మాస్ నాడి తెలిసిన దర్శకుడు... బోయపాటి శ్రీను. పతాక స్థాయి వాణిజ్య హంగులు... హీరోయిజం ఆయన సినిమాల్లో ఉట్టిపడుతుంటాయి. తెలుగు చిత్రసీమలో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్న బోయపాటి బాక్సాఫీసుని ప్రభావితం చేసేలా సినిమాల్ని తీశారు. ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక నంది పురస్కారాన్ని అందుకున్నారు.
బోయపాటి శ్రీను.. గుంటూరు జిల్లా, పెద కాకానిలో జన్మించారు. గుంటూరులోని జేకేసీ కళాశాల నుంచి డిగ్రీ పట్టభద్రుడై.. నాగార్జున విశ్వ విద్యాలయంలో చేరారు. వారి కుటుంబానికి ఫొటో స్టూడియో ఉండటం వల్ల సినీ పరిశ్రమ వైపు ఆసక్తిని కనబరిచారు. అనంతరం కొన్నాళ్లపాటు పాత్రికేయుడిగా పనిచేశారు.
చిత్రసీమలో ఎంట్రీ
1997లో ముత్యాల సుబ్బయ్య దగ్గర దర్శకత్వ శాఖలో చేరారు. 'ఒక చిన్న మాట', 'గోకులంలో సీత', 'పెళ్ళి చేసుకుందాం', 'పవిత్ర ప్రేమ', 'అన్నయ్య', 'మనసున్న మారాజు' తదితర చిత్రాలకి సహాయ దర్శకుడిగా పనిచేశారు బోయపాటి. 'భద్ర'తో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రమే ఘన విజయం సాధించడం వల్ల బోయపాటి శ్రీనుకి అగ్ర కథానాయకులతో కలిసి సినిమాలు చేసే అవకాశం వచ్చింది.