తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మణిరత్నం మ్యాజిక్​: 25 వసంతాల బొంబాయి లవ్​స్టోరీ - మణిరత్నం న్యూస్​

మణిరత్నం అంటే క్లాసికల్​ చిత్రాలకు పెట్టింది పేరు. 1995 సంవత్సరంలో విడుదలైన 'బొంబాయి' సినిమా అతడి ప్రతిభను దేశమంతా చాటి చెప్పింది. సామాజిక నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథ ఎంతో మందిని ఆకట్టుకుంది. ఎన్నో వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద ఘనవిజయం సాధించింది. ఈ సినిమా విడుదలై సరిగ్గా నేటికి 25 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Director Manirathnam Movie Update: Tewnty five Years Completed for Bombay Movie
బొంబాయి సినిమా ఆఫర్​ను కాదన్న విక్రమ్​

By

Published : Mar 10, 2020, 5:47 PM IST

Updated : Mar 10, 2020, 7:39 PM IST

అద్భుత దృశ్య కావ్యాలకు కేరాఫ్ అడ్రస్‌ మణిరత్నం. అతడి సినిమా ఓ మ్యాజిక్‌. ప్రేక్షకులను కళ్లార్పకుండా చూసేలా చేయగలిగే మంత్ర దండమేదో అతని చేతిలో ఉంది కావచ్చు. అందుకే మణిరత్నం తీసిన సినిమాలు తక్కువే అయినా, దాదాపు అన్నీ బాక్సాఫీస్‌ వద్ద క్లాసిక్‌ చిత్రాలుగా నిలిచాయి. అరవిందస్వామి కథానాయకుడిగా 'రోజా' సినిమాతో జాతీయ స్థాయిలోనూ పేరు తెచ్చుకున్నాడీ స్టార్​ దర్శకుడు.

ఆ మరుసటి ఏడాది 'దొంగా దొంగా'తో కమర్షియల్‌గా ఘన విజయాన్ని అందుకున్నాడు. కానీ, మణిరత్నం ఈసారి పెద్ద ప్రాజెక్ట్​నే చేపట్టాడు. అది అలాంటి ఇలాంటి సబ్జెక్ట్‌ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా, దేశం అల్ల కల్లోమైపోతుంది. అలాంటి సబ్జెక్ట్‌ను తీసుకున్నాడు. అదే 'బొంబాయి' సినిమా. 1995 మార్చి 10న విడుదలైన ఈ చిత్రం నేటితో 25ఏళ్లు పూర్తి చేసుకుంది.

బొంబాయి సినిమా పోస్టర్​

ఏంటీ బొంబాయి కథ!

శేఖర్‌(అరవింద స్వామి)ది ఆచారాలు, సంప్రదాయాలు పాటించే కుటుంబం. ముంబయిలో జర్నలిస్ట్‌గా పనిచేస్తుంటాడు. ఒకసారి ఊరు వచ్చిన అతడు అనుకోకుండా ముస్లిం యువతి షైలా భాను(మనీషా కొయిరాలా)ను చూసి ఇష్టపడతాడు. తన ప్రేమను ఆమెకు వ్యక్తపరుస్తాడు. అయితే, మొదట ఆమె శేఖర్‌ను దూరంగా పెడుతుంది. అతని ప్రేమలో నిజాయతీని అర్థం చేసుకుని తనూ ప్రేమించటం మొదలు పెడుతుంది. ఈ విషయంలో ఇద్దరి ఇళ్లలో తెలిసి గొడవ జరుగుతుంది.

'బొంబాయి' సినిమా చిత్రీకరణలో దృశ్యం

చివరకు షైలా భాను తను ప్రేమించిన శేఖర్‌ కోసం ఇల్లు విడిచి ముంబయి వెళ్లిపోతుంది. అక్కడ వారిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వారికి ఇద్దరు పిల్లలు పుడతారు. ఈ నేపథ్యంలో ఇరువురి తల్లిదండ్రులకు కోపాలు తగ్గి శేఖర్‌, షైలా భానులను చూడటానికి ముంబయి వస్తారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ మత కల్లోలు చెలరేగుతాయి. వాటి వల్ల ఎంతమంది నష్టపోయారు. శేఖర్‌ కుటుంబానికి జరిగిన నష్టం ఏంటి? చివరకు ఆ గొడవలు ఎలా సద్దుమణిగాయన్నది 'బొంబాయి కథ'.

'బొంబాయి' సినిమాలో ఓ సన్నివేశం

విక్రమ్‌ చేయాల్సింది కానీ..

మణిరత్నం 'దొంగా దొంగా' సినిమా నేపథ్య సంగీత పనుల్లో బిజీగా ఉన్న సమయంలో.. ముంబయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ అంశాన్ని తీసుకుని సినిమా తీయాలన్న ఆలోచన అతడికి వచ్చింది. ప్రముఖ మళయాళ రచయిత ఎం.టి వాసుదేవన్‌ నాయర్‌ను కథ, కథనాలను సిద్ధం చేయమని కోరాడు. కానీ, అది ఆలస్యమవుతూ వచ్చింది. చివరకు తానే కూర్చొని కథను సిద్ధం చేసుకుని ఓ తమిళ సినిమాగా చేయాలని అనుకున్నాడు. తొలుత ఈ సినిమా కోసం విక్రమ్‌, మనీషా కొయిరాలాలకు ఫొటో షూట్‌ చేశారు.

అరవింద్​ స్వామి

అయితే, అప్పటికే మరో చిత్రం కోసం గడ్డం, మీసం పెంచిన విక్రమ్‌ దాన్ని తొలగించేందుకు ఒప్పుకోలేదు. ఫలితంగా 'రోజా'లో చేసిన అరవిందస్వామినే హీరోగా తీసుకున్నాడు. నాజర్‌ను నారాయణమూర్తి పాత్రకు, రాజా కృష్ణమూర్తి(కిట్టు)ను బషీర్‌ పాత్రకు ఎంపిక చేశాడు. సినిమాటోగ్రాఫర్‌గా రాజీవ్‌ మేనన్‌ను ఎంపిక చేశారు. అరవిందస్వామి, మనీషా కొయిరాలాల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాల వర్షంలో తీయాలన్న ఆలోచన అతడిదే కావటం విశేషం. పొల్లాచి, కాసర్‌గోడ్‌, కన్నూర్‌ తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశారు.

'కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే' పాటను 'తిరుమల నాయక్కర్‌ మహల్‌'లో తీశారు. ఇక బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన వీడియోను ప్రసారం చేసేందుకు సెన్సార్‌బోర్డు ఒప్పుకోలేదు. ఫలితంగా పత్రికలు, ఫొటోలను మాత్రమే చిత్రంలో చూపించారు.

విడుదల.. వివాదాలు.. విజయం..

సెన్సార్‌ బోర్డు సభ్యులకు, మహారాష్ట్రలోని పలువురు కీలక రాజకీయనేతలకు సినిమా ప్రివ్యూ వేసి చూపించారు. అందరికీ సినిమా నచ్చింది. టినూ ఆనంద్‌ పాత్ర.. బాల్‌ ఠాక్రేలా పోలి ఉండటం వల్ల కొన్ని సన్నివేశాలకు కత్తెరపడింది. అందుకే ఆ పాత్ర చాలా తక్కువ ఫ్రేమ్‌లో మాత్రమే కనిపిస్తుంది. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ కంపెనీ ఏబీసీఎల్‌ రూ.2.5కోట్లు చెల్లించి విడుదల హక్కులను సొంతం చేసుకుంది. 'బొంబాయి' చిత్రాన్ని 1995 మార్చి 10న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు.

బొంబాయి సినిమా విడుదల అయినప్పటి చిత్రం

తొలినాళ్లలో హైదరాబాద్‌, హుబ్లీ, ధార్వాడ్‌, ఉత్తర కర్ణాటక సహా పలుచోట్ల నిరసనలు వ్యక్తం అయ్యాయి. హైదరాబాద్‌లో థియేటర్లపై దాడి జరిగింది. తమ మనోభావాలను కించ పరిచేలా చిత్రం ఉందని ఓ వర్గం ఆరోపించింది. కానీ, అవేవీ మణిరత్నం మ్యాజిక్‌ ముందు పనిచేయలేదు. వరుసగా అందరూ సినిమా చూడటం మొదలు పెట్టారు. అన్ని భాషల్లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

అందరూ అదరగొట్టేశారు!

శేఖర్‌గా అరవిందస్వామి, షైలా భానుగా మనీషా కొయిరాలా చక్కగా నటించారు. వెండితెరపై వారి కెమిస్ట్రీ బాగా కుదిరించింది. ప్రేమికులుగా, భార్యాభర్తలుగా వారి జోడి మెప్పించింది. నారాయణమూర్తిగా నాజర్‌.. బషీర్‌గా కిట్టులూ అలరించారు. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది తెలుగు నటుడు రాళ్లపల్లి గురించి. ట్రాన్స్‌జెండర్‌గా అతడి నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా శేఖర్‌-షైలా భానుల కొడుకును కాపాడేందుకు ఆందోళనకారులపై అతను చేసే పోరాటం ఆకట్టుకుంటుంది.

చిన్నారుల నటన కొన్ని చోట్ల కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం. 'ఉరికే చిలకా..', 'కన్నానులే కలయికలు..', 'హమ్మా.. హమ్మా' సాంగ్‌లు శ్రోతలను విశేషంగా అలరించాయి. వెండితెరపైనా వాటి చిత్రీకరణ ఆకట్టుకుంది. దర్శకుడిగా మణిరత్నం పేరు మార్మోగిపోయింది.

అవార్డులు

'బొంబాయి' సినిమాను జాతీయ అవార్డు సహా అనేక అవార్డులు వరించాయి. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా నర్గీస్‌దత్‌ అవార్డును మణిరత్నం అందుకున్నాడు. ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో సురేశ్‌కు జాతీయ అవార్డు వచ్చింది. రెండు ఫిల్మ్‌ ఫేర్‌లు, నాలుగు ఫిల్మ్‌ ఫేర్‌ సౌత్‌ అవార్డులు, మరాఠీ శ్రీ, రెండు తమిళనాడు స్టేట్‌ అవార్డులు సహా పలు పురస్కారాలు ఈ సినిమాను వరించాయి.

ఎడిన్‌బర్గ్‌ ఇంటర్నేషల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో 'గాలా' అవార్డు వరించింది. అమెరికాలో నిర్వహించిన పొలిటికల్‌ ఫిల్మ్‌ సొసైటీ అవార్డ్స్‌లో స్పెషల్‌ అవార్డు లభించింది.

జెరూసలేం ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో 'విమ్‌ వాన్‌ లీర్‌ ఇన్‌ స్పిరిట్‌ ఫర్‌ ఫ్రీడమ్‌ అవార్డు'ను సైతం మణిరత్నం అందుకున్నాడు.

ఇదీ చూడండి.. హోలీ హోలీ.. రంగోలీ అంటున్న శ్రీముఖి

Last Updated : Mar 10, 2020, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details