ప్రేమ.. రెండు గుండెల చప్పుడు. రెండు జీవితాల సంగమం. రెండు కుటుంబాల కలయిక. అపురూపమైన ప్రేమను, అనిర్వచనీయమైన జీవితాన్ని, చిన్ని ఎద పట్టని భావోద్వేగాల్ని తెరకెక్కించగల ఇంటెలిజెంట్ డైరెక్టర్. ఆయనకు లెక్కలు తెలుసు. లెక్కల్లో ఇమిడిపోగల బతుకులు తెలుసు. అటు గణితాన్ని, ఇటు జీవితాన్ని కలగలిపి కలర్ ఫుల్‌గా కళ్లాపి జల్లి తెరపై రంగురంగుల రంగవల్లికలు అద్దగల సృజనశీలి. వన్ సైడ్ ప్రేమికుల పక్షాన నిలిచి.. వారి హృదయ స్పందనను 'ఆర్య'గా మలచినా.. బావమరదళ్ల సరస సల్లాపాల్ని 100 పర్సెంట్ లవ్‌గా తీర్చిదిద్దినా, మనం మరిచిపోతున్న మన పల్లె సీమల రంగస్థలాన్ని మనముందుకు తెచ్చినా.. ఆ లెక్కల మాస్టారికే చెల్లు. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా తెలుగు సినిమా పరిశ్రమకు సేవలందించిన ఘనత ఆయన సొంతం. ఆయనే ప్రముఖ దర్శకుడు సుకుమార్. జనవరి 11న ఈయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..
స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లా రాజోలు సమీప మట్టపర్రులో 1970 జనవరి 11న సుకుమార్ జన్మించారు. తండ్రి తిరుపతి నాయుడు బియ్యం వ్యాపారి. తల్లి వీరవేణి గృహిణి. ఈ దంపతుల ఆరుగురి సంతానంలో సుకుమార్ చిన్నవారు. ఆరు సంవత్సరాల వయస్సులో.. తాను ఎంతగానో ప్రేమించిన కోడి పుంజు చనిపోయిన విషయం తెలుసుకొన్న సుకుమార్ అప్పటి నుంచి శాకహారిగా మారారు. రాజోలులో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివారు. ఆ తర్వాత లెక్కల్లో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందారు. కాకినాడలో ఆదిత్య జూనియర్ కళాశాలలో మ్యాథ్స్, ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేశారు. ఆరు సంవత్సరాల తర్వాత సృజనాత్మకంగా ఏదైనా చేయాలని తన జూనియర్ ప్రకాష్ తోలేటితో కలిసి సుకుమార్ నిర్ణయించుకొన్నారు.
సినీ రచయితగా
ప్రకాష్ తోలేటి, సుకుమార్ కలిసి కొన్ని తెలుగు సినిమాలకు రచయితలుగా పని చేయడం ప్రారంభించారు. వాటిలో చిరంజీవి, రంభ కలిసి నటించిన బావగారు బాగున్నారా సినిమా కూడా ఉంది. అయితే, డబ్బును సంపాదించాలన్న ఆలోచనతో సుకుమార్ మళ్లీ విద్యార్థులకు భోధన చేయడం మొదలుపెట్టారు. డబ్బును సంపాదించిన తరువాత సినిమా పరిశ్రమకు తిరిగి వచ్చారు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జుంక్షన్ సినిమాలకు సహాయకుడిగా పని చేశారు. దర్శకుడిగా మారక ముందు వి.వి.వినాయక్ దిల్ సినిమాకు సహాయక దర్శకుడిగా పని చేశారు.
ప్రేమ వివాహం
సుకుమార్ భార్య పేరు తబిత. ఆర్య సినిమా స్క్రీనింగ్ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సుదర్శన్ థియేటర్లో జరుగుతున్నప్పుడు మొదటిసారి సుకుమార్‌కు తబిత పరిచయమైంది. సుకుమార్ తల్లిదండ్రులు, సోదరి సమక్షంలో వీరికి వివాహమైంది. సుక్కు సినిమా రంగానికి చెందిన వారు అవడం వల్ల తబిత తల్లిదండ్రులు వీరి పెళ్లికి తొలుత అంగీకరించలేదు. అనంతరం వారు ఒప్పుకొన్నారు. వీరి పిల్లలు సుక్రాంత్, సుకృతివేణి.
దర్శకుడిగా
వినాయక్ దిల్ సినిమాకు పని చేయకముందే విశాఖపట్నంలో ఆర్య స్క్రిప్ట్‌ను రాయడం మొదలుపెట్టారు సుకుమార్. దిల్ సినిమా కమర్షియల్‌గా విజయం సాధిస్తే తనతో సినిమా నిర్మిస్తానని దిల్ రాజు చెప్పారు. డర్, కభీ హా కభీ నా, సినిమాలలో కథానాయికకు కథానాయకుడు తన ప్రేమను సినిమా చివరిలో చెబుతారు. ఈ ఆలోచనని పాతదని సుకుమార్ భావించారట. అందుకే ఆర్య సినిమాలోని తాను ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమని మొదట్లోనే చెప్పేటటువంటి కథాంశాన్ని ఎంచుకొన్నారట. ఆ కథకు ఇంప్రెస్ అయిన దిల్ రాజు ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి ముందుకొచ్చారు. రవితేజ, నితిన్, ప్రభాస్ పేర్లను పరిశీలించిన తరువాత అల్లు అర్జున్ను కథానాయకుడిగా ఎంచుకొన్నారు. అనురాధ మెహతా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో శివ బాలాజీ ముఖ్య పాత్రలో కనిపించారు.
2004లో ఈ సినిమా విడుదలైంది. రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఆర్య.. రూ.16 కోట్లు వసూళ్లు రాబట్టి కమర్షియల్‌గా విజయం అందుకొంది. ఈ విజయంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయారు సుకుమార్.