RGV meet perni nani: సినిమా టికెట్ ధరల తగ్గింపు వల్ల సినిమా రంగం తీవ్రంగా దెబ్బతింటోందని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నానితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పేర్నినానితో చర్చలు సంతృప్తికరంగా ముగిశాయని ఆర్జీవీ అన్నారు. ఐదు ముఖ్యమైన అంశాలపై చర్చించామని, ప్రధానంగా టికెట్ల రేట్ల తగ్గింపును ముందుగా ప్రస్తావించానని చెప్పుకొచ్చారు. థియేటర్ల మూసివేతపై ఎలాంటి చర్చా జరగలేదని స్పష్టం చేశారు. ధరల కేటాయింపుపై ఎవరికీ అధికారం ఉండకూడదని అన్నారు.
రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించా..
ఏపీ మంత్రి పేర్ని నానితో జరిగిన భేటీలో ఐదు అంశాలపై ప్రధానంగా చర్చించాం. టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించా. సినీ రంగంతో నాకున్న 30ఏళ్ల అనుభవంతో ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చా. ఆయన కూడా కొన్ని విషయాలను నా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని మా సినీరంగానికి చెందిన వారిని కలిసి చర్చిస్తా. ఇదొక పద్ధతి ప్రకారం చేస్తాం. అందరికీ ఒక పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నా. టికెట్ రేట్లు తగ్గిస్తే ఇండస్ట్రీకి చాలా నష్టం వస్తుందని ఆయనకు వివరించా. సినీ నిర్మాతగా నా అభిప్రాయం చెప్పా. నా వాదన వినిపించేందుకు మాత్రమే ఇక్కడకు వచ్చా. నేను ఎలాంటి డిమాండ్లు ఆయన ఎదుట పెట్టలేదు. ఈ భేటీ ద్వారా వచ్చిన అభిప్రాయాలపై ఇద్దరం చర్చిస్తాం. తుది నిర్ణయం అనేది ప్రభుత్వం తీసుకుంటుంది. -రామ్ గోపాల్ వర్శ, ప్రముఖ దర్శకుడు
ఆ వాదనతో ఏకీభవించను..
‘‘రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను తగ్గించిందనే వాదనతో నేను ఏకీభవించను. అయితే, ప్రభుత్వం నిర్ణయం స్టార్‌లందరిపైనా, అన్ని సినిమాలపైనా ప్రభావం చూపుతోంది. కేవలం పవన్‌కల్యాణ్, బాలకృష్ణను టార్గెట్ చేయడానికి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు. టికెట్ రేట్ల తగ్గింపు విషయంలో నేను అడిగిన ప్రశ్నలకు విపులంగా ఉదాహరణలు చెప్పి అన్నీ వివరించా. కేవలం ఈ ఒక్క చర్చతోనే టికెట్ రేట్ల తగ్గింపు అంశం ముగిసిపోదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే నేను ఒక్కడినే కాదు. వందల మంది ఉన్నారు. వాళ్లందరి అభిప్రాయాలను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. నేను సినిమా ఇండస్ట్రీ తరపున రాలేదు. ఒక సినిమా నిర్మాత మాత్రమే ఇక్కడ చర్చించడానికి వచ్చా. ఎవరైతే సినిమా తీశారో వాళ్లే టికెట్ రేటు నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలి. సమస్య పరిష్కారం అనేది సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వం ఇద్దరిపైనా ఉంది. తప్పుడు కలెక్షన్లు, పన్ను ఎగవేతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. తాజా చర్చలతో నూటికి నూరుశాతం సంతృప్తితో ఉన్నా’’ అని వర్మ చెప్పుకొచ్చారు.
ట్వీట్ వార్...
సినిమా టికెట్ల అంశంపై ఏపీ మంత్రులు వర్సెస్ ఆర్జీవీ అన్నట్లుగా గత కొంత కాలంగా ట్వీట్ వార్ కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి పేర్ని నానిని కలిసేందుకు ఆర్జీవీ అనుమతి కోరారు. మంత్రి అనుమతిస్తే తమ సమస్యలు వివరిస్తానని చెప్పారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. ప్రభుత్వంతో గొడవకు దిగాలనేది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.
ఆర్జీవీ చేసిన విజ్ఞప్తికి.. మంత్రి పేర్ని నాని కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. "ఆర్జీవీకి ధన్యవాదాలు.. తప్పకుండా త్వరలో కలుద్దాం" అంటూ.. రిప్లే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని ఇవాళ (జనవరి 10)న అపాయింట్మెంట్ ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ ప్రశ్నలు..
RGV Comments: అంతకు ముందు సినిమా టికెట్ రేట్లు తగ్గించడాన్ని తప్పుబట్టిన వర్మ.. వరుస ట్వీట్లు చేశారు. మంత్రి పేర్ని నానికి కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చారు. ముడి పదార్థం రూ.500 కూడా ఖర్చవ్వని పెయింటింగ్‌ని.. కొనేవాడుంటే ఐదు కోట్లకూ అమ్ముతారని అన్నారు. ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే బ్రాండ్‌కి, ఆలోచనకు ఎలా వెలకడతారని ప్రశ్నించారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంకా బాగుండాలంటే ఏం చేయాలన్నది కొనుగోలుదారుడే నిర్ణయిస్తాడని తేల్చి చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్ ప్రభుత్వానికి తెలియకుండా చేసే నేరమన్న ఆర్జీవీ.. ప్రభుత్వానికి చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం కల్పించుకోవాల్సి విపరీత పరిస్థితి ప్రస్తుతం లేదని బదులిచ్చారు. పరస్పర అంగీకార లావాదేవీలకు లూటీ అనే పదం సరికాదని హితవు పలికారు. మొదటి నుంచి థియేటర్లు వ్యాపార సంస్థలు మాత్రమేనన్న ఆర్జీవీ.. ప్రజాసేవ కోసం ఎవరూ థియేటర్లు పెట్టలేదని స్పష్టం చేశారు. థియేటర్లనేవి ప్రజా కోణంలో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. కావాలంటే మీ గవర్నమెంట్లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి అన్నారు. మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి ఆ డెఫినిషన్(లూటీ) మీకు మీరు ఇచ్చుకుంటున్నారని ట్వీట్ చేశారు.