తెలుగు సినిమాల్లో యాక్షన్‌ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు వి.వి.వినాయక్. ఫ్యాక్షన్ కథలతో ఒక కొత్త ట్రెండ్‌ని సృష్టించారు. మాస్ నాడి పట్టి స్టార్‌గా ఎదిగిన అతి కొద్దిమంది దర్శకుల్లో ఈయన ఒకరు. మంచి కథ దొరికిన ప్రతిసారీ దర్శకుడిగా తన సత్తాని చాటుతుంటారు. ప్రస్తుతం 'ఛత్రపతి' సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్నారు. త్వరలోనే ఇది పట్టాలెక్కనున్న సందర్భంగా వి.వి.వినాయక్‌తో 'ఈనాడు సినిమా' ముచ్చటించింది.
- తొలిసారి హిందీలో సినిమా చేస్తున్నారు. ఆ అనుభవం ఎలా ఉంది?
చాలా కొత్త అనుభవం. అక్కడంతా ఒక పద్ధతి, సమయం ప్రకారం పనులు జరుగుతుంటాయి. ప్రతీ సినిమాకీ ఒక లైన్ ప్రొడ్యూసర్ ఉంటాడు. అతని ప్రణాళికల ప్రకారం అందరం పనిచేయాల్సి ఉంటుంది. హిందీలో సినిమా అంటే ఆ ప్రాజెక్ట్ స్థాయి పెరుగుతుంది. మన ఆలోచనల్ని మరింత భారీగా చూసుకొనే అవకాశం ఉంటుంది. 'ఛత్రపతి' రీమేక్ స్థాయి చాలా పెద్దగా ఉంటుంది. హిందీలో పేరు మోసిన సంస్థ పెన్ స్టూడియోస్. జయంతిలాల్ గడ నిర్మాణంలో చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లోనే చిత్రీకరణ మొదలు పెడతాం.
- మన శైలి కథలకి హిందీలో మంచి ఆదరణ లభిస్తుంటుంది కదా..?
హిందీలో డబ్ అయ్యే మన సినిమాల్ని అంతర్జాలంలో విశేషంగా ఆదరిస్తుంటారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాల్ని హిందీ ప్రేక్షకులు భలే చూస్తుంటారు. అది గమనించే జయంతిలాల్ గడ హిందీలో ఈ సినిమా చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆయన దగ్గరే 'ఛత్రపతి' రీమేక్ హక్కులు ఉన్నాయి. హిందీలో సాయిశ్రీనివాస్‌కి ఉన్న ఆదరణని గమనించే తనతో చేయాలనుకున్నారు. ఆ తర్వాత నన్ను సంప్రదించారు. మంచి సినిమా కాబట్టి నేనూ చేయాలని నిర్ణయించుకున్నా.
- స్క్రిప్ట్‌లో చేసిన మార్పులేంటి?
రచయిత విజయేంద్రప్రసాద్ సర్ హిందీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. మేం అంతా ఒక బృందంగా కూర్చుని స్క్రిప్ట్ కోసం పనిచేశాం. రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' సినిమా విషయంలో బిజీగా ఉన్నారు. అందుకే కలవలేదు. తర్వాత ఎప్పుడైనా కూర్చుంటాం.
- రీమేక్ కోసం రాజమౌళి సినిమాల్లో ఏదైనా ఎంపిక చేసుకోమని చెబితే దేన్ని ఎంచుకుంటారు?
నేనైతే 'సింహాద్రి'ని ఎంచుకునేవాణ్ని. అదొక గొప్ప కథ, చాలా మంచి స్క్రిప్ట్.
- హీరోయిజంతో పాటు.. కామెడీపై అంతే పట్టు ప్రదర్శిస్తుంటారు. దీని వెనక రహస్యం?