తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అనుష్క కౌగిలించుకోగానే కన్నీళ్లాగలేదు' - దర్శకుడు ప్రశాంత్​ వర్మ

'అ!' వంటి వైవిధ్యభరిత చిత్రంతో ప్రేక్షకుల మది దోచుకున్నారు యువ దర్శకుడు ప్రశాంత్​ వర్మ(Director Prasanth Varma). ఈ చిత్రం చూసి హీరోయిన్​ అనుష్క ప్రశంసించిందని గుర్తుచేసుకున్నారు. ఈ మూవీ సహా కెరీర్​ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. అవేంటో చూద్దాం..

anushka
అనుష్క

By

Published : Jul 19, 2021, 3:04 PM IST

ఏ డైరెక్టర్‌ అయినా హీరోనో ప్రొడ్యూసర్‌నో వెతుక్కుంటారు. కానీ.. ఈ డైరెక్టర్‌ మాత్రం హీరోలోనే ప్రొడ్యూసర్‌ను వెతుక్కుంటారు. మనం మాట్లాడుకుంటున్నది 'అ!' అనే అద్భుతమైన సినిమా తీసిన ప్రశాంత్‌వర్మ(Director Prasanth Varma) గురించి. 'ఈటీవీ'లో తరుణ్‌భాస్కర్‌ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే 'మీకు మాత్రమే చెప్తా' కార్యక్రమంలో ప్రశాంత్‌వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా తరుణ్‌భాస్కర్‌ అడిగిన పలు ప్రశ్నలకు ప్రశాంత్‌ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

తరుణ్‌ భాస్కర్: చదువులో రాష్ట్రస్థాయి, క్రీడల్లో జిల్లా స్థాయి.. ఇక దర్శకత్వంలో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూడింటినీ ఎలా మేనేజ్‌ చేయగలుగుతున్నారు..?

ప్రశాంత్‌వర్మ: మా అమ్మ మ్యాథ్స్‌ టీచర్‌. చిన్నప్పటి నుంచి నేను టాపర్‌గా ఉండాలనే అమ్మ కోరుకునేది. క్లాస్‌లో ఎవరైనా టీచర్‌ రాకపోతే క్లాస్‌లో తర్వాతి పాఠం నేనే చెప్పేవాడిని. ఎందుకంటే వేసవి సెలవుల్లో రాబోయే తరగతి పాఠాలు మొత్తం మా అమ్మ మాకు చెప్పేవారు. ఇక మా నాన్న గురించి చెప్పాలంటే.. చిన్నప్పుడు ఒక కండిషన్‌ పెట్టేవారు. కంటికి బాల్‌ కనిపించకుండా చీకటి పడేవరకూ క్రికెట్‌ ఆడాలనేవారు. ఆయనకు క్రీడలు అంటే చాలా ఇష్టం. 11మందిలో ఎవరో ఒకరు తప్పు చేసినా ఓడిపోవడం నాకు నచ్చేది కాదు. అందుకే 'ఇలా అయితే కుదరదు సింగిల్‌గా ఆడాల్సిందే' అని చెప్పి బ్యాడ్మింటన్‌కు మారాను.

ప్రశాంత్​ వర్మ

తరుణ్‌ భాస్కర్: సడెన్‌గా సినిమాల్లోకి ఎలా వచ్చారు..?

ప్రశాంత్‌వర్మ: చిన్నప్పటి నుంచే సినిమా అంటే పిచ్చి. అయితే.. ఇండస్ట్రీలోకి వస్తానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు సరదాగా ఫిల్మ్‌ మేకింగ్‌ నేర్చుకున్నా. సెకండ్‌ ఇయర్‌లోనే ఇంజినీరింగ్‌ పుస్తకాలు మొత్తం చదివేశా. ఆ తర్వాత స్క్రిప్టు రాయడం మొదలు పెట్టా.

తరుణ్‌ భాస్కర్: ఎవరైనా నానితో హీరోగా చేద్దామని అనుకుంటారు..? మీతో నిర్మాతగా చేయడం ఏంటి..?

ప్రశాంత్‌వర్మ: నేను తీసిన ఒక షార్ట్‌ఫిల్మ్‌ ఆయన చూశారు. బాగా నచ్చడం వల్ల నాకు ఫోన్‌ చేసి.. 'బాగా వచ్చింది.. ఇలాంటి క్రేజీ కథలు ఉంటే చెప్పు' అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు 'అ!' సినిమాలో వాయిస్‌ ఓవర్‌ కోసం ఆయనకు మెసెజ్‌ పెట్టాను. 'కథ బాగుంది.. మరి నిర్మాత ఉన్నారా..?' అని నన్ను అడిగారు. 'ఎవరూ లేరు. నేనే చేద్దామనుకుంటున్నా' అని చెప్పాను. నిర్మాత కోసం ఆయన కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత తానే ప్రొడ్యూస్‌ చేస్తానని నాకు ఫోన్‌ చేశారు. అలా ఆయన నిర్మాతగా మారారు.

ప్రశాంత్​ వర్మ

తరుణ్‌ భాస్కర్: కథ రాసుకున్నప్పటి నుంచి సినిమా విడుదలయ్యే వరకూ జర్నీ ఎలా సాగింది?

ప్రశాంత్‌వర్మ: నాకోసం కాకుండా వేరేవాళ్ల కోసం రాసిన కథలన్నీ కొంచెం క్లిష్టంగా ఉండేవి. ఎప్పుడైతే నాకోసం రాసుకోవడం మొదలుపెట్టానో అప్పుడు అన్ని సులభంగా మారాయి. చాలామందికి నేను చెప్పే కథ అర్థం కాకపోయినా.. వాళ్లు ఒప్పుకునేవారు. అలాగే నానిగారు కూడా నాతో సినిమా చేశారు. ఆ సినిమాకు టీజర్‌, ట్రైలర్‌ కూడా నేనే కట్‌ చేశాను. నానిగారు ఆశ్చర్యపోయి.. 'ఏంటీ.. ఇవన్నీ నువ్వే చేశావా..?' అన్నారు. కథ బయటికి వెళ్లకూడదన్న ఉద్దేశంతో సెట్‌లో ఉన్నవాళ్లకు కూడా ఫేక్‌ స్టోరీలు చెప్పేవాళ్లం. నాతో పాటు హీరో, హీరోయిన్‌కు మాత్రమే కథ తెలిసేది. క్లైమాక్స్‌ షూట్‌ చేసే సమయంలో కథ తెలియడం వల్ల సెట్లో అందరూ 'మాకు వేరే కథ చెప్పారు' అని కోపంగా చూసేవారు(నవ్వుతూ)..

తరుణ్‌ భాస్కర్: కొత్త డైరెక్టర్‌ అయ్యుండి.. 22 టేక్‌లు ఎందుకు చేశారు..?

ప్రశాంత్‌వర్మ: ఆ సినిమాలో రెజీనా డ్రగ్‌ అడిక్ట్‌. ఆ పాత్రలో లీనమవ్వాలంటే సమయం పడుతుంది. ఆమె కూడా బాగా కష్టపడింది. అయితే.. ఆమె అలాంటి పాత్రలు చేయకపోవడం వల్ల మరింత శ్రమించాల్సి వచ్చింది.

ప్రశాంత్​ వర్మ

తరుణ్‌ భాస్కర్: మొత్తానికి 22 టేక్‌ల తర్వాత మళ్లీ మొదటి టేక్‌ ఫైనల్‌ చేశారట..?

ప్రశాంత్‌వర్మ: కావచ్చు.. (నవ్వుతూ). టేక్‌లు ఎక్కువగా తీయడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. తర్వాతి ఆర్టిస్టులు రెడీగా ఉండకపోవడడమో.. లేకపోతే ఇంకా ఒక టేక్‌ చేస్తే సీన్‌ ఇంకా బాగా వస్తుందని డైరెక్టర్‌ అనుకోవడమో ఇలా ఎన్నో కారణాలుంటాయి.

తరుణ్‌ భాస్కర్: 'అ!' సినిమాకు ఎవరో పెద్ద హీరోయిన్‌ నుంచి ప్రశంసలు వచ్చాయంట..?

