"నిజ జీవితాల్లోని సంఘటనల నుంచే స్ఫూర్తి పొందుతుంటా. నా సినిమాల కథలు అక్కడి నుంచే పుడుతుంటాయి" అని దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి అన్నారు. వైవిధ్యమైన కథలకు కేరాఫ్ ఆయన. కథనంతో ప్రేక్షకుల్ని కట్టిపడేయడం ఆయన శైలి. చేసింది తక్కువ సినిమాలే కానీ... ప్రేక్షకులపైనా, పరిశ్రమపైనా వాటి ప్రభావం గట్టిగానే ఉంటుంది. 'ఐతే', 'అనుకోకుండా ఒక రోజు', 'ఒక్కడున్నాడు', 'సాహసం', 'మనమంతా'... ఇలా ఎప్పుడు చూసినా కొత్తగా అనిపించే సినిమాలు ఆయనవి. ఇప్పుడు నితిన్ కథానాయకుడిగా 'చెక్' తీశారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు, శనివారం విలేకర్లతో ముచ్చటించారు.
"సినిమా అయినా ఇతర ఏ రంగంలోనైనా ఎంత వేగంగా ముందడుగు వేస్తున్నారనేది విజయంపైనే ఆధారపడి ఉంటుంది. ఒక పెద్ద విజయం వచ్చేంతవరకు ఎవరికైనా విరామం తప్పదు. కథల కోసమే నేను సమయం తీసుకుంటానని అనుకుంటారు. కానీ నిజానికి ఈ విరామంలో రెండు మూడు కథలు సిద్ధం చేసుకున్నా. నితిన్‌తో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. తనకు ఈ కథయితే బాగుంటుందని 'చెక్' చేశాం. యాక్షన్ సహా అన్ని వాణిజ్యాంశాల్ని జోడించిన సినిమా ఇది.
*నేను తీసిన గత చిత్రాల్లాగే ఇందులోనూ కథనం కీలకం. దాంతోపాటు హ్యూమన్ డ్రామా అందరికీ నచ్చేలా ఉంటుంది. జైలు నేపథ్యంలో 70 శాతం సన్నివేశాలు సాగుతాయి. ఈ సినిమా కోసం పలు జైళ్లకు వెళ్లి అక్కడి పరిస్థితుల్ని తెలుసుకునేందుకు ప్రయత్నించా. ఈ చిత్రం కోసం మేం ఓ కల్పిత జైలుని సృష్టించాం. గద్వాల్ జైల్ అని పేరు పెట్టి ఆ నేపథ్యంలోనే మేం సన్నివేశాల్ని తెరకెక్కించాం. రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, మురళీశర్మ, సంపత్‌రాజ్, సాయిచంద్ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. మేం సినిమాకు 50 శాతం చేస్తే, కళ్యాణి మాలిక్ తన సంగీతంతో మరో 50 శాతం జోడించాడు. రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరా, వివేక్ కళ, నరేష్ రచన, ఆనంద్ ప్రసాద్ నిర్మాణ విలువలు... ఇలా ప్రతి విభాగం ఈ సినిమాకు ఓ కొత్త హంగును జోడించింది.