తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రమణీయ దృశ్యకావ్యాల దర్శకుడు.. రాఘవేంద్రుడు - రాఘవేంద్రరావు బి.ఎ కేరాఫ్​ బొడ్డపై ఆపిల్​

వినోదం, ఆనందం, ఆహ్లాదం సంపూర్ణ కలశంలో అందించి గమ్మత్తుగా వీక్షకుల్ని మత్తులో ముంచేసేలా చేయగల మహా చిత్రజాలకుడు. రెండక్షరాల ప్రేమను, అంతర్లీనంగా హృదయాల్ని రంజింపజేసే శృంగారాన్ని తెరపై సుందరంగా, సురుచిరంగా మలచే స్వప్నలోక సంచారి. ఆయనే... దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఈరోజు ఆయన 77వ పడిలోకి అడుగుపెడుతున్నారు.

director raghavendra rao 77th birthday

By

Published : May 23, 2019, 9:28 AM IST

తెరపై నాయికలను బహు సుందరంగా చూపించగల నేర్పరి... ఏ అందం ఏ కోణంలో కెమెరాని ఆకట్టుకుంటుందో తెలిసిన దర్శకుడు... రమణీయ దృశ్య కావ్యాలతో ఎందరో అభిమానులను గెలుచుకున్న దర్శకుడు రాఘవేంద్రరావు పుట్టిన రోజు నేడు.

బి.ఎ అంటే..?

రాఘవేంద్రరావు సినిమాలు చూసి ఆనందించిన ప్రేక్షకులు ఆయన బి.ఎ., డిగ్రీపై అప్పట్లో సరదా సెటైర్లు వేసేవారు. బి.ఎ. అంటే బొడ్డుపై ఆపిల్‌ అని సరికొత్త అర్థంతో రాఘవేంద్రరావు సినిమాల సారాన్ని ఒక్క పదంలో క్లుప్తంగా ఉదహరించేవారు.

కుటుంబ నేపథ్యం

రాఘవేంద్రరావు సినీ కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి కోవెలమూడి సూర్య ప్రకాశరావు, దర్శకుడు. తల్లి కోటేశ్వరమ్మ. సోదరుడు కోవెలమూడి బాపయ్య. 1941 మే 23న విజయవాడ కంకిపాడు దగ్గర కొలవెన్ను గ్రామంలో రాఘవేంద్రరావు పుట్టారు. భార్య సరళ. కుమారుడు ప్రకాష్‌ కోవెలమూడి, కూతురు మాధవి. 1961లో ‘వాగ్దానం’ సినిమాకి అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసి 1975లో దర్శకుడిగా ‘బాబు’ సినిమాతో పరిచయయ్యారు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు సినిమా కెరీర్‌లో 90 శాతం సూపర్‌ హిట్స్‌ ఉన్నాయంటే...అది చరిత్రే.

ఎంత ప్రతిభో..

దర్శకుడిగానే కాకుండా స్క్రీన్​ రైటర్, ప్రొడ్యూసర్, ప్రజెంటర్, కొరియోగ్రాఫర్‌...ఇలా ఆయన అడుగుపెట్టని రంగాలు లేవు. డైరెక్టర్‌గా 108 సినిమాలు. దర్శకత్వ పర్యవేక్షణలో 2001లో ‘స్టూడెంట్‌ నంబర్‌ 1’, 2002లో ‘ఒకటో నంబర్‌ కుర్రాడు’, 2004లో ‘పల్లకిలో పెళ్లికూతురు’ సినిమాలకు దిక్సూచి అయ్యారు. ప్రజంటర్‌గా 1992లో ‘సరిగమలు’, 2001లో ‘స్టూడెంట్‌ నంబర్‌ 1’, 2002లో ‘బాబీ’,. 2011లో ‘అనగనగా ఓ ధీరుడు’, 2015లో ‘బాహుబలి ది బిగినింగ్‌’, 2017లో ‘బాహుబలి ది కంక్లూజన్‌’ చిత్రాలకు తన ప్రతిభ అద్దారు. కొరియోగ్రాఫర్‌గా 1996లో ‘పెళ్లి సందడి’ చిత్రానికి పనిచేశారు.

