తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చిరుత'లో 'నచ్చిమి' పాత్ర ఎలా వచ్చిందంటే! - పూరీ జగన్నాథ్​ నచ్చిమి

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ హీరోగా అరంగేట్రం చేసిన 'చిరుత' సినిమాలో హాస్యనటుడు అలీ పోషించిన 'నచ్చిమి' పాత్ర అందర్ని ఆకట్టుకుంది. అయితే ఆ కథ అనుకున్నప్పుడు అలీకి దర్శకుడు పూరీ జగన్నాథ్​ ఎలాంటి పాత్ర రాయలేదట. కానీ, అభిమానుల ఒత్తిడితోనే రాయాల్సివచ్చిందని డైరెక్టర్​ ఓ సందర్భంలో తెలిపారు.

Director Puri Jagannath about ali character in Chirutha movie
'చిరుత'లో 'నచ్చిమి' పాత్ర ఎలా వచ్చిందంటే!

By

Published : Feb 26, 2021, 10:12 AM IST

మెగా కుటుంబం నుంచి 'చిరుత'తో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చారు రామ్‌చరణ్‌. మాస్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. అయితే, దర్శకుడు పూరీ చేసే ప్రతి చిత్రంలోనూ అలీకి ఓ పాత్ర తప్పకుండా ఉంటుంది. 'చిరుత' కథ అనుకున్నప్పుడు అసలు ఇందులో అలీకి ఎలాంటి పాత్రా రాసుకోలేదట పూరీ. కానీ, స్క్రిప్ట్‌ పనులపై బ్యాంకాక్‌ వెళ్తున్న సమయంలో ఎదురైన అనుభవాల కారణంగా అలీ కోసం పాత్రను సిద్ధం చేసినట్లు తెలిపారు.

"చిరుత' కథ ఓకే అయిన తర్వాత స్క్రిప్ట్‌ రాసుకోవడానికి బ్యాంకాక్‌ బయలుదేరాను. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లగానే సెక్యురిటీ చెక్‌ వద్ద 'సర్‌ కొత్త సినిమా కోసం వెళ్తున్నారా.. అలీ ఏ పాత్రలో నటిస్తున్నారు?' అని భద్రతా సిబ్బందిలో ఒకతను అడిగాడు. ఆ తర్వాత బోర్డింగ్‌ పాస్‌ తీసుకుంటున్న సమయంలోనూ మరో వ్యక్తి 'సర్‌.. అలీ క్యారెక్టర్‌ ఏంటి' అని అడిగాడు. దీంతో ఆలోచనలో పడ్డా. వెంటనే నిర్మాత అశ్వనీదత్‌గారికి ఫోన్‌ చేసి 'సర్‌.. వెంటనే అలీ డేట్స్‌ తీసుకోండి. ఈ సినిమాలో ఆయనకు క్యారెక్టర్‌ ఇవ్వకపోతే జనాలు ఊరుకునేలా లేరు' అని చెప్పడం వల్ల అలీ డేట్స్‌ బుక్‌ చేశారు. బ్యాంకాక్‌ వెళ్లిన తర్వాత అక్కడి వాళ్లను చూసి 'నచ్చిమి' పాత్ర రాసుకున్నా. అది ఎంత సూపర్‌హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే" అని పూరీ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

'చిరుత'లో నచ్చిమిగా అలీ పాత్ర, వేషధారణ, అన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఆయన చేసిన క్యారెక్టర్‌లలో భిన్నమైన పాత్రగా నచ్చిమి గుర్తింపు తెచ్చింది. ఇప్పటికీ బుల్లితెరపై 'నచ్చిమి'గా అలీ కనపడితే నవ్వులే నవ్వులు.

ABOUT THE AUTHOR

...view details