కొంతమంది దర్శకులు కేవలం కుటుంబ కథా చిత్రాలు మాత్రమే తెరకెక్కించగలరు. ఇంకొంతమంది కేవలం యాక్షన్ తరహా సినిమాలు మాత్రమే రూపొందిస్తారు. కానీ ఎమోషన్, యాక్షన్, రిలేషన్ సమపాళ్లలో పెట్టి సినిమాలు రూపొందించగల దర్శకుడు అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు బోయపాటి శ్రీను. చేసే ప్రతి సినిమాను గత సినిమాల కంటే బాగుండాలని తాపత్రయపడే దర్శకుల జాబితాలో ఆధునిక కాలంలో మొదట ఉండే దర్శకుడు ఆయనే. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం 'భద్ర' విడుదలై నేటికి 15 ఏళ్లు. ఈ పదిహేనేళ్ల కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్నారు శ్రీను. ఈ సందర్భంగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రాల గురించి తెలుసుకుందాం.
భద్ర (2005)
మాస్ మహారాజ రవితేజ, మీరా జాస్మిన్ ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. యాక్షన్, ఫ్యాక్షన్ మేళవించిన కుటుంబ కథా చిత్రంగా బాక్సాఫీస్ ముందు ఈ సినిమా ఘనవిజయం సాధించింది. పలు భాషల్లోనూ పునఃనిర్మితమైంది.
'భద్ర' చిత్రీకరణలో మాస్ మహారాజ్ రవితేజకు సీన్ వివరిస్తున్న బోయపాటి శ్రీను తులసి (2007)
విక్టరీ వెంకటేశ్, నయనతార జోడిగా నటించిన చిత్రం 'తులసి'. బోయపాటి మార్కు పవర్ఫుల్ డైలాగ్స్, వెంకటేశ్ నటన ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి నిర్మాతగా దగ్గుబాటి సురేశ్ వ్యవహరించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు.
సింహా (2010)
నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం 'సింహా'. ఈ సినిమా వీరిద్దరి కెరీర్లో మైలురాయిగా నిలవడమే కాకుండా ఇందులోని డైలాగ్‌లు ప్రేక్షకుల చేత ఈలలు కొట్టించాయి. బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిందీ సినిమా.
దర్శకుడిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న బోయపాటి శ్రీను దమ్ము (2012)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. త్రిష, కార్తీక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'దమ్ము'. ఈ సినిమాలో తారక్ వేషధారణతో పాటు యాక్షన్ సీక్వెన్స్ మాస్ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది.
లెజెండ్ (2014)
నందమూరి బాలకృష్ణ, బోయపాటి కలయికలో రూపొందిన మరో బ్లాక్బాస్టర్ చిత్రం 'లెజెండ్'. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన రెండు సినిమాల్లో డైలాగ్‌లు ప్రధానంగా నిలిచాయి. ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ దక్కించుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడం సహా మంచి విజయాన్ని అందుకుందీ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన హిందీ డబ్బింగ్‌కు యూట్యూబ్‌లో దాదాపుగా 2 కోట్ల వీక్షణలు లభించాయి. ఈ చిత్రంతో ఉత్తరాదిన బాలయ్య క్రేజ్ మరింత పెరిగింది.
దర్శకుడిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న బోయపాటి శ్రీను సరైనోడు (2016)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా 'సరైనోడు'. బోయపాటి ఖాతాలో వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు. ఇందులో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ నటించారు. ఈ సినిమా హిందీ డబ్బింగ్ యూట్యూబ్‌లో దాదాపు 28 కోట్ల వీక్షణలతో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ మూవీతో అల్లు అర్జున్, బోయపాటిల క్రేజ్ ఉత్తరాదిన మరింత పెరిగింది.
జయ జానకి నాయక (2017)
బోయపాటి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్-ప్రేమ కథా చిత్రం 'జయ జానకి నాయక'. ఇందులో యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎం. రవీందర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. మాస్ ప్రేక్షకులకు కాస్త చేరువైనా అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది.
దర్శకుడిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న బోయపాటి శ్రీను వినయ విధేయ రామ (2019)
ఇండస్ట్రీ హిట్ 'రంగస్థలం' తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం 'వినయ విధేయ రామ'. కియరా అద్వానీ హీరోయిన్గా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చింది.
ప్రస్తుతం బాలయ్య-బోయపాటి మూడో చిత్రం కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులను పూర్తి చేస్తున్నారు బోయపాటి. ఇప్పటికే 'సింహా', 'లెజెండ్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ కాంబినేషన్ మరోసారి ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఇదీ చూడండి.. కళ్లజోడుతో క్లాస్‌గా కనిపించే ఊరమాస్ డైరెక్టర్