

'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌' సినిమాకు చేసిన కెమెరామెన్‌ ఈ సినిమా కెమెరామెన్‌, ఆయన బృందం 'డిస్కోరాజా'లోని ఓ ఫైట్‌ సీక్వెన్స్‌ కోసం పనిచేసింది. ఆ సీక్వెన్స్‌ను మేము ఐస్‌లాండ్‌లో చిత్రీకరించాం. వాతావరణం దృష్ట్యా అక్కడ చిత్రీకరించడం కొంచెం రిస్క్‌తో కూడుకున్నది. ఈ సినిమా మొత్తానికి ఆ సీక్వెన్స్‌ చాలా కీలకమైనది. ఈ సినిమా ఆ సీక్వెన్స్‌ 12 నిమిషాలు ఉంటుంది.

ఆయనకు అలా నచ్చింది..

రవితేజ ఏదైనా కాన్సెప్ట్‌ ఫిల్మ్‌ చేయాలనుకుంటున్న సమయంలో నేను ఆయన్ని కలిశాను. అలా నేను కథ చెప్పగానే ఓకే అన్నారు. 'డిస్కోరాజా' పాత్రకు, ఆయన బాగా కనెక్ట్‌ అయ్యారు. చిన్నప్పటి నుంచి 'ఐ యామ్‌ ఏ డిస్కో డ్యాన్సర్‌' అనే పాటకు రవితేజ అభిమాని. మిథున్‌ చక్రవర్తి, అమితాబ్‌ సినిమాలు చూస్తుంటారు. అలా 'డిస్కోరాజా' క్యారెక్టర్‌ ఆయనకు బాగా దగ్గరయ్యింది. ఆయన ఇన్వాల్వ్‌ అయ్యి చేశారు.

కాన్సెప్ట్‌ సినిమాలతో హిట్‌..

కాన్సెప్ట్‌, కమర్షియల్‌ వేరు వేరు అని మనం అనుకుంటాం. కానీ మంచి కాన్సెప్ట్‌ ఉంటే తప్పకుండా కమర్షియల్‌గా హిట్‌ కొట్టవచ్చు అని నేను నమ్ముతాను. ఈ సినిమాతో అదే నిరూపించాలనుకుంటున్నాను. 'టైగర్‌', 'ఎక్కడికిపోతావు చిన్నవాడా', 'ఒక్కక్షణం' చిత్రాల కంటే ఇదే నా కెరీర్‌లో బిగ్‌ బడ్జెట్‌ సినిమా. కెరీర్‌లో మరింత ఎదిగేందుకు ఈ సినిమా చాలా కీలకమైనది.

రవితేజతోపాటు..

ఈ సినిమాలో రవితేజ 'డిస్కోరాజా' అనే గ్యాంగ్‌ స్టార్‌గా కనిపించనున్నారు. ఆయనతోపాటు బాబీసింహా చెన్నైకు చెందిన గ్యాంగ్‌స్టార్‌గా కనిపించనున్నారు. 'జిగర్తాండా' పాత్రలాగా 'డిస్కోరాజా'లోని పాత్ర కూడా ఆయనకు మంచి గుర్తింపు తీసుకువస్తుంది. నభా నటేశ్‌ దిల్లీలో పనిచేసే ఒక బ్యాంక్‌ ఉద్యోగిగా కనిపించనున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌ చాలా విభిన్నమైన పాత్రలో మెప్పించనున్నారు. సునీల్‌, సత్య, వెన్నెలకిషోర్‌ హాస్యంతో అలరించనున్నారు.

వి.ఐ ఆనంద్

'ఒక్కక్షణం'కు కలెక్షన్స్‌ ఎందుకు రాలేదో..

'ఒక్కక్షణం' సినిమా పట్ల నేను 100శాతం సంతృప్తిగా ఉన్నాను. కలెక్షన్స్‌ రాలేదనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ సినిమా ఎందుకు ఆడలేదో ఇప్పటికీ అర్థం కాలేదు. కానీ ఈ సినిమా విడుదల తేదీ సరైనది కాదని నేను అనుకుంటున్నాను. ఏడాది చివర్లో రావాల్సిన సినిమా కాదని తెలుసుకున్నాను. కానీ నా వర్క్‌ పరంగా రివ్యూలు బాగానే వచ్చాయి. ఒక చెత్త సినిమా చేశాననే ఫీలింగ్‌ లేదు.

సీతాకోకచిలుక..

సీతాకోకచిలుక ఈ సినిమాలో చాలా కీలకమైన సింబల్‌. దాని గురించి చిత్రంలో వివరణ కూడా ఉంటుంది. మేము ఆశించిన విధంగా ఈ సినిమా విజయం సాధిస్తే తప్పకుండా సీక్వెల్‌ చేస్తాం. ఇప్పటికే దానికి సంబంధించిప లైన్‌ ఫిక్స్‌ అయ్యాను.

గీతాఆర్ట్స్‌లో చేస్తా..

నా తదుపరి చిత్రం గీతాఆర్ట్స్‌లో చేస్తాను. విభిన్న కథ చేయాలనుకుంటున్నాను. కథ ఏమిటనేది ఇంకా ఫిక్స్‌ కాలేదు. హీరో ఎవరనేది నిర్మాణ సంస్థ వాళ్లు తెలియచేస్తారు. వెబ్‌సిరీస్‌ అంటే ఇష్టముంది.

ఇవీ చూడండి.. 'శుక్రవారం నుంచి కొత్త సీన్స్​ జోడిస్తాం'

Last Updated : Feb 18, 2020, 2:04 AM IST

ABOUT THE AUTHOR

...view details