దర్శకుడు అనిల్ రావిపూడి ఎంత హుషారుగా కనిపిస్తాడో.. ఆయన సినిమాలు ప్రేక్షకులకు అంతే ఉత్సాహాన్ని పంచుతాయి. ఆయన కథలు, అందులోని పాత్రలు ప్రతి ఒక్కరికీ ఎంతో దగ్గరగా అనిపిస్తాయి. కడుపుబ్బా నవ్విస్తాయి, బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తాయి. వరుస విజయాలతో దూసుకెళుతున్న అనిల్... తన మార్క్ ఫన్, ఫ్రస్టేషన్‌ని మరోసారి మేళవిస్తూ 'ఎఫ్3'ని(Anil Ravipudi F3)తెరకెక్కిస్తున్నారు. మంగళవారం అనిల్ రావిపూడి పుట్టినరోజు (Anil Ravipudi Birthday). ఈ సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
"సింహభాగం దైనందిన జీవితంలో ఎదురైన పరిస్థితులు, కనిపించిన మనుషుల నుంచే కథలు, పాత్రలు పుడుతుంటాయి. అందులోనే అందరూ కనెక్ట్ అయ్యే అంశాలు ఉంటాయి. నా ఇంట్లో నాకు ఎదురైన అనుభవాలు, సమస్యలు 'ఎఫ్3' కథలో ఉంటాయి. 'ఎఫ్2'ని కూడా నా బయోపిక్, మగాళ్లందరి బయోపిక్ అని కూడా చెప్పా. ఫన్, ఫ్రస్ట్రేషన్ లాంటి అంశాల్ని తీసుకుని ఓ ఫ్రాంచైజీగా తీర్చిదిద్దడమే ఓ ప్రత్యేకమైన విషయంగా భావిస్తున్నా. ఈ సినిమా కోసం బోలెడంతమంది నటులతో కలిసి పనిచేశా. ఒక దశలో అలసిపోయా. పతాక సన్నివేశాల కోసం 35 మంది నటులతో పది రోజులు చిత్రీకరణ చేశాం. వచ్చేవాళ్లు, పోయేవాళ్లు, ఆ క్యారవ్యాన్లు, ఆ హడావుడి చూశాక ఈవీవీ సత్యనారాయణ సర్ గుర్తొచ్చారు. అంత మంది నటుల్ని ఆయన ఎలా హ్యాండిల్ చేసేవారో అనిపించింది. నా శైలి వినోదమే కాకుండా, మధ్యలో ఓ కొత్త రకమైన కథతో సినిమా చేసే ప్రయత్నం చేస్తుంటా. 'ఎఫ్2' తర్వాత 'సరిలేరు..'ని ఓ సీరియస్ కథతోనే చేశా. కానీ కుటుంబ ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి కదా అని వినోదాన్ని జోడించాం అంతే. ఇప్పుడు చేస్తున్న 'ఎఫ్3'తో నవ్వించి, ఆ తర్వాత బాలకృష్ణతో (Anil Ravipudi Balakrishna) చేయబోయే సినిమాతో ఓ కొత్త జోనర్‌ని స్పృశించబోతున్నా."
- అనిల్ రావిపూడి, దర్శకుడు
- "నేను దర్శకుడయ్యాక జరుపుకుంటున్న ఆరవ పుట్టినరోజు ఇది. ఇప్పటిదాకా సాగిన ప్రయాణం.. దర్శకుడిగా ఎక్కిన ప్రతి మెట్టూ ఎంతో తృప్తినిచ్చింది. చాలా విషయాల్ని నేర్పింది. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. ఈసారి పుట్టిన రోజునాడు 'ఎఫ్3' చిత్రీకరణలోనే ఉంటా. కరోనా మహమ్మారి నుంచి మళ్లీ మెల్ల మెల్లగా సాధారణ జీవితంలోకి అడుగు పెడుతున్నాం. కచ్చితంగా ఈ ఒత్తిడిని తీసేయడానికి రెండున్నర గంటల ఔషధంగా మా 'ఎఫ్3' రాబోతోంది. కాకపోతే ఈసారి మేం సంక్రాంతికి రావడం లేదనే విషయమే కొంచెం నిరుత్సాహంగా అనిపించింది. 'ఎఫ్2', 'సరిలేరు నీకెవ్వరూ' వరుసగా సంక్రాంతికే విడుదలయ్యాయి. ఇది కూడా వచ్చుంటే హ్యాట్రిక్ సినిమా అయ్యుండేది. ఈసారి పెద్ద సినిమాల విడుదలలు ఉన్నాయి కదా. మేం కూడా పెద్ద సినిమాల మధ్య నలిగిపోకూడదని, సోలోగానే వద్దామని నిర్ణయించాం. అందుకే మా 'ఎఫ్3' ఎప్పుడొస్తే అప్పుడే పండగ అని సర్దిచెప్పుకుని విడుదల గురించి ఓ నిర్ణయం తీసుకున్నాం."
- "కొనసాగింపు చిత్రం ఉంటుందని 'ఎఫ్2' శుభం కార్డులోనే సూచించాం. కానీ అప్పట్లో కథ గురించి ఏమీ అనుకోలేదు. హిందీ తరహాలో మనకు కూడా ఇదొక ఫ్రాంఛైజీలా ఉంటే బాగుంటుంది కదా అనే కొనసాగింపు ఉంటుందని చూచాయగా చెప్పాం. డబ్బు నేపథ్యంలో ఓ మంచి కాన్సెప్ట్ కుదరడం వల్ల 'ఎఫ్3'ని పట్టాలెక్కించాం. డబ్బు కోసం మనం నిత్యం చేసే ప్రయత్నాల్లో చాలా ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంటుంది కదా. అందుకే ఈ అంశాన్ని ఎంచుకున్నాం. మనందరికీ అనుభవమైన విషయాలే కాబట్టి ఇది ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఈసారి మరిన్ని కొత్త పాత్రల్ని జోడించాం. 'ఎఫ్2' ఇచ్చిన ఉత్సాహమో మరేమో తెలియదు కానీ.. వెంకటేష్, వరుణ్‌తేజ్ ఈసారి ఇంకా బాగా చేశారు. కచ్చితంగా ఊహించుకుని వచ్చిన దానికంటే ఎక్కువే నవ్వుకుంటారు. ఇందులో మేనరిజమ్స్ కోసమని ప్రత్యేకంగా సంభాషణలేమీ రాయలేదు కానీ, ఆయా పాత్రలు చేసే పనులు బాగా నవ్విస్తాయి. వెంకటేష్ రేచీకటి బాధితుడిగా, వరుణ్ నత్తిగా మాట్లాడే కుర్రాడిగా కనిపిస్తారు. అక్కడక్కడా అలా కనిపించినా ప్రేక్షకులు మాత్రం బాగా నవ్వుకుంటారు. వాళ్లిద్దరికే కాదు, ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది."
- "హిందీకి వెళ్లే ఆలోచనదీ లేదు. ప్రస్తుతం ఇక్కడ నా ప్రయాణం సౌకర్యంగానే ఉంది. నాకంటూ ఓ కుర్చీ ఉంది. అందులో నుంచి లేవాలనుకోవడం లేదు. ఒక ఏడాది హిందీలో సినిమా కోసమని వెళ్లాననుకో. ఇక్కడ నా కుర్చీ పరిస్థితేమిటి? (నవ్వుతూ). భవిష్యత్తులో అవకాశం ఉంటే పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేస్తా. మార్కెట్ పరిస్థితుల్నిబట్టే నేను అప్పటికప్పుడు కథల్ని సిద్ధం చేసుకుంటుంటా. బాలకృష్ణతో చేయబోయే సినిమాకీ, ఇదివరకు అనుకున్న 'రామారావుగారు' కథకీ సంబంధం లేదు. నేను వినోదాత్మక చిత్రాలు చేస్తాను కాబట్టి బాలకృష్ణతోనూ అలాంటి సినిమానే చేస్తానేమో అనుకుంటున్నారేమో. ఇది అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నేను కూడా ఆత్రుతగా ఉన్నా ఈ సినిమా కోసం. జనవరి నుంచి ఆ స్క్రిప్ట్‌పై దృష్టిపెడతా. జూన్ లేదా జులై నుంచి చిత్రీకరణ మొదలుపెడతాం." అని చెప్పాడు అనిల్.