రాజస్థాన్‌లోని ఓ ప్రాంతంలో పసికందును చెత్తకుప్పలో వదిలేసి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. దుర్వాసన మధ్య ఏడుస్తోన్న ఆ చిన్నారి వీడియో తీసి నెట్టింట పోస్టు చేశారు స్థానికులు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే స్పందించిన సీనియర్ పాత్రికేయుడు, బాలీవుడ్ దర్శకుడైన వినోద్ కాప్రి దంపతులు ఆ పసికందును స్వీకరించేందుకు సిద్ధమయ్యారు.
పాపకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారికి పీహూ అని పేరుపెట్టారు. ‘'పీహూ'’ ఆయన తెరకెక్కించిన సినిమా పేరు.
" ఈ చిన్నారి దేవతతో నేను నా భార్య సాక్షి జోషి ప్రేమలో పడ్డాం. దత్తత తీసుకునే ప్రక్రియ మొదలైంది. పాప కోసం భవిష్యత్తులో ఎంతో చేయాల్సి ఉంది. పాప ఇంకా మా ఇంట్లో అడుగుపెట్టలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగాక మిగిలిన విషయాలు మాట్లాడతాను".
--వినోద్ కాప్రి, బాలీవుడ్ దర్శకుడు
హైదరాబాద్లో పుట్టిన వినోద్ కాప్రి.. 2014లో ఆయన తెరకెక్కించిన 'కాంట్ టేక్ దిస్ షిట్ ఎనీమోర్' అనే లఘు చిత్రానికి జాతీయ అవార్డు గెలుచుకున్నారు. పదేళ్లకు పైగా జర్నలిస్టుగా పలు సంస్థల్లో అనుభవమున్న ఆయన... గతేడాది పీహూ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు.