తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'టికెట్ రేట్ల లాజిక్​ ఏంటో ఏపీ ప్రభుత్వం మాకూ చెప్పాలి' - రామ్​గోపాల్ వర్మ

Ram Gopal Varma: సినిమా టికెట్​ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్ వర్మ. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక ఏదైనా లాజిక్‌ ఉంటే అది చిత్ర పరిశ్రమకూ తెలియజేయాలని కోరారు. కొందరు హీరోలను కావాలని తొక్కేయడానికే ప్రభుత్వం ఇలా చేస్తుందనడాన్ని ఒప్పుకోనని చెప్పారు.

ram gopal varma
రామ్​గోపాల్ వర్మ

By

Published : Jan 2, 2022, 6:58 PM IST

Ram Gopal Varma: సినిమా టికెట్‌ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే పలుమార్లు మాట్లాడిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి స్పందించారు. యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా ఆదివారం తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక ఏదైనా లాజిక్‌ ఉంటే అది చిత్ర పరిశ్రమ వారికీ తెలియజేయాలని కోరారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

"నేనెప్పుడూ ప్రభుత్వ పాలసీలు, రాజకీయాలను పెద్దగా పట్టించుకోను. నాకు వాటిపై అవగాహన లేదు. ఇప్పుడు నేను మాట్లాడే సబ్జెక్ట్‌పైనా స్పష్టత ఉందో లేదో చెప్పలేను. చలన చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా, కామన్‌మ్యాన్‌గా నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. నేనెవరినీ తప్పు బట్టడంలేదు. ఓ మ్యాన్యుఫ్యాక్చరర్‌ తాను తయారు చేసిన వస్తువును పలు రకాల ఫ్యాక్టర్స్‌ను బట్టి వెల నిర్ణయిస్తాడు. ఆ ధర వినియోగదారుడికి నచ్చితే వస్తువును కొనుక్కుంటాడు. ఇష్టం లేకపోతే మానేస్తాడు. ఒకవేళ ఆ వస్తువు అమ్ముడుపోతే సంబంధిత ట్యాక్స్‌ ప్రభుత్వానికి చేరుతుంది. చిన్న హోటల్‌ అయినా, ఫైవ్‌స్టార్‌ హోటల్ అయినా తినే ఆహారం ఒకటే. ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు ఎంపిక చేసుకుంటారు. అది వారి వ్యక్తిగతం. థియేటర్ల విషయంలోనూ అంతే."

-రామ్​గోపాల్ వర్మ, దర్శకుడు

అందులో అర్థంలేదు..

"సినిమా టికెట్‌ రేట్ల విషయానికొస్తే.. ఉదాహరణకు తెలుగు సినిమా మార్కెట్‌ రూ.100 కోట్లు ఉందనుకుంటున్న రోజుల్లో దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ రూ. 200 కోట్ల బడ్జెట్‌తో ఓ సినిమా తీశారు. తమ ప్రొడక్ట్‌పై ఉన్న నమ్మకం అది. సూపర్‌ క్వాలిటీతో సినిమా తీస్తే మార్కెట్‌ను అధిగమించవచ్చని అలా చేస్తుంటారు. ఒకానొక సమయంలో పరాజయం పొందే అవకాశాలూ ఉండొచ్చు. ఒకవేళ అలా జరిగితే రాజమౌళి, శోభుకే నష్టం. లాభం వస్తే మొత్తం ఇండస్ట్రీకే పేరొస్తుంది. టాలీవుడ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం 'బాహుబలి'. హాలీవుడ్‌ని తలదన్నే ప్రతిభ తెలుగువారికి ఉందని ఈ సినిమాతో రాజమౌళి నిరూపించారు. 'బాహుబలి'కి మించి 'ఆర్‌ఆర్‌ఆర్‌'.. దీనికి మించి మరొకటి రావొచ్చు. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకు, ఇతర సినిమాలకు ఒకే టికెట్‌ ధర చెప్పడంలో అర్థంలేదు".

ఆ వాదన అనవసరం..

"సినిమాకు అయిన ఖర్చు రూ. 200 కోట్లు కాబట్టి రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందనే నమ్మకంతో రాజమౌళినే టికెట్‌ ధర నిర్ణయించాలి తప్ప మరొకరు ఎలా చెప్తారు? సినిమా బడ్జెట్‌.. సుమారు 70 శాతం (రెమ్యూనరేషన్‌) హీరోలకే వెళ్లిపోతుందని, 30 శాతమే మేకింగ్‌ కాస్ట్‌ అని పేర్ని నాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌ చెప్పిన దాంట్లో నిజంలేదు. ఎందుకంటే రెమ్యూనరేషన్‌, మేకింగ్‌ కాస్ట్‌ అంటూ ఏం ఉండవు. అంతా ఒకటే. రెమ్యూనరేషన్‌ కూడా ప్రొడక్ట్‌ మేకింగ్‌లో భాగమే. ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చేది హీరోను చూసేందుకే! హీరోలు అంత మొత్తం తీసుకుని ప్రేక్షకులపై భారం మోపుతున్నారని వాదించటం కరెక్ట్‌ కాదు".

ఒకే ధర అంటే ఎలా?

"బ్రాండెడ్‌ చొక్కా రూ. 50 వేలల్లో, సాధారణ చొక్కా రూ. 50కే లభించవచ్చు. అలాంటప్పుడు 'షర్ట్‌' అని బోర్డు పెట్టి రెండింటికీ ఒకే రేటు చెబితే ఎలా? సినిమా టికెట్‌ ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక ఏదైనా లాజిక్‌ ఉందా? ఉంటే అది చిత్ర పరిశ్రమకూ వివరించాలి. ధరను బట్టి టికెట్‌ కొనాలా, వద్దా? అని ప్రేక్షకుడు నిర్ణయించుకుంటాడు. కొందరు హీరోలను కావాలని తొక్కేయడానికే ప్రభుత్వం ఇలా చేస్తుందనడాన్ని నేను ఒప్పుకోను".

ఇదీ చూడండి:టికెట్​ రేట్ల వ్యవహారంపై వర్మ సంచలన వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details