సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకోవడం అంత సులభమైన విషయం కాదని అందరికీ తెలిసిందే. ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కొని నిలబడగలిగితేనే విజయం వరిస్తుంది అనడానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కెరీర్ ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సినిమా మీద ఉన్న ప్రేమ, ఆసక్తితో ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని వదులుకొని సుకుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. సుకుమార్ అసిస్టెంట్‌గా పని చేసిన బుచ్చిబాబు 'ఉప్పెన'తో దర్శకుడిగా మారారు. ఫిబ్రవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. సినిమా ప్రచారంలో భాగంగా తన గురువు సుకుమార్ గురించి బుచ్చిబాబు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
"1998లో కాకినాడలోని ఓ కళాశాలలో సుకుమార్ గణిత అధ్యాపకుడిగా పని చేసేవారు. ఆ రోజుల్లోనే ఆయన నెలకు రూ.75 వేల వరకూ సంపాదించేవారు. ఒక ఎకరం వ్యవసాయ భూమి కూడా ఉండేది. అయితే సినిమా మీద ఉన్న ఆసక్తితో తన ఉద్యోగాన్ని వదులుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఆయన జీతం రూ.500 మాత్రమే. ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొదట్లో కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా, రచయితగా పనిచేశారు. అనంతరం 2004లో విడుదలైన 'ఆర్య'తో డైరెక్టర్‌గా తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు."