"గ్యాప్‌లు మనం తీసుకోం.. అవి వస్తుంటాయి. ప్రతి వ్యక్తి జీవితంలోనూ కొన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి. ఫలితంగా ఏదోక సమయంలో కొన్ని విరామాలు తప్పవు. ఇప్పుడు నాకొచ్చిన విరామమూ అలా వచ్చిందే" అంటున్నారు వైవీఎస్ చౌదరి. 'సీతారామరాజు', 'యువరాజు', 'సీతయ్య', 'దేవదాస్' వంటి విజయవంతమైన చిత్రాలతో చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడాయన. 'రేయ్' సినిమా తర్వాత కాస్త విరామం తీసుకున్న ఆయన.. ఇప్పుడు తనదైన శైలిలో ఓ తెలుగుదనం నిండిన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా శనివారం విలేకర్లతో ఆన్‌లైన్ వేదికగా ముచ్చటించిన ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఓ దర్శకుడిగా జయాపజయాలు, విరామాల విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?
"వ్యక్తి ప్రతిభకు జయాపజయాలు కొలమానాలు కావని నమ్మే వ్యక్తిని నేను. ఎప్పుడైనా పరాజయం ఎదురైనా.. అది ఆ ఒక్క ఉత్పాదకతకే పరిమితం. అంతేకాని మన కృషిలోనూ.. సృజనాత్మకతలోనూ ఫెయిలైనట్లు కాదు. ఏ దర్శకుడైనా సరే.. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవడం ముఖ్యం. చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతోంది.. సినిమా ఎలా రూపాంతరం చెందుతోంది.. ప్రేక్షకుల అభిరుచుల్లో ఎలాంటి మార్పులొస్తున్నాయి..? ఇలాంటివన్నీ గమనిస్తుండాలి. మొదటి నుంచీ నేను అనుసరిస్తున్న సిద్ధాంతమిది. కెరీర్ ఆరంభంలో పదేళ్లకు పైగా తెలుగు నేటివిటీకి దూరంగా ఉన్నా.. వరుసగా పలు విజయవంతమైన చిత్రాలు తీయగలిగానంటే కారణం నేను నమ్మిన ఈ సిద్ధాంతమే. నేనిప్పటికీ ఇదే ఫాలో అవుతున్నా. ఈ మధ్య చిత్రసీమకు కాస్త దూరమైనా.. పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ వస్తున్న మార్పులను తెలుసుకుంటున్నా"
మరిప్పుడున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కొత్త కథ సిద్ధం చేశారా?
"ప్రస్తుతం నేనొక అందమైన ప్రేమకథ సిద్ధం చేశా. తెలుగు వారి సంస్కృతి - సంప్రదాయాలు ఉట్టిపడేలా.. తెలుగు వాళ్ల వాడి-వేడి ప్రతిబింబించేలా.. స్క్రిప్ట్ రాసుకున్నా. దీంట్లో మధురమైన సంగీతంతో పాటు తేనెలూరే సాహిత్యమూ మిళితమై ఉంటుంది. వీలైనంత తక్కువ సమయంలో ప్రేక్షకులకు ఆసక్తిరేకెత్తించేలా ఈ సినిమాను ముస్తాబు చేయాలని ప్రణాళిక రచిస్తున్నా. దాదాపు కొత్తవాళ్లతోనే ఈ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నా. కథానాయికగా ఓ పదహారణాల తెలుగమ్మాయిని తీసుకోవాలని నిర్ణయించుకున్నా. నిజానికి గతేడాదే దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలి అనుకున్నా. కరోనా - లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల ఆలస్యమైంది. మళ్లీ ఇప్పుడు సెకండ్ వేవ్ దెబ్బ కొట్టింది. ఈ పరిస్థితులు కుదుటపడగానే చిత్రీకరణ ప్రారంభిస్తా".
ప్రస్తుతం దర్శకులంతా వెండితెరతో పాటు డిజిటల్ వేదికల వైపు దృష్టి సారిస్తున్నారు. మరి మీరు?