తమిళ సినీరంగంలో శివాజీ గణేశన్, ఎమ్జీఆర్‌లు సూపర్స్టార్లుగా ఎదుగుతున్న రోజుల్లో కొత్త నటులను ప్రోత్సహించి వారిని సూపర్‌స్టార్ల స్థాయికి చేర్చడం అందరికీ సాధ్యమౌతుందా? మానవ సంబంధాలోని సంక్లిష్టతలు, సామాజిక సమస్యలను కథాంశాలుగా ఎంచుకొని వాటిని సహజమైన సినిమాలుగా మలిచి, సినిమా రంగానికి కొత్తదారి పట్టించడం నూతన దర్శకులకు సంభవమేనా? హాస్యనటుడిగా ముద్రపడిన ఓ నటుడిని హీరోగా పరిచయం చేసే సాహసం చేయగల దర్శకులు ఆ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం..కె.బాలచందర్!
సూపర్‌స్టార్లు రజినీకాంత్, కమల్‌హాసన్, క్యారక్టర్ నటుడు ప్రకాశ్‌రాజ్, హీరోయిన్లు జయప్రద, సరిత, సుజాత.. వంటి శిష్యగణాలను వెండితెరకు పరిచయం చేశారు దర్శకుడు బాలచందర్. ఆయన పాత్రలు మన చుట్టూ ఉన్న సమాజం నుంచే పుట్టుకొచ్చాయి. జీవితాల్ని ఆవిష్కరించడం, ఉద్వేగాలను పండించడమే బాలచందర్ విజయరహస్యం. కథలే ఆయన సినిమాలో హీరోలు. భారత చలనచిత్ర రంగానికి, ముఖ్యంగా దక్షిణ భారత చిత్రసీమకు బాలచందర్ అందించిన బహుముఖ సేవలు అనంతం. నేడు (జులై 9) బాలచందర్ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.
వ్యక్తిగతం
తంజావూరు జిల్లా సన్నిలం గ్రామంలో దండపాడి కైలాసం, సరస్వతి దంపతులకు 1930 జులై 9న జన్మించారు కైలాసం బాలచందర్. తన పన్నెండవ ఏటనే 'థియేటర్ ఆర్టిస్టు సంఘం'లో సభ్యులయ్యారు. అన్నామలై యూనివర్సిటీలో బీఎస్సీ పట్టా తీసుకొని అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఉద్యోగం చేశాడు. తీరిక సమయాల్లో సరదాగా నాటక రచనలు చేస్తున్న సమయంలో, ఆయన రాసిన 'మేజర్ చంద్రకాంత్' నాటకం ఎంజీఆర్ దృష్టిని ఆకర్షించింది. అలా ఎంజీఆర్ ప్రోత్సాహంతో 1964లో 'దైవత్తాయ్' సినిమాకు తొలిసారి మాటలు రాసి, స్క్రీన్ ప్లే సమకూర్చారు.