తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాన్న నవల సినిమాగా తీస్తా: మేర్లపాక గాంధీ - movie news

సినిమా తీసే క్రమంలో సవాళ్లు ఉన్నప్పుడే అసలైన మజా వస్తుందని దర్శకుడు మేర్లపాక్ గాంధీ అన్నారు. 'మాస్ట్రో' షూటింగ్ మరో వారం రోజులు మాత్రమే ఉందని ఆయన చెప్పారు. ఈయన కథ రాసిన 'ఏక్ మినీ కథ' ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తోంది.

director Merlapaka gandhi
నితిన్ మేర్లపాక్ గాంధీ

By

Published : May 30, 2021, 7:13 AM IST

తొలి అడుగుల్లోనే విజయాలు అందుకున్న దర్శకుడు...మేర్లపాక గాంధీ. వినూత్నమైన కథలకు, తనదైన మార్క్‌ హాస్యాన్ని జోడిస్తూ ప్రేక్షకుల్నిమెప్పిస్తుంటారు. ప్రస్తుతం నితిన్‌ కథానాయకుడిగా 'మాస్ట్రో' తెరకెక్కిస్తున్నారు. ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన 'ఏక్‌ మినీ కథ'కు ఆయనే స్క్రిప్ట్‌ అందించారు. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీతో ‘ఈనాడు సినిమా’ ముచ్చటించింది. ‘ఏక్‌ మినీ కథ’ చిత్రానికి వస్తున్న స్పందన సంతృప్తినిచ్చిందా?

మహిళలు, కుటుంబ ప్రేక్షకులకూ సినిమా బాగా నచ్చింది. నాతో చాలా మంది మాట్లాడారు. ‘ఇదేదో పెద్దవాళ్లే చూడాల్సినదేమో అనుకున్నాం కానీ, అందరికీ వినోదం పంచే సినిమా’ అని చెబుతున్నారు. అసభ్యతకు చోటు లేకుండా తీశాం. లాక్‌డౌన్‌లో తెలుగు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతోంది.

మేర్లపాక గాంధీ

‘కృష్ణార్జున యుద్ధం’ తర్వాత చాలా సమయం తీసుకున్నారు. ఈ మధ్యలో ‘ఏక్‌ మినీ కథ’ తరహా స్క్రిప్టులపైనే దృష్టిపెట్టారా?

అలాంటిదేమీ లేదు. ‘మాస్ట్రో’ మొదలయ్యాక రాసిన స్క్రిప్టే... ‘ఏక్‌ మినీ కథ’. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో ఈ కథ రాశా. అప్పటికి ‘మాస్ట్రో’ చిత్రీకరణ మొదలైంది. నాతో కలిసి ప్రయాణం చేస్తున్న కార్తీక్‌ తీస్తే బాగుంటుందనే దీన్ని రాశా. ఇక ‘కృష్ణార్జున యుద్ధం’ తర్వాత విరామం అంటారా? నా ప్రతి సినిమాకీ మధ్యలో విరామం వస్తుంటుంది. అదీ అనుకోని విరామమే. ఒక కథ రాస్తూ ఉంటాను. అనుకోకుండా మధ్యలో మరో మంచి ఆలోచన వస్తుంది. దాంతో ముందు అనుకున్న కథని పక్కనపెట్టి కొత్త స్క్రిప్టు రాయడంపై దృష్టి పెడుతుంటా. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో రాసుకుంటూ వెళ్లిపోవడమే ఇష్టం. సున్నితమైన అంశంతో కూడిన కథ ఇది.

రాసేటప్పుడు మీకెలాంటి ఆలోచనలు వచ్చాయి?

ప్రపంచంలో స్మాల్‌ పీనస్‌ సిండ్రోమ్‌పైన ఎవ్వరూ సినిమా చేయలేదు. అంగస్తంభన అంశంపైన ‘శుభ్‌ మంగళ్‌ సావధాన్‌’, వీర్య దానంపైన ‘విక్కీ డోనర్‌’ తరహా సినిమాలొచ్చాయి కానీ... మా సినిమాలో స్పృశించిన అంశంతో ఎవ్వరూ చిత్రం చేయలేదు. కథలు రాసుకునేటప్పుడు ఇలాంటి సవాళ్లు ఎదురైతేనే మజా ఉంటుంది. నన్ను మొదట్లో చాలా మంది భయపెట్టారు. కానీ చూద్దాం అనే ధైర్యంతో మొదలుపెట్టా. ఈ కథ చెప్పగానే హీరోహీరోయిన్‌, యు.వి.క్రియేషన్స్‌... ధైర్యంగా ముందుకొచ్చారు. మా అందరినీ నమ్మి యు.వి.సంస్థ ఈ సినిమాని నిర్మించింది. దర్శకుడు కార్తీక్‌ చాలా బాగా తీశాడు. మా ప్రయత్నానికి తగ్గ స్పందన రావడం మరింత ప్రోత్సాహాన్నిచ్చింది.

‘అంధాదున్‌’ రీమేక్‌గా ‘మాస్ట్రో’ చేస్తున్నారు. రీమేక్‌పై దృష్టి మళ్లడానికి కారణమేమిటి?

అరకు దగ్గర టైడా అనే ఓ ఊరు ఉంటుంది. స్క్రిప్ట్‌ రాసుకోవడానికని అక్కడికి వెళ్లా. ఆ సమయంలోనే ‘అంధాదున్‌’ సినిమాని తెప్పించుకుని చూశా. భలే అనిపించింది. ఒకవేళ రీమేక్‌ అంటూ చేస్తే ఇలాంటి సినిమా చేయాలని ‘ఏక్‌ మినీ కథ’ దర్శకుడు కార్తీక్‌తో చెప్పా. ఆ తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయా. ఆర్నెళ్ల తర్వాత మళ్లీ అదే సినిమా గురించి ఫోన్‌ చేశారు నితిన్‌, వాళ్ల నాన్న సుధాకర్‌రెడ్డి సర్‌. మంచి థ్రిల్‌ ఉన్న కథ అది, డార్క్‌ కామెడీ సినిమాని ప్రయత్నించినట్టు అవుతుందని రంగంలోకి దిగా. ద్వితీయార్ధంలో భావోద్వేగాలతోపాటు మరింత ఫన్‌నీ జోడించాం. సంభాషణలు బాగుంటాయి. ఒక వారం చిత్రీకరణ చేస్తే సినిమా పూర్తవుతుంది.

ఆయన నవలను సినిమాగా తీస్తా

‘‘మా నాన్న మేర్లపాక మురళి పుస్తకాలు చదవడం బాగా అలవాటు చేశారు. నేను బాగా రాయడానికి అవి ఎంతో సాయపడుతున్నాయి. ఈమధ్య కాలంలో వీరయ్య అనే నవల, నీషే పుస్తకాలు చదివా. ఆసక్తికరంగా అనిపించాయి. హాలీవుడ్‌లో పుస్తకాల ఆధారంగా ఎక్కువగా సినిమాలు తీస్తుంటారు. మా నాన్న ‘నా నవల ఒకటి చేయరా’ అని చెబుతుంటారు. ఆయనతో చర్చించి ఏదో ఒక నవలని సినిమాగా తీస్తా’’.

ABOUT THE AUTHOR

...view details