ప్రశాంత్‌వర్మ: అవును.. ప్రివ్యూ చూస్తున్నప్పుడు టైటిల్స్‌ పడటానికి ముందే సినిమా కొంచెం మొదలవుతుంది. ఆ సన్నివేశాలు చూడగానే అనుష్క నా దగ్గరికి వచ్చిన షేక్‌హ్యాండ్‌ ఇచ్చి 'సినిమా సూపర్‌ హిట్‌' అని చెప్పారు. ఆ తర్వాత సినిమా పూర్తయ్యాక మళ్లీ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నారు. నాకు తెలిసి నన్ను హగ్‌ చేసుకున్న మొదటి అమ్మాయి ఆమే. వెంటనే నా కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. సినిమా హిట్‌ అని నమ్మకం వచ్చింది.

తరుణ్‌ భాస్కర్: పాలకొల్లులో ఉన్న మీకు.. ఎక్కడో వెస్టిండీస్‌లో ఉన్న క్రికెటర్‌ బ్రియన్‌ లారాతో పరిచయం ఎలా ఏర్పడింది..?

ప్రశాంత్‌వర్మ: 'ఏ సైలెంట్‌ మెలొడీ' చేసిన తర్వాత కొన్ని యాడ్‌ఫిల్మ్స్‌ చేశాను. అప్పుడు ఒక ప్రాజెక్టులో నాకు అవకాశం వచ్చింది. నాతో ఆయన ఫోన్‌లో కూడా మాట్లాడారు. అప్పుడు ఆయన ఏం మాట్లాడారో అర్థం కాకున్నా 'ఓకే' అని చెప్పాను(నవ్వుతూ).

తరుణ్‌ భాస్కర్: ప్రశాంత్‌వర్మ తన అసిస్టెంట్‌ డైరెక్టర్లను చాలా బాగా చూసుకుంటారని నాక్కూడా తెలుసు. దాని గురించి..?

ప్రశాంత్‌వర్మ: నేను సినిమాల్లో ప్రయత్నిస్తున్నప్పుడు గూగుల్‌లాంటి కంపెనీలను కాదని అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా జాయిన్‌ అయ్యేందుకు సర్టిఫికెట్లు పట్టుకొని ఆఫీస్‌ల చుట్టూ తిరిగాను. అయితే.. 'నువ్వు ఓవర్‌ క్వాలిఫైడ్‌.. మా దగ్గర పనిచేయలేవు' అని బయటికి పంపించేశారు. అప్పటి నుంచి సర్టిఫికెట్లు ఇంట్లో పెట్టి వెళ్లడం ప్రారంభించాను. రికమండేషన్‌ మీద ఒక డైరెక్టర్‌ దగ్గరికి వెళితే కొన్ని గంటలు నన్ను కూర్చోబెట్టి.. ఆ తర్వాత బాబు మంచి నీళ్లు తీసుకురా అన్నారు. నేను షాక్‌ అయ్యాను. ఇంత చదివి.. ఇంత బతుకు బతికి మంచినీళ్లు తెచ్చివ్వడం ఏంటీ? అనుకున్నాను. అసిస్టెంట్‌ డైరెక్టర్‌లను చాలామంది అలాగే చూస్తుంటారు. జీతాల విషయంలోనూ మిగతా డిపార్ట్‌మెంట్లకు సమయానికి జీతం ఇస్తారు. డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవాళ్లకు మాత్రం రెండు, మూడు నెలల జీతం ఇవ్వరు.

తరుణ్‌ భాస్కర్: ఎక్కువ ఫ్రస్ట్రేషన్‌కు గురైన సందర్భం..?

ప్రశాంత్‌వర్మ: ఒకసారి ఒక హీరోకు కథ చెబుదామని వెళ్లాను. 'బయట వెయిట్‌ చేయండి' అని చెప్పారు. నేను గేటు ముందు ఎదురుచూస్తూ ఉన్నా. వర్షం మొదలైంది. ఫోన్‌ చేస్తే 'వస్తున్నా' అన్నాడు. పైకి చూస్తే కిటికీలోంచి నన్ను చూస్తూ ఉన్నాడాయన. అప్పుడు నాకు బాగా కోపం వచ్చింది. కానీ.. నన్ను నేను నియంత్రించుకొని వెళ్లి కథ చెప్పి వచ్చాను. ఆ తర్వాత కలిసి సినిమాకు కూడా పనిచేశాం.

ఇదీ చూడండి:'నా దగ్గరే ఇప్పటికే 32 కథలున్నాయి'

ABOUT THE AUTHOR

...view details