శ్రీశైల శ్రీ రాజమౌళి.. తెలుగునాట లబ్ధ ప్రతిష్టులైన దర్శకుడు. వందకు వందశాతం విజయాల దర్శకుడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒక్క వైఫల్యం అందుకోకుండా అంకిత భావంతో సినిమాలు చెక్కిన జక్కన్న. అవధుల్లేని బడ్జెట్... అయినా, ఆయనపై నిర్మాతలకు అంతులేని విశ్వాసం. సినిమా ఆయన చేతిలో పడితే చాలు.. దిగంతరాలు దద్దరిల్లే సక్సెస్ సొంతమవుతుందనే నమ్మకం. ఆయన సినిమాల్లో నటించాలని వేవేల కలలు కనే నటీనటులకు కొదవే లేదు. ఎంత చిన్న పాత్ర అయినా సరే.. ఆయన సినిమాల్లో చోటు కోసం ఆరాటపడే ఔత్సాహికులు మరెందరో? అంతటి సంచలన విజయాలు దక్కించుకున్న శ్రీశైల శ్రీ రాజమౌళి మరెవరో కాదు... ఆయనే ఎస్.ఎస్.రాజమౌళి.
ఈ పేరు వింటేనే ప్రపంచంలో ఏమూల ఉన్నా, తెలుగువారు పులకరించి పోవాల్సిందే. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఈ దర్శక ధీరుడి నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా?అని ఎదురుచూడని తెలుగు వాడు ఉండడు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం అక్కరలేదు సరికదా.. ఆ మాటల్లో అస్సలు అతిశయోక్తి కూడా లేదేమో. శ్రీశైల శ్రీ రాజమౌళి సృష్టించిన ప్రతి వెండితెర అద్భుతాన్ని ఎంతో మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారు ప్రేక్షకులు. అంతలా ప్రేక్షకులకు నచ్చేటట్టు సినిమాలు తీయడంలో ఈ దర్శకుడి శైలే వేరు. తీసిన ప్రతి సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడి పుట్టిన రోజు నేడు(అక్టోబర్ 10). ఈ సందర్భంగా రాజమౌళి గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం.
వ్యక్తిగత జీవితం
రాజమౌళి తల్లిదండ్రుల పేర్లు కె.వి.విజయేంద్ర ప్రసాద్, రాజా నందిని. రాజమౌళి పూర్తి పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి. కర్ణాటకలో 1973, అక్టోబర్ 10న జన్మించారు. ఆయన కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతానికి చెందినది. ఈయన ప్రాథమిక విద్య కొవ్వూరులో, ఉన్నత విద్య ఏలూరులో జరిగింది. రాజమౌళి ఎన్నో ఏళ్లుగా వైజాగ్‌లో ఉన్నారు. ఎందుకంటే, ఆయన తల్లి ఆ ప్రాంతానికి చెందినవారు కాబట్టి. స్వతహాగా రాజమౌళి నాస్తికుడు.
చిన్నితెర చిద్విలాసం
సినిమాలంటే రాజమౌళికి ఎంతో ఇష్టం. సినిమా రంగానికి సేవలు అందించాలని ఇక్కడకు వచ్చారు. మొదట దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మార్గదర్శకత్వంలో రాజమౌళి ఈటీవీ కోసం కొన్ని సీరియల్స్‌ను డైరెక్ట్ చేసేవారు. ఆ తర్వాత 'ఈటీవీ'లోనే 'శాంతినివాసం' టీవీ సిరీస్‌ను రూపొందించారు. ఈ సీరియల్‌ను రాఘవేంద్రరావు నిర్మించారు. ఆ సీరియల్ రాజమౌళికి ఎంతో పేరు తెచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే వెండితెరకు సరికొత్త భావజాలం ఉన్న కొత్త దర్శకుడిని ఇచ్చింది.
వెండితెరపైకి
రాజమౌళి మొదట దర్శకత్వం వహించిన సినిమా 'స్టూడెంట్ నెంబర్ వన్'. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రం 2001లో రిలీజ్ అయింది. ఈ సినిమా రాజమౌళికి, జూనియర్ ఎన్టీఆర్‌కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తర్వాత డైరెక్టర్‌గా రాజమౌళి, హీరోగా జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిందీలో ఈ సినిమా 'ఆజ్ కా ముజ్రిమ్' అన్న పేరుతో డబ్ అయింది. హిందీ ప్రేక్షకులనూ ఈ చిత్రం ఆకట్టుకొంది.
అయితే, 'స్టూడెంట్ నెంబర్ 1' తర్వాత 'సింహాద్రి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఈ దర్శకుడికి రెండేళ్ల సమయం పట్టింది. ఆ రెండేళ్ల గ్యాప్‌లో మలయాళ నటుడు మోహన్ లాల్‌తో ఓ పౌరాణిక చిత్రం తీయాలని భావించారు దర్శక ధీరుడు. కానీ, ఆ చిత్రం పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. ఇక 'సింహాద్రి' విషయానికొస్తే, భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఓ బ్లాక్ బస్టర్ అయింది.
రాజమౌళి మూడవ సినిమా 'సై'. ఈ చిత్రంలో నితిన్, జెనీలియా హీరోహీరోయిన్లుగా నటించారు. రగ్బీ ఆట నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. టాలీవుడ్‌లో ఆ ఆట నేపథ్యంలో తెరకెక్కిన మొదటి సినిమా ఇది. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌తో రాజమౌళి మొదట పని చేసిన సినిమా ఇది. 'ఆర్ పార్.. ది జడ్జిమెంట్ డే'గా హిందీలోకి ఈ సినిమా డబ్ అయింది.
రాజమౌళి రూపొందించిన నాలుగో చిత్రం 'ఛత్రపతి'. ప్రభాస్, శ్రియ శరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. ఈ మూవీ 'డార్లింగ్' ప్రభాస్‌కు ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఇందులో ప్రత్యేక గీతంలో ఆర్తీ అగర్వాల్ అలరించింది. 'హుకుమత్ కి జంగ్'గా హిందీలోకి డబ్ అయిన ఈ సినిమా బాలీవుడ్‌లోనూ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.
2006లో రాజమౌళి, మాస్ మహారాజ రవితేజ కలయికలో వచ్చిన మూవీ 'విక్రమార్కుడు'. ఈ చిత్రం నమోదు చేసుకున్న విజయం అంతాఇంతా కాదు. రాజమౌళి స్టైల్‌లో మరో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించారు. పోలీస్ ఆఫీసర్‌గా హీరో కనబరిచిన సాహసం అనన్యసామాన్యం. సమాజంలో పోలీసు వృత్తి పట్ల మరింత గౌరవం పెరిగేటట్టు చేసిన చిత్రంగా 'విక్రమార్కుడు' నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 'రౌడీ రాథోడ్'గా ఈ సినిమా హిందీలోకి రీమేక్ అయింది. అక్కడ విజయాన్ని అందుకుంది.
రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కలయికలో వచ్చిన మరొక సినిమా 'యమదొంగ'. ఈ చిత్రం ద్వారా మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు రాజమౌళి. మమతా మోహన్ దాస్, ప్రియమణి హీరోయిన్లుగా నటించగా... రంభ ప్రత్యేక గీతంలో కనిపించారు. 'లోక్... పర్ లోక్'గా ఈ సినిమా హిందీలోకి డబ్ అయింది.
2009... రాజమౌళికి ప్రత్యేకం