కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని ట్విట్టర్ వేదికగా అవగాహన కల్పిస్తున్నారు దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి. తాజాగా జక్కన్న ఆప్తులు, సంగీత దర్శకుడు కీరవాణి ప్లాస్మా దానం చేశారు. ఆయనతో పాటు తన తనయుడు కాలభైరవ కూడా ప్లాస్మా ఇచ్చారు. అయితే ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న రాజమౌళి మాత్రం ప్లాస్మా దానం చేయలేదు. తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చారు దర్శకధీరుడు.
"కరోనా నుంచి కోలుకున్నాక.. మన శరీరంలో ఏర్పడిన యాంటీబాడీలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. ఈలోపే ప్లాస్మా దానం చేస్తే వేరే వారి ప్రాణాన్ని కాపాడానికి అవకాశం ఉంటుంది. నా శరీరంలో యాంటీబాడీస్ కోసం పరీక్ష చేయించుకోగా ఐజీజీ లెవల్స్ 8.62 ఉన్నాయని, ప్లాస్మా దానం చేయాలంటే 15కన్నా ఎక్కువ ఉండాలని వైద్యులు తెలిపారు. పెద్దన్న కీరవాణి, భైరవ మంగళవారం ఉదయం ప్లాస్మా దానం చేశారు"