"విభిన్నమైన చిత్రాలు చేయడంలో నాకొక సంతృప్తి దొరుకుతుంది. అందుకే ఎక్కువగా ఆ తరహా చిత్రాలే ప్రయాణం చేస్తున్నా. ఆసక్తిరేకెత్తించే కథలు కుదిరితే పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తాన"న్నారు ప్రభు సాల్మన్. 'మైనా', 'గజరాజు' లాంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన తమిళ దర్శకుడాయన. ఇప్పుడు రానా కథానాయకుడిగా 'అరణ్య' అనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 26న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు ప్రభు సాల్మన్.
- "ఈ చిత్రంలో మనుషులు, ఏనుగుల మధ్య ఉండే అందమైన అనుబంధాన్ని.. దానితో పాటు పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్రను అందరికీ చూపించబోతున్నాం. అందరూ అనుకుంటున్నట్లు ఇది ఫారెస్ట్‌మెన్ జాదేవ్ జీవితకథ కాదు. కాకపోతే ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోని కథానాయకుడి పాత్ర డిజైన్ చేసుకున్నా. ఈ సినిమా కోసం మేం మూడున్నరేళ్లు కష్టపడ్డాం. ఈ చిత్రంలో ప్రతి పాత్ర కథను నడిపిస్తుంది. దీంట్లో రానా ఏనుగుల గొంతుకగా కనిపిస్తారు".
- "థాయ్‌లాండ్‌లో చిత్రీకరణ ప్రారంభించినప్పుడు ఓ వింత అనుభవం ఎదురైంది. కెమెరా కోసం కొన్ని కొమ్మల్ని నరికేశాం. వెంటనే అటవీ అధికారులు వచ్చి మా టీంలోని కొందరి పాస్‌పోర్టులు తీసుకున్నారు. అడవుల్లోని సీసీ టీవీ పుటేజీ చూసి వాళ్లు వచ్చారని తెలిసి ఆశ్చర్యమేసింది. అక్కడ మొక్కల్ని అంత ప్రేమిస్తారు. మన దగ్గర అసలు మనుషులకే ప్రాధాన్యం ఇవ్వరు. రోడ్డుపై మనుషుల్ని నరికితేనే పట్టించుకోవట్లేదు.. మొక్కల్ని నరికితే పట్టించుకుంటారా?".