వై.వి.ఎస్.చౌదరి... ఈయన చేసింది తక్కువ సినిమాలే అయినా... తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. దర్శకుడిగానే కాకుండా... రచయితగా, నిర్మాతగా, పంపిణీదారుడిగా, ఆడియో కంపెనీ అధినేతగా, ప్రదర్శనకారుడిగా ఆయన పరిశ్రమతో విడదీయలేని అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్‌కి వీరాభిమాని అయిన చౌదరి, ఆయన స్ఫూర్తితోనే చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కృష్ణాజిల్లా, గుడివాడలో 23 మే 1965లో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన వైవీయస్ చౌదరికి చిన్నప్పట్నుంచే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. చదువుకొనే వయసులోనే ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని స్థాపించి దానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు.
రాఘవేంద్రరావు శిష్యుడిగా..
ఆ తర్వాత అందరి సినిమాలు చూస్తూ... వాటిలో లోటుపాట్లు, మంచి చెడులు.. ఏ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుందో స్నేహితుల దగ్గర చెప్పేవారట. ఇంజినీరింగ్ చదువుకోవడం కోసం మద్రాసు వెళ్లిన ఆయన, సినిమాలపై ఇష్టంతో చదువుని పక్కనపెట్టి అక్కడే ఎడిటింగ్ విభాగంలో చేరారు. ఆ తర్వాత సహాయ దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించారు. ఎన్టీఆర్‌తో పలు చిత్రాలు తీసి విజయాలు అందుకొన్న కె.రాఘవేంద్రరావు అంటే చౌదరికి ఎంతో అభిమానం. దాంతో ఆయన ఎలాగైనా రాఘవేంద్రరావు దగ్గర సహాయ దర్శకుడిగా చేరాలనుకొన్నారు. కానీ అప్పటికే ఆయన దగ్గర చాలామంది ఉండటం వల్ల కుదరదని చెప్పారు.
దర్శకుడిగా అవకాశం
పట్టు వదలకుండా వారం రోజులపాటు ఆయన ఇంటి దగ్గరే నిలబడి సహాయ దర్శకుడిగా అవకాశం సంపాదించారు. అలా 'పట్టాభిషేకం', 'కలియుగ పాండవులు', 'సాహస సామ్రాట్', 'అగ్నిపుత్రుడు', 'దొంగరాముడు', 'జానకిరాముడు', 'రుద్రనేత్ర', 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిత్రాలకి పనిచేశారు చౌదరి. ఆ తర్వాత వైజయంతీ మూవీస్‌లో చేరి 'అశ్వమేథం', 'గోవిందా గోవిందా' చిత్రాలకి కో డైరెక్టరుగా పనిచేశారు. 'క్రిమినల్', 'గులాబి', 'నిన్నే పెళ్లాడతా' చిత్రాల తర్వాత నాగార్జున అవకాశం ఇవ్వడం వల్ల ఆయన నిర్మాణంలో 'శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి' చిత్రం చేశారు చౌదరి. ఒక ముఖ్యపాత్రలో ఏఎన్నార్... ప్రధాన పాత్రధారులుగా కొత్తవాళ్లతో తెరకెక్కిన ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత నాగార్జునే 'సీతారామరాజు' చేసే అవకాశం ఇచ్చారు. అదీ విజయవంతమైంది.