స్టోరీ టెల్లింగ్(కథ చెప్పడం) ఓ కళ. ఎందుకంటే మనం కథ చెప్పే అంత సేపు ఎదుటివారిని అందులో లీనమైపోయేలా చేయడం, ఊహాలోకంలో విహరింపచేసేలా చేయడం మాములు విషయం కాదు. అయితే ఆ కళ తనలో చిన్నప్పటి నుంచే ఉందని అంటున్నారు స్టార్ దర్శకుడు రాజమౌళి. ఎదుటివారికి తనకు తెలిసిన కథలను ఆసక్తికరంగా చెప్పడం లేదా ఊహించి తనదైన శైలిలో కొత్తగా చెప్పడం వంటివి చేసేవారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గతంలో ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. అందుకేనేమో రాజమౌళి సినిమా అనగానే హీరోలు ఏమాత్రం ఆలోచించకుండా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తుంటారు!
"మా అమ్మమ్మ దగ్గర చాలా తెలుగు పుస్తకాలు.. పంచతంత్రం, బాలరామాయణం, బాలభారతం ఇలా పిల్లలకు సంబంధించిన ఎన్నో కథల పుస్తకాలు ఉండేవి. నేను చాలా పుస్తకాలు చదివేవాడిని. మా పాఠశాలలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ జరిగేవి. సాధారణంగా ఈ క్లాస్‌లో డ్యాన్సింగ్, సింగింగ్ ఇంకేదైనా పిల్లల కోసం ఉంటాయి. కానీ నేను రెండు, మూడు, నాలుగు తరగతి చదివేటప్పుడు మా స్కూల్లో శనివారం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే రాజమౌళి స్టోరీ టెల్లింగ్. హ్యాండ్ రైటింగ్ క్లాస్ అయిపోగానే అందరూ నావైపు చూస్తారు. నేను వెళ్లి నిల్చొని నేను చదివిన కథలను చెప్పేవాడిని. ఆ కథలో నాకు ఏదైనా నచ్చకపోతే అందులో మార్పులు చేసి నాకు నచ్చిన విధంగా చెప్పేవాడిని"