పూరీ జగన్నాథ్.. మాటలు తూటాల్లా పేల్చడం గన్‌లా మారిన అతని పెన్‌కు బాగా తెలుసు. ప్రస్తుతం పోడ్‌కాస్ట్ ద్వారా తన మాటలతో ఎందరినో ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ కూడా ఈ విషయమై అతడిని ప్రశంసించారు. ఈ క్రమంలోనే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత సైన్యం గురించి పూరీ మాట్లాడిన మాటలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యువత 'జనగణమన' అంటూ మద్దతు పలుకుతున్నారు. అసలు ఈ సంచలన దర్శకుడు ఏం చెప్పాడో ఆతని మాటల్లోనే.
"1895లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియన్ ఆర్మీని ప్రారంభించింది. సిపాయి అనే పేరు పెట్టింది వాళ్లే. 1914లో మొదటి ప్రపంచం యుద్ధంలో భారతసైన్యం బ్రిటీష్‌వారి తరఫున పోరాడింది. ఇందులో 60 వేల మంది సైనికులు ప్రాణాలు విడిచారు. సేవలందిస్తున్నప్పుడు బుల్లెట్లు తగిలి 100 మంది వరకూ నర్సులు చనిపోయారు. భారతసైన్యంలో ప్రస్తుతం 10వేల మంది వరకూ మహిళలు వివిధ విభాగాల్లో ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్, చైనాతో నాలుగు సార్లు యుద్ధాలు చేశాం. సియాచిన్‌లో మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ చలిలో విధులు నిర్వహిస్తున్నారు మన సైనికులు. అక్కడ చలి తీవ్రతకు చేతివేళ్లు, చెవుల భాగాలు రాలిపోతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో డ్యూటీ చేయాలంటే దమ్ముండాలి. దేశమంటే ప్రేముండాలి."