తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వెంకీమామ' చేయకూడదని అనుకున్నా.. కానీ! - DIRECTOR BOBBY INTERVIEW ABOUT VENKY MAMA CINEMA

'వెంకీమామ'.. త్వరలో విడుదల కానున్న సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకున్నాడు దర్శకుడు బాబీ. తొలుత ఈ సినిమా చేయకూడదనుకున్నట్లు చెప్పాడు. అయితే ఈ చిత్రంతో ఓ విభిన్న ప్రయత్నం చేశానని అన్నాడు. వీటితో పాటే మరిన్ని సంగతులు వెల్లడించాడు.

వెంకీమామ సినిమా దర్శకుడు బాబీ
వెంకీమామ సినిమా ట్రైలర్

By

Published : Dec 6, 2019, 7:45 PM IST

'వెంకీమామ'.. దగ్గుబాటి, అక్కినేని కుటుంబాలకే కాదు, సినీప్రియులకు గొప్ప అనుభూతిని పంచే చిత్రమవుతుందని దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర అన్నాడు. స్క్రీన్‌ప్లే రచయితగా పరిచయమై 'పవర్‌', 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌', 'జై లవకుశ' సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి దర్శకత్వంలో వెంకటేశ్-నాగచైతన్య నటించిన మల్టీస్టారర్ 'వెంకీమామ'. ఈనెల 13న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించాడు బాబీ. ఆ విశేషాలివే.

దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ)

'వెంకీమామ' రామానాయుడి కలల చిత్రం కదా. ఈ అవకాశం దక్కడం మీకెలా అనిపించింది?

బాబీ: ఇది నాకు దక్కిన చాలా పెద్ద బాధ్యత.. గొప్ప గౌరవం కూడా. ఈ కథ నాకు ఇచ్చినప్పుడే సురేశ్​బాబు ఈ విషయం చెప్పారు. మా నాన్న కలల బాధ్యతను నీ చేతుల్లో పెట్టామన్నారు. ఆ క్షణం చాలా సంతోషంగా అనిపించింది. నేనూ ఈ చిత్రాన్ని నా జీవితంలా ఫీలై చేశా. నా బలం ఏంటో ప్రేక్షకులకు చూపించాలి అని కసితో కష్టపడ్డా.

టైటిల్‌ ఆలోచన ఎవరిది?

బాబీ: పూర్తిగా సురేశ్​బాబుదే. స్క్రిప్ట్‌ పనుల్లో పడి టైటిల్‌పై అంత దృష్టి పెట్టలేదు. ఓరోజు సురేశ్ సర్‌ ఫోన్‌ చేసి పేరు గురించి ఏం ఆలోచించావు అన్నారు. ఇంకా ఏం అనుకోలేదన్నా. సరే.. 'వెంకీమామ' ఎలా ఉంది? చైతూ ఎప్పుడూ వెంకటేశ్​ను అలాగే పిలుస్తుంటాడు. ఈ పేరు ఓకేనా అన్నారు. ఆ పేరులోనే కథ ఉంది. సినిమాలోని విషయాన్ని ఉన్నదున్నట్లు చెప్పేస్తుంది. మరో ఆలోచన లేకుండా ఇదే పెట్టేద్దామన్నా.

దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ)

ఇంతకీ 'వెంకీమామ'ను మీరు పట్టుకొచ్చారా? వాళ్ల కథే మిమ్మల్ని పట్టుకుందా?

బాబీ: ఈ కథలోకి నేను అనుకోకుండా వచ్చా. నిర్మాత సురేశ్​బాబు నాకీ అవకాశమిచ్చారు. నిజానికి 'జై లవకుశ' తర్వాత ఓ అగ్ర హీరోతో సినిమా చేయాలని ఏర్పాట్లు చేసుకున్నా. ఆ సమయంలోనే కోన వెంకట్‌ నన్ను కలిసి ఈ ప్రాజెక్టు గురించి చెప్పారు. 'సురేశ్​బాబు.. వెంకటేశ్-నాగచైతన్యలతో మామా అల్లుళ్ల చిత్రమొకటి చేద్దామనుకుంటున్నారు. ఓసారి నువ్వు వెళ్లి కథ వినొచ్చుగా' అని సలహా ఇచ్చారు. దాంతో వెళ్లి కథ విన్నా. నాక అందులో మామా అల్లుళ్ల మధ్యలో కనిపించిన వినోదం తప్ప మిగతా కథ నచ్చలే. కానీ, ఈ విషయం సురేశ్​బాబు​తో ఎలా చెప్పాలో తెలియక కొన్ని రోజులు సమయం కావాలని చెప్పి వచ్చేశా. తర్వాత కొన్నాళ్లకు ఆయనే మళ్లీ ఫోన్‌ చేసి సినిమా విషయమై మాట్లాడదాం రమ్మన్నారు. నేను ఒప్పకోకూడదు అనుకుంటూనే ఆయన దగ్గరకెళ్లి కథ నచ్చలేదని చెప్పేశా. దానికి ఆయన 'నీపై నమ్మకం ఉంది. నువ్వు స్క్రిప్ట్‌లో ఏ మార్పులు చేస్తావో చేసి పట్టుకురా' అన్నారు. ఆ తర్వాత నా బృందంతో కలిసి కూర్చొని కథలో చాలా మార్పులు చేసి సురేశ్​ సర్​కు చెప్పాం. ఆయనకది బాగా నచ్చడం వల్ల వెంటనే సినిమాను పట్టాలెక్కించాం.

సురేశ్​బాబుకు కథ చెప్పి ఒప్పించడం చాలా కష్టమంటుంటారు కదా. మీరు చాలా సులభంగా ఆ పని కానిచ్చేసినట్లున్నారు?

బాబీ: నిజమే.. అందరూ అంటుంటే ఏమో అనుకున్నా కానీ, నేను రంగంలోకి దిగాక నాకూ ఆ విషయం అర్థమైంది. నేను కథలో మార్పులు చేసి ఆయనకి చెప్పగానే సరే అనేశారు. ఈ సంతోషంలో వారం రోజులు గడిచాయో లేదో.. తర్వాతి నుంచి ఆయన ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. నువ్వు చెప్పిన కథలో బాగున్న అంశాలివి. బాగోలేనివి ఇవి అంటూ బోర్డుపై ఓ ప్రశ్నల జాబితాను రూపొందించారు. ఇక అక్కడి నుంచి వాటికి జవాబులు వెతకడమే నా పని అయిపోయింది. ఓ దశలో నాకు విసుగు అనిపించేది. అయినా ఆయనతో చేసిన ఈ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదించా. ఒకరకంగా ఆయన వేసిన ప్రతి ప్రశ్న, చెప్పిన ప్రతి మార్పు సినిమా మరింత బాగా రావడంలో ఎంతో మేలు చేశాయి.

దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ)

ఇంతకీ కథ పూర్తిగా మీరు రాసుకున్నదేనా?

బాబీ: లేదు. సురేశ్​బాబు నాకు మొదట చెప్పిన కథే. ఆయన వెంకటేశ్- చైతూలతో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో కథలు విన్నారు. వాటిలో జనార్థన మహర్షి చెప్పిన కథ బాగా నచ్చడం వల్ల దాన్ని పక్కకు పెట్టారు. నేను విన్నది ఆ కథే. అయితే ఇందులో మూలకథను మాత్రమే తీసుకోని ఎన్నో మార్పులు చేసి ఈ కొత్త స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకున్నాం. అందుకే కథా రచయితగా జనార్థన మహర్షికి క్రెడిట్‌ ఇచ్చాం.

ఈ చిత్రంలో వెంకటేశ్ - చైతూలు ఎలా కనిపించబోతున్నారు?

