తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మిడిల్ క్లాస్ మెలొడీస్' ఆలోచన అలా! - anand devarakonda middle class melodies movie

తమ జీవితాల్లో చూసిన కథలతోనే 'మిడిల్ క్లాస్ మెలొడీస్' సినిమా తీశానని యువ దర్శకుడు వినోద్ అనంతోజు చెప్పారు. ఇటీవలే 'అమెజాన్ ప్రైమ్'లో విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

director vinod about middle class melodies movie
'మిడిల్ క్లాస్ మెలొడీస్' సినిమా అలా తీశాం: వినోద్

By

Published : Nov 22, 2020, 1:30 PM IST

"ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చెయ్యాలనో, డబ్బులు సంపాదించాలనో.. సినిమాలు చెయ్యడం కంటే నిజాయితీగా ఓ మంచి కథ చెప్పాలని చేసే చిత్రాలే అందరికీ చేరువవుతాయని నమ్ముతా. అలాంటి మంచి కథలు చెప్పడమంటే నాకిష్టం" అని అన్నారు వినోద్‌ అనంతోజు. ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’ చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన కొత్త దర్శకుడాయన. ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. వర్ష బొల్లమ్మ నాయిక. ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు వినోద్‌.

దర్శకుడు వినోద్ అనంతోజు

‘‘సినిమాలు చూసి సినిమాలు తియ్యాలనుకోలేదెప్పుడూ. పుస్తకాలు చదివి, కథలు బాగా చెప్పాలన్న కోరికతోనే సినిమాలు తీద్దామనుకున్నా. నేను పుట్టి పెరిగిందంతా గుంటూరులోనే. అక్కడే ఇంజినీరింగ్‌ చదివా. నాన్న విశాలాంధ్ర బుక్‌హౌస్‌లో పనిచేసేవారు. ఇంటి నిండా చాలా పుస్తకాలు ఉండేవి. అవన్నీ చదవడం చిన్నప్పటి నుంచీ అలవాటయ్యి.. మంచి కథలు చెప్పాలన్న కోరిక పుట్టింది. ఇందుకు సినిమానే మంచి వేదిక అనిపించి.. ఇటు వైపు వచ్చా. ఈ క్రమంలోనే చదువుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ కొన్ని లఘు చిత్రాలు చేశా. తర్వాత పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో మూడేళ్ల క్రితం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేసి ఇటు వైపు వచ్చేశా.

మిడిల్ క్లాస్ మెలొడీస్ పోస్టర్

మా జీవితాల్లో చూసిన కథలే..

‘‘ఈ చిత్ర కథను నేను, మరో రచయిత జనార్థన పసుమర్తి కలిసి తయారు చేసుకున్నాం. ఇద్దరం గుంటూరు నుంచి వచ్చిన వాళ్లమే. ఇద్దరివీ మధ్యతరగతి కుటుంబాలే. కాబట్టి మా ఇద్దరి జీవితాల్లోనూ మధ్యతరగతి మనుషులకు సంబంధించి చాలా ఆసక్తికర విషయాలున్నాయి. వాటిలో నుంచే ఈ ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’ కథను రాసుకున్నాం. దీంట్లో మొత్తం మేం చూసిన సంఘటనలు.. మాకు తెలిసిన వ్యక్తుల జీవితాలే కనిపిస్తాయి. సినిమాలో హీరో బొంబాయి చెట్నీ చేస్తుంటాడు కదా.. దీనికి

రచయిత జనార్థన్‌ ఇంటి ఎదురుగా ఉన్న కాకా హోటల్‌ స్ఫూర్తి. అక్కడ బొంబాయి చెట్నీ చేస్తుంటారు. అలాగే సినిమాలో సెల్‌ఫోన్‌ షాప్‌లో పని చేసే అమ్మాయి పెళ్లి కథ ఉంటుంది కదా.. దానికి మా ఇంటి దగ్గర్లో ఉన్న ఓ ఫ్యామిలీ కథ స్ఫూర్తి. ఇలా మాకు పరిచయమైన అనుభవాల నుంచే కథను రాసుకున్నాం’’.

ఆనంద్‌ను అనుకోలేదు..

