పవన్ కల్యాణ్ నుంచి ప్రతి రోజూ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఆయన అంకితభావంతో పనిచేస్తుంటారు. చుట్టూ ఉన్న మనుషులందరినీ ఒకేలా చూడటం, గౌరవించడం ఆయనలో గమనించిన మరో గొప్ప లక్షణం. కంగారులోనైనా 'గారు' అని సంబోధించడం మరిచిపోరు. సెట్‌లో సమయం దొరికిందంటే అందరితో సరదాగా మాట్లాడతారు. మన గురించి అన్ని వివరాలు తెలుసుకుంటారు. మొదట 'పుస్తకాలు చదువుతారా? ఏం చదివారు?' అని అడుగుతారు. ఆయన అభిమానిగా నేను ఫీల్ అయినవి చెప్పుకోవడానికే సమయం సరిపోయింది (నవ్వుతూ).
.
పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలనే కోరిక మొదట్నుంచీ ఉండేదా?
ఇష్టమైన కథానాయకుడితో సినిమా చేయాలని ప్రతి దర్శకుడికీ ఉంటుంది. పవన్ అభిమానిని నేను. 'ఖుషి' 22 సార్లు, 'గబ్బర్‌సింగ్' 23 సార్లు చూశా. ఇష్టమైన స్టార్‌తో సినిమా చేసే అవకాశం వస్తే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం.
రీమేక్ కాకుండా.. సొంత కథతో చేసే అవకాశం వచ్చుంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా?
మన హీరోని ఇలాంటి కథలో చూసుకోవాలనే ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి. అలాగని రీమేక్ తక్కువ కాదు. 'పింక్' ఆధారంగా తెరకెక్కుతున్న 'వకీల్‌సాబ్'.. పవన్ స్థాయికి తగ్గ చిత్రం. సమాజానికి చెప్పాల్సిన కథ ఇందులో ఉంది.
'వకీల్‌సాబ్' అవకాశం ఎలా వచ్చింది?
'వకీల్‌సాబ్'కి ముందు వేరే సినిమా ప్రయత్నాల్లో ఉన్నా. అప్పుడు అనుకోకుండా దిల్‌రాజుతో కలిసి త్రివిక్రమ్ దగ్గరికి వెళ్లా. 'పింక్' రీమేక్ గురించి వాళ్లిద్దరి మధ్య చర్చ జరిగింది. ఆ అవకాశం నాకే వస్తుందని అప్పుడు ఊహించలేదు.