మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన మల్టీస్టారర్ 'ఆచార్య'. కొరటాల శివ దర్శకుడు. చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్‌కు జోడీగా పూజాహెగ్డే కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఇటీవల 'సిద్ధ సాగా' పేరుతో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. అందులోని చివరి షాట్ (ఒక వైపు చిరుతలు.. మరోవైపు చిరంజీవి, రామ్ చరణ్ కనిపించిన సన్నివేశం) సినీ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ సీన్, సినిమా గురించి కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అ విషయాలు మీకోసం.
* టీజర్‌తోనే 'ఆచార్య' సినిమాపై అంచనాలు పెంచేశారు? ఆ ఆలోచన ఎలా వచ్చింది?
కొరటాల శివ: ఇది ధర్మం చుట్టూ తిరిగే కథ. ధర్మానికి ప్రతిరూపం సిద్ధ (రామ్ చరణ్ పాత్ర). కథను, పాత్రను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు శాంతి శ్లోకంతో టీజర్‌ను ప్రారంభించాలనుకున్నా. నా ఆలోచనను సంగీత దర్శకుడు మణిశర్మతో పంచుకోగానే ‘చాలా బాగుంటుంది. దానితోనే మొదలుపెట్టు’ అని అన్నారు. అలా ‘సహనాభవతు’ శ్లోకంతో సిద్ధ టీజర్‌ను తీర్చిదిద్దాం. సిద్ధ పాత్రను పరిచయం చేసి విజువల్ ట్రీట్ కోసం చివరి షాట్‌లో చిరంజీవి, రామ్ చరణ్‌ని ఓ వైపు, చిరుతల్ని మరోవైపు చూపించాం. సినిమాలో ఇదో అద్భుతమైన దృశ్యం. అది వాళ్లిద్దరికే సరిగ్గా సరిపోయింది. అదృష్టవశాత్తూ అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఉండటంతో ఆ షాట్‌ను అందించగలిగా. దాన్ని చిత్రీకరించేటప్పుడు దర్శకుడిగా కాకుండా ఓ అభిమానిగా ఎంతో ఆనందించా.
* సాధారణంగా ఆచ్యార దేవోభవ అని వింటుంటాం. ఆచార్య రక్షోభవ గురించి మీ మాటల్లో..
కొరటాల శివ: ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ ఆచార్య ఉంటాడు. తల్లి, తండ్రి, గురువు.. ఇలా ఎవరైనా కావొచ్చు. ఆచార్యను మనం దైవమని నమ్మితే వారే మనల్ని రక్షిస్తారు. ఆ ఆలోచనతోనే ఈ కథను రాసుకున్నా. అందుకే టీజర్‌లో ఆచార్య దేవోభవతోపాటు ఆచార్య రక్షోభవ అని వినిపిస్తుంది. ఓ అభిమానిగా చిరంజీవిగారిని తెరపై ఎలా చూడాలనుకున్నానో అలా చూపించే ప్రయత్నం చేశా. ఈ చిత్రం ఆయన అభిమానులే కాదు సినీ ప్రియులందరికీ నచ్చుతుందని భావిస్తున్నా.
* కథ పూర్తయ్యాక హీరోని ఎంపిక చేసుకుంటారా? హీరోని దృష్టిని పెట్టుకుని కథను రాస్తుంటారా?
కొరటాల శివ: ముందుగా కాన్సెప్ట్‌ని సిద్ధం చేసుకుని దానికి న్యాయం చేయగలిగే నటుడ్ని ఎంపిక చేసుకుంటా. తర్వాత వారి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కథను పూర్తి చేస్తా. అలా అని మరీ ఎక్కువగా కమర్షియల్ హంగులు జొప్పించను. కథకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తా. ‘ఆచార్య’ విషయంలోనూ అంతే. చిరంజీవిగారికి ఈ కథకు సంబంధించి ఓ లైన్ వినిపించా. విన్న వెంటనే ఓకే చెప్పారు. తన పాత్ర గురించి చెప్పగానే రామ్ చరణ్ కూడా వెంటనే నటిస్తా అన్నాడు. ఈ సినిమాకు రామ్ చరణ్ బోనస్.