‘‘ఇది ఆనంద్‌ను దృష్టిలో పెట్టుకొని రాసిన కథ కాదు. ఓ కొత్త హీరోతో చెయ్యాలనుకున్నాం అంతే. కథ పూర్తయ్యాక చాలా మంది నిర్మాతలు, హీరోల చుట్టూ తిరిగాం. ఓరోజు తరుణ్‌ భాస్కర్‌కి ఈ కథ వినిపిస్తే.. ‘ఇది ఆనంద్‌కు బాగా సరిపోతుంది. ఒకసారి వెళ్లి వినిపించొచ్చు కదా’ అని సలహా ఇచ్చారు. అప్పటికి ఆనంద్‌ ‘దొరసాని’ సినిమా చిత్రీకరణలో ఉన్నాడు. తనని చూడగానే నా కథకు సరిపోతాడనిపించింది. కథ చెప్పా. అది తనకీ నచ్చింది. అలా సినిమా సెట్స్‌పైకి వచ్చింది. మేము చెప్పేది మధ్యతరగతి జీవితాల కథ కావడంతో సెట్స్‌పైకి వెళ్లడానికి ముందు దీనిపై బాగా స్టడీ చేశాం. ఈ జోనర్‌లో 80, 90ల్లో దర్శకులు జంధ్యాల, బాపు ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. వాళ్లందరి చిత్రాలు బాగా చూశాం. అలాగే ప్రస్తుతం ఈ జోనర్‌లో వస్తున్న అనేక మలయాళ చిత్రాలూ చూశాం. ఇప్పుడు చిత్రానికి దక్కుతున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.

మిడిల్ క్లాస్ మెలొడీస్ పోస్టర్

నాదీ రాఘవ లాంటి జీవితమే..

‘‘సినిమాలో హీరో ఆనంద్‌ పాత్ర రాఘవకు.. నా నిజ జీవిత పాత్రకు చాలా దగ్గర పోలికలుంటాయి. నేను ఉద్యోగం మానేసి సినిమాల్లోకి వస్తున్నప్పుడు చాలా మంది నిరుత్సాహపరిచారు. ‘మంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదులుకోని సినిమాల్లోకి వెళ్తున్నావు..లైఫ్‌ రిస్క్‌లో పెట్టుకుంటున్నావు, పరిశ్రమలో నీకంటూ తెలిసిన వ్యక్తులు లేరు.. ఇది వర్కవుటవ్వదు’ అని రకరకాల విమర్శలు వినిపించాయి. అయితే ఇంట్లో వాళ్లు మంచి ప్రోత్సాహమందించారు. పరిశ్రమలోకి వచ్చాక కొన్నాళ్లు డబ్బులకి ఇబ్బంది పడినా.. తిరిగి వెళ్లిపోవాలని అయితే ఎప్పుడూ అనిపించలేదు. దీనికి తోడు మూడేళ్లకే సినిమా బయటకి వచ్చింది కాబట్టి చాలా హ్యాపీ’’.

అలాంటి కథలు చెప్పాలనుంది

‘‘మనం ఎలాంటి కథ చెప్పినా.. అది ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా ఉండాలి. అందులో భావోద్వేగాల్ని వాళ్లు నిజంగా అనుభూతి చెందగలగాలి. నేనిలాంటి కథలు చెప్పడానికే ఇష్టపడతా. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. వెబ్‌సిరీస్‌లు చేయడానికీ సిద్ధమే. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాలపైనే ఉంది’’.

మిడిల్ క్లాస్ మెలొడీస్ పోస్టర్

నా భార్య వల్లే.. నేనిక్కడి దాకా..

‘‘నాది ప్రేమ వివాహం. నా భార్య పేరు రెహనుమా. తను ముస్లిం. ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. ఉద్యోగం మానేసి సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు.. నా భార్య చాలా ప్రోత్సాహాన్ని అందించింది. తను ఉద్యోగం చేస్తూ ఇన్నిరోజులు కుటుంబాన్ని నడిపించింది. ఆమె అందించిన ఆ ప్రోత్సాహం వల్లే నేనీ రోజు ఈస్థాయికి చేరుకోగలిగా’’.

ABOUT THE AUTHOR

...view details