తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నాలోని అజ్ఞానమే ఈ కథకు స్ఫూర్తి'

'వెన్నెల', 'ప్రస్థానం' చిత్రాలతో ప్రతిభగల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు దేవ కట్టా. ఆయన దర్శకత్వం వహించిన 'రిపబ్లిక్'(Republic Film Release Date) అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రం విశేషాలు ఆయన మాటల్లోనే..

deva katta
దేవ కట్టా

By

Published : Sep 29, 2021, 6:39 AM IST

Updated : Sep 29, 2021, 7:28 AM IST

"నేను పరిశ్రమకి 'ప్రస్థానం'తో పరిచయమయ్యా. 'ఆటోనగర్‌ సూర్య'తో పరిశ్రమ అంటే ఏమిటో నాకు పరిచయమైంది. సంధి కుదిరింది కాబట్టి.. ఇక నుంచి విరామం లేకుండా సినిమాలు చేస్తా"అంటున్నారు దేవాకట్టా(Deva Katta Movies). 'వెన్నెల', 'ప్రస్థానం' చిత్రాలతో ప్రతిభగల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఇటీవల సాయి తేజ్‌ కథానాయకుడిగా 'రిపబ్లిక్‌'(Republic Film Release Date) తెరకెక్కించారు. ఆ చిత్రం అక్టోబర్‌ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దేవా కట్టా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

"అడవి గురించి తెలియకుండా మనం అడవిలో బతకలేం. సమాజమూ అంతే. మనం ఎలాంటి వ్యవస్థలో ఉన్నామో తెలుసుకోవాలి. ఒక రకంగా ఈ కథకి నాలోని అజ్ఞానమే స్ఫూర్తి అనుకోవచ్చు. మనం తరచూ 'ఈ వ్యవస్థ ఉంది చూడు, ఈ రాజకీయ నాయకులు ఉన్నారు చూడూ' అంటూ, ప్రజాస్వామ్యం, నియంతృత్వం అంటూ వాటి గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ వాటి గురించి మనకు ఎంత లోతుగా తెలుసు? ఒక విద్యావంతుడిగా నాకు కలిగిన సిగ్గుతో దాని గురించి చదువుకుని రాసుకున్న కథే.. 'రిపబ్లిక్‌'(Republic Film Release Date). 15 ఏళ్లు అమెరికాలో పెరగడం వల్ల అక్కడ ప్రజాస్వామ్యం ఎలా ఉంది? ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఎలా చూస్తున్నాం? అనే విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు మనసులో వచ్చిన కొన్ని ప్రశ్నలు ఈ కథకి స్ఫూర్తినిచ్చాయి'.

"రోడ్డు ప్రమాదం తర్వాత సాయి తేజ్‌ని కలిశా. తనతో మాట్లాడిన తర్వాతే అక్టోబర్‌ 1న సినిమాని విడుదల చేయాలని నిర్ణయించాం. తను 'రిపబ్లిక్‌' ముందస్తు విడుదల వేడుక చూశారు. వేగంగా కోలుకుంటున్నాడు. ముందస్తు విడుదల వేడుకలో పవన్‌ కల్యాణ్‌ ఆయనదైన గళం వినిపించారు. మా సినిమా మాత్రం రాజకీయ కోణాలకి సంబంధం లేని తటస్థ అభిప్రాయాలతో, అంశాలతో తెరకెక్కింది. నా విజన్‌లోనే నేను సినిమా తీసేలా సాయి తేజ్‌ నన్ను ప్రోత్సహించాడు. ఓ సైనికుడిలా నాకు అండగా నిలబడ్డాడు".

-- దేవా కట్టా, దర్శకుడు

వనరులు తక్కువ..