బుల్లితెరపై మధుర జ్ఞాపకాలు

బుల్లితెరపై కూడా రాఘవేంద్రరావు విశేష ప్రతిభ కనబరిచారు. 2002లో ‘శాంతి నివాసం’ సీరియల్‌కి రైటర్‌గా పనిచేసారు. 2014లో ఈటీవీ ఆధ్వర్యంలో ‘సౌందర్య లహరి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. 2016లో ‘కోయిలమ్మ’, 2017లో ‘సై సై సయ్యారే’, అదే సంవత్సరం ‘అగ్ని సాక్షి’ సీరియల్‌కి తన ప్రతిభ అద్దారు.

అడవిరాముడి’తో కమర్షియల్‌ హిట్‌

అడవిరాముడు’ సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వ ఇమేజ్‌ని సంపూర్ణంగా మార్చేసింది. అప్పటికే అగ్ర హీరోగా ఇండస్ట్రీలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఎన్టీఆర్‌తో రాఘవేంద్రరావు కాంబినేషన్‌కి బీజం వేసిన చిత్రం ఇది. 1973లో కన్నడలో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన ‘గంధడ గుడి’ సినిమాకి తెలుగు అనువాదం ‘అడవిరాముడు’. ఆ తరువాత ...ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్‌కి ఇమేజ్‌ బాగా పెరిగింది. ‘సింహబలుడు’, ‘డ్రైవర్‌ రాముడు’, ‘వేటగాడు’, ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’, ‘గజదొంగ’, ‘తిరుగులేని మనిషి’, ‘సత్యం శివం’, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్‌ చౌదరి’, ‘మేజర్‌ చంద్రకాంత్‌’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించి విజయం సాధించారు.

అగ్రహీరోలతో కూడా

  1. అక్కినేని నాగేశ్వరరావుతో కూడా రాఘవేంద్రరావు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘ప్రేమకానుక’, ‘అగ్ని పుత్రుడు’, ‘సత్యం శివం’, ‘పెళ్లి సంబంధం’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
  2. చంద్రమోహన్‌ శ్రీదేవి జంటగా ‘పదహారేళ్ళవయసు చిత్రానికి ఆయనే దర్శకుడు.
  3. శోభన్‌ బాబుతో ‘మోసగాడు’, ‘ఇద్దరు దొంగలు’, ‘దేవత’ తీశారు. ఇక, కృష్ణంరాజుతో ‘అడవి సింహాలు’, అమరదీపం’, ‘త్రిశూలం’, ‘రగిలే జ్వాల’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘రావణ బ్రహ్మ’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
  4. కృష్ణ కి కూడా కొన్ని విజయవంతమైన చిత్రాలు అందించారు. ‘భలే కృష్ణుడు’, ‘ఘరానా దొంగ’, ‘ఊరికి మొనగాడు’, ‘శక్తి’, ‘అగ్నిపర్వతం’, ‘వజ్రాయుధం’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
  5. చిరంజీవితో కమర్షియల్‌ హిట్స్‌ అందించారు. ‘అడవిదొంగ’, ‘కొండవీటి రాజా’, ‘చాణక్య శపధం’, ‘యుద్దభూమి’, ‘రుద్రనేత్ర’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’, ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘ఇద్దరు మిత్రులు’, ‘శ్రీ మంజునాథ’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
  6. అక్కినేని నాగార్జునతో తీసిన చిత్రాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. ‘అగ్ని’, ‘ఘరానా బుల్లోడు’, ‘అన్నమయ్య’, ‘శ్రీ రామదాసు’, ‘షిర్డీ సాయి’, ‘ఓం నమో వెంకటేశాయా’ చిత్రాలు తీశారు. భక్తి ప్రధానమైన చిత్రాల్ల్లో ‘అన్నమయ్య’, ‘ఓం నమో వెంకటేశాయ’, ‘షిర్డీ సాయి’ చిత్రాలు మంచి ఆదరణకు నోచుకున్నాయి.
  7. బాలకృష్ణ, మోహన్‌ బాబు, రాజశేఖర్, జేడి చక్రవర్తి... ఇలా ఎంతోమంది హీరోలతో ఆయన చిత్రాలు తీసి హిట్‌ చేశారు.
  8. అల్లు అర్జున్‌ మొదటి సినిమా, రాఘవేంద్రరావు వందో సినిమా ‘గంగోత్రి’.
  9. మహేష్‌బాబు మొదటి సినిమా ‘రాకుమారుడు’...ఇలా ఈతరం నటులతో కూడా ఆయన సినిమాలు తీశారు.
  10. నితిన్, త్రిష జంటగా ‘అల్లరిబుల్లోడు’ సినిమా కూడా హిట్‌ అయింది. మంచు మనోజ్‌తో ‘ఝుమ్మంది నాదం’ సినిమా తీశారు.

బాలీవుడ్‌ హీరోలతో..

బాలీవుడ్‌ హీరోలతో కూడా రాఘవేంద్రరావు పనిచేసారు. జితేంద్ర- పూనమ్‌ ధిల్లాన్‌తో ‘నిశానా’, జితేంద్ర-హేమామాలినితో ‘ఫర్జ్‌ ఔర్‌ కానూన్‌’, జితేంద్ర- శ్రీదేవితో ‘హిమ్మత్‌ వాలా’, జితేంద్ర, జయప్రదతో ‘హోషియార్‌’, రాజేష్‌ ఖన్నా- శ్రీదేవితో కలసి ‘మాస్టర్జీ’, జితేంద్ర- శ్రీదేవితో ‘మేరా సాధీ’, దిలీప్‌ కుమార్-జితేంద్రతో కలసి ‘ధర్మాధికారి’, జితేంద్ర- శ్రీదేవితో ‘సుహాగన్‌, జానీ దోస్త్‌’, తోఫా’, ‘నయా కదం’వంటి చిత్రాలు తెరకెక్కించారు.

ఫిలిం ఫేర్‌ సౌత్‌ పురస్కారాలు

1977లో ‘ప్రేమలేఖలు’, 1990లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, 1993లో ‘అల్లరి ప్రియుడు’, 1997లో ‘అన్నమయ్య’, చిత్రాలకుగాను ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్‌ సౌత్‌ అవార్డులు రాఘవేంద్రరావుని వరించాయి. 2002లో ఫిలిం ఫేర్‌ సౌత్‌ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది ప్రభుత్వం.

నంది అవార్డులు
  1. 1984లో ‘బొబ్బిలి బ్రహ్మన్న’, 1993లో ‘అల్లరి ప్రియుడు’, 1996లో ‘పెళ్లి సందడి’, 1997లో ‘అన్నమయ్య’ చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులను అందుకున్నారు. ప్రత్యేకించి అన్నమయ్య చిత్రానికి అదనంగా ఉత్తమ చిత్రంగా మరో నంది కూడా వచ్చింది.
  2. 2009లో తెలుగు సినిమాకు అందించిన సృజనకుగాను బి.ఎన్‌.రెడ్డి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.
  3. 2013లో ‘షిర్డీ సాయి’ సినిమాకిగాను సినిమా అవార్డు స్పెషల్‌ జ్యూరీ పురస్కారం అందింది.
  4. 2014లో జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది సైమా.
  5. 2015లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని రాఘవేంద్రరావు అందుకున్నారు.
  6. 2016లో అల్లు రామలింగయ్య అవార్డును రాఘవేంద్రరావు అందుకున్నారు.
  7. 2017లో అవుట్‌ స్టాండింగ్‌ కాంట్రిబ్యూషన్‌తో ఇండియన్‌ సినిమా పురస్కారాన్ని ఐఐఎఫ్‌ఎ సంస్థ అందించింది.

ABOUT THE AUTHOR

...view details