సంక్రాంతి కానుకగా కింగ్ నాగార్జున 'బంగార్రాజు' సినిమా ఇటీవల థియేటర్లలోకి వచ్చింది. పూర్తి పల్లెటూరి నేపథ్యంగా సాగిన ఈ సినిమా.. పండగ పూట ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ సినిమాతో దర్శకుడు కల్యాణ్‌కృష్ణ.. మరో హిట్ అందుకున్నారు! ఈ క్రమంలోనే ఓ క్రేజీ ఆఫర్‌ను అందుకున్నారు.
తమిళంలో సూర్య, కార్తితో పాటు పలువురు హీరోలతో సినిమాలు తీసిన స్టూడియో గ్రీన్ సంస్థ.. కల్యాణ్‌కృష్ణతో ఓ సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఆదివారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా, డైరెక్టర్ కల్యాణ్‌కృష్ణను కూడా కలిశారు. అయితే ఈ సినిమా.. తెలుగు, తమిళంలో ఏకకాలంలో రూపొందే అవకాశముంది.