"వెన్నెల, ప్రస్థానం సినిమాలు(Deva Katta Movies) చేసినప్పుడు నాకున్న వనరులు చాలా తక్కువ. 'వెన్నెల' సినిమా చేస్తున్నప్పుడు వ్యానిటీ వ్యాన్‌ని నేను స్వయంగా నడుపుకుంటూ సెట్‌కి వెళ్లేవాణ్ని. అక్కడిదాకా డ్రైవర్‌ని, అక్కడికెళ్లాక దర్శకుడిని. అప్పట్లో స్వేచ్ఛ ఉండేది. 'ప్రస్థానం'తర్వాత చుట్టుపక్కలవాళ్ల లెక్కలు ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. 'ప్రస్థానం' ఘన విజయం సాధించకపోవడానికి కారణం అందులో కామెడీ లేకపోవడం, మరొక వాణిజ్యాంశం లేకపోవడం అంటూ నాపై వాళ్ల అభిప్రాయాల్ని రుద్దడం మొదలుపెట్టారు. తీరా వాళ్లు చెప్పినవన్నీ చేసి సినిమా తీస్తే, దాన్ని ప్రేక్షకులు తిప్పికొట్టారు. 'డైనమైట్‌'కు 9 రోజులే పనిచేశా. తర్వాత ఎవరికి కావల్సినట్టు వాళ్లు చిత్రీకరణ చేసుకున్నారు. 'రిపబ్లిక్‌' విషయంలో అలాంటి ప్రభావాలు ఏవీ లేకుండా నాదైన విజన్‌తోనే తీశా. చంద్రబాబు నాయుడు, వై.ఎస్‌.ఆర్‌ జీవితాల్ని ఆధారంగా చేసుకుని ఓ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశా. వాళ్ల కాలేజీ జీవితాలు మొదలుకొని, వై.ఎస్‌ మరణం వరకు సాగే కథ ఇది. ఆ సినిమాని 'గాడ్‌ఫాదర్‌'తరహాలో 'ఇంద్రప్రస్థం'పేరుతో మూడు భాగాలుగా తెరకెక్కించాలనుకుంటున్నా. వెన్నెల తరహా కథలూ సిద్ధంగా ఉన్నాయి." అని తెలిపారు.

"ప్రజలకీ.. రాజకీయ నాయకులకీ అనుసంధానంగా ఉండే ఓ అధికారి నిజాయతీగా ఉన్నప్పుడు తన వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? తను వ్యవస్థని చూసే విధానం ఎలా ఉంటుంది? తన ఆలోచనల వల్ల ప్రయాణం ఎలా సాగిందనే అంశాల ఆధారంగా 'రిపబ్లిక్‌'(Republic Film Release Date) కథని తయారు చేసుకున్నా. సాయితేజ్‌కు ఈ కథ గురించి ఒక రోజు జిమ్‌లో చెప్పా. సాధారణ పౌరుడిగా తను ఈ కథకి బాగా కనెక్ట్‌ అయ్యాడు. కథగా రాయకముందే తనతోనే సినిమా చేయాలని తేజ్‌ నాతో మాట తీసుకున్నాడు." అని దేవ కట్టా వివరించాడు.

ఐశ్వర్య రాజేశ్‌ ఇందులో ఎన్నారై యువతిగా కనిపిస్తుంది. రమ్యకృష్ణ పాత్ర కోసం ముందు భారతీరాజా, మహేంద్రన్‌ లాంటి దర్శకుల్ని ఎంచుకుందాం అనుకున్నాం. కొత్తదనం కోసం ఆ పాత్రని మహిళగా మార్చాం. ట్రైలర్‌లో వినిపించిన మాటల గురించి అందరూ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మాటలకి అంత స్పందన వచ్చిందంటే అవి రాయడం వెనకున్న ఆలోచనలు అంత పదునుగా ఉన్నాయని అర్థం.!" అన్నారు.

ఇదీ చదవండి:'లవ్​స్టోరీ' ఆ నమ్మకాన్ని ఇచ్చింది: నాగార్జున

Last Updated : Sep 29, 2021, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details