ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కరోనా బారినపడ్డారు. వైద్య పరీక్షలు చేయించగా సెప్టెంబరు 9న పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని ఆయన స్వయంగా ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటున్నానని చెప్పారు. తనకు పూర్తి స్థాయిలో కరోనా లక్షణాలు లేవని, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు.
ఈ నెల 22తో రెండు వారాల క్వారంటైన్ కాలం పూర్తవుతుందని తెలిపారు. తరచూ సీటీ స్కాన్ తీయించుకుంటున్నానని.. ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలూ లేవన్నారు. సెప్టెంబరు 21న తన పుట్టినరోజు నేపథ్యంలో చాలా మంది పాత్రికేయులు ఇంటర్వ్యూల కోసం ఫోన్ చేస్తున్నారని, క్వారంటైన్‌లో ఉన్నందున లిఫ్ట్ చేయడం లేదని వివరించారు. ఇంట్లోనే ఓ గదిలో ఉంటున్నానని అన్నారు. ఈ కాలాన్ని స్క్రిప్టులు రాయడానికి ఉపయోగిస్తున్నానని చెప్పారు.