బాబీ: పల్లెటూరి నేపథ్యంగా సాగే మామా అల్లుళ్ల కథ ఇది. వెంకటేశ్ మిలటరీ నాయుడుగా కనిపిస్తారు. ఆయన నమ్మేది రెండిటినే. ఒకటి కిసాన్‌.. రెండు సోల్జర్‌. నాగచైతన్య సిటీ నుంచి పల్లెటూరికి వచ్చిన అబ్బాయిగా కనిపిస్తాడు. మేనమామ చాటు బిడ్డగా పెరిగిన అతడు మిలటరీకి ఎందుకు వెళ్లాడు? వెంకీమామకు మిలటరీకి సంబంధం ఏంటి? ఊరిలో వీరిద్దరూ ఏం చేశారు? ఈ మామా అల్లుళ్ల అనుబంధమేంటి? తదితర అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. ఆద్యంతం వినోదాత్మకంగా, భావోద్వేగాల సమ్మేళనంగా సాగుతుంది. వెంకీ, చైతూ ఇద్దరి పాత్రలకు సరిసమానమైన ప్రాధాన్యం ఉంటుంది. ఒకరెక్కువ తక్కువ అని ఏం ఉండదు. ఈ కథ రాసుకున్నప్పుడు మదిలో ఒకటే అనుకున్నా.. చిత్రం చూసిన ప్రతిఒక్కరికీ తమ మేనమామలు, మేనల్లుళ్లు గుర్తుకు రావాలని అనుకున్నా.

పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా ఈ కథలోకి ఎలా వచ్చారు?

బాబీ: ఇద్దరూ అనుకోకుండానే కథలోకి వచ్చారు. వెంకీ సరసన కనిపించబోయే నాయిక టీచర్‌ కాబట్టి పరిణతితో కూడిన భావాలతో కనిపిస్తూనే గ్లామర్‌గానూ ఉండాలి. ఆ లక్షణాలు నాకు పాయల్‌ రాజ్‌పుత్‌లో కనిపించాయి. నిజానికి ఈ పాత్రకు ఆమెను నాకు తొలుత సూచించింది తమన్‌. తనే పాయల్‌ ఫొటోను నాకు పంపించాడు. అది చూడగానే వెంకీకి ఆమె సరిగ్గా సరిపోతుందనిపించింది. రాశీఖన్నా పాత్రకు ముందు ఇద్దరు ముగ్గుర్ని అనుకున్నాం. ఆఖరి నిమిషంలో రాశీకి ఫిక్స్‌ అయ్యాం.

'సినిమాలో ప్రధాన ఆకర్షణలు ఏంటి' అని అడిగితే ఏం చెప్తారు?

బాబీ: కథలో బలం ఉంది. 'మనం'లోని భావోద్వేగాలు, 'ఎఫ్‌2'లోని వినోదం వీటన్నింటికీ తోడు చక్కనైన యాక్షన్‌ సీన్స్ ఉన్నాయి. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత వెంకటేశ్​లోని పూర్తి మాస్‌ కోణాన్ని ఇందులో చూడొచ్చు. ఆయన 'లక్ష్మీ' తర్వాత అంత మాస్‌ పాత్రను మళ్లీ చేయలేదు. నాకు ఆ సినిమా బాగా ఇష్టం. ఇందులో ఆ మాస్‌ కోణాన్ని బాగా చూపించా. ఇప్పటికే సినిమాను కొంతమందికి చూపించాం. చూసిన ప్రతిఒక్కరూ 'ఇంత మంచి సినిమా త్వరగా బయటకి రావాలి' అని కోరారు. నిజానికి దసరాకే తీసుకురావాల్సి ఉంది. అందుకు తగ్గట్లుగానే చిత్రీకరణ పూర్తి చేశాం. కానీ చివర్లో ఓ పాట చిత్రీకరణ మిగిలి ఉందనగా వెంకటేశ్​ కాలికి గాయమైంది. చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది.

సినిమా చూశాక దగ్గుబాటి, అక్కినేని కుటుంబాల స్పందనేంటి?

బాబీ: నాగార్జున ఇంకా చూడలేదు. వెంకటేశ్, చైతన్య, సురేశ్​బాబు, తమన్‌ అందరూ చూశారు. చాలా సంతోషంగా ఫీలయ్యారు. సురేశ్ ఎప్పుడూ బహిరంగంగా పొగడటం వంటివి చేయరు. కానీ ఈ సినిమా చూశాక చాలా సంతృప్తిగా కనిపించారు. వెంకీ.. ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లావన్నారు. చైతూ.. గట్టిగా కౌగిలించుకొని థ్యాంక్స్‌ చెప్పాడు. రవితేజ తర్వాత నాకు థ్యాంక్స్‌ చెప్పిన హీరో చైతూనే. ఇవన్నీ నాకెంతో తృప్తిని, ఆనందాన్ని కలిగించాయి.

ఇంతకీ సెట్స్‌లో వెంకీ, చైతూలు ఎలా ఉండేవాళ్లు?

బాబీ: ఎక్కడైనా సరే ఇద్దరి ప్రవర్తన బాగుండాలి అంటే.. అది వాళ్ల కుటుంబాల నుంచే రావాలి. వెంకటేశ్​కు అది రామానాయుడిగారి నుంచే వచ్చింది. ప్రతిఒక్కరితో ఆయన చాలా గౌరవంగా ఉంటారు. తమ పని చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. చైతూ.. తన మామలాగే చాలా సింపుల్‌గా ఉంటాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం. సన్నివేశం పక్కాగా వచ్చే వరకు ఎన్నిసార్లు చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు.

వెంకీమామ సినిమాలోని స్టిల్

ఎక్కువగా ఏ తరహా జోనర్‌లను ఇష్టపడతారు? మీ తర్వాతి ప్రాజెక్టులేంటి?

బాబీ: వాణిజ్యాంశాలున్న చిత్రాల్ని తెరకెక్కించడానికే ఎక్కువ ఇష్టపడుతుంటా. ఒకవేళ ఇది కాకుండా మరేదైనా చేయాల్సి వస్తే భావోద్వేగాలతో నిండిన కథ చేస్తా. 'వెంకీమామ'తో ఓ సరికొత్త ప్రయత్నం చేశా. ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ప్రస్తుతం నా దగ్గర రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఈ హడావుడి పూర్తయిన తర్వాతే వాటిపై నిర్ణయం తీసుకుంటా.

ఆ సీన్స్‌ చెయ్యడానికి చాలా కష్టపడ్డాం: బాబీ

‘వెంకీమామ’ చిత్రీకరణ మొత్తంలో చాలా సవాల్‌గా నిలిచింది కశ్మీర్‌ ఎపిసోడ్‌. అక్కడి గ్లేషియర్‌ పర్వత శిఖరాల్లో 13 రోజుల పాటు యాక్షన్‌ సన్నివేశాల్ని చిత్రీకరించాం. అవి దూరం నుంచి చూడటానికి ఎంత బాగుంటాయో.. అక్కడికి వెళ్లి షూటింగ్ జరపడం అంత కష్టం. ఆ మంచులో అంతెత్తున్న పర్వతంపైకి ఎక్కడమంటే మాటలు కాదు. హీరోలు, సిబ్బంది ఎవరైనా సరే పైవరకు నడిచి వెళ్లాల్సిందే. ఉదయం 5 గంటలకు బయలుదేరితే మా సిబ్బంది, సామాగ్రిని వేసుకోని అక్కడికి చేరుకోవడానికి 9 గంటలయ్యేది. అందుకే ముందు అక్కడ చిత్రీకరణ అనుకున్నప్పుడు ఇదంతా రిస్క్‌ వద్దులే అన్నా. కానీ సురేశ్​బాబు.. ఎంత కష్టమైనా పర్లేదు అక్కడే చేద్దాం అని ప్రోత్సహించడం, వెంకీ - చైతూలు సై అనడం వల్ల షూటింగ్ పూర్తి చేశాం. రామ్‌- లక్ష్మణ్ ఆధ్వర్యంలో తెరకెక్కించిన ఈ పోరాట ఘట్టాలు చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ABOUT THE AUTHOR